వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి : ఖమ్మం కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఎండల తీవ్రతను దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. శనివారం కొత్త కలెక్టరేట్ లోని చాంబర్ లో వడదెబ్బ నుంచి రక్షణ పొందే సూచనల పోస్టర్ ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.  ఆశ, ఏఎన్ఎంల వద్ద, అంగన్ వాడీ సెంటర్లు,  పీహెచ్ సీల్లోనూ ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

చిన్నారులు, వయోవృద్ధులు ఇంటికే పరిమితం కావాలని,  ప్రతిరోజు సరిపడా నీరు తాగాలని, బయటకు వెళ్తే  గొడుగు, టోపీని, కాటన్ వస్త్రాలను ధరించాలని సూచించారు.  ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ తీసుకోవాలని, తద్వారా వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చన్నారు. డీఎంహెచ్ ఓ బి. మాలతి, టీఎస్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం పవిత్ర, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్. సైదులు, ఎస్డీపీవో నీలోహన, అధికారులు ఉన్నారు. 

ఎన్నికల ఖర్చు పక్కాగా లెక్కించాలి 

లోక్ సభకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చులు పక్కాగా లెక్కించాలని ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకరనంద్ మిశ్రా తెలిపారు.  కలెక్టరేట్ లో సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ బృందాలకు అవగాహన కల్పించగా..  వ్యయ పరిశీలకులు పాల్గొని, అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడారు.