![సేవ చేసే ఆలోచన ఉంటేనే జిల్లాలో పని చేయండి](https://static.v6velugu.com/uploads/2025/02/khammam-collector-warns-kmc-officers-action-to-be-taken-for-rule-violations_L837T2MOch.jpg)
- రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు
- కేఎంసీ ఆఫీసర్లకు ఖమ్మం కలెక్టర్ వార్నింగ్ .
ఖమ్మం, వెలుగు : ప్రజలకుసేవ చేసే భావన ఉంటేనే ఖమ్మం జిల్లాలో ఉండాలని, లేకపోతే వెళ్లిపోవాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. నగరంలో పారదర్శకంగా పాలన అందించాలని, ఇష్టారీతిన వ్యవహరిస్తే వేటు తప్పదని స్పష్టం చేశారు. తనకు పని కంటే ఎవరూ ముఖ్యం కాదని, రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురువారం కేఎంసీ కార్యకలాపాలపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీజతో కలిసి సమీక్షించారు.
చెత్త పేరుకుపోతున్న 1,248 ఖాళీ స్థలాలను గుర్తించామని, వీటిలో ఎన్ని శుభ్రం చేశామో నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఓనర్లకు నోటీసులు జారీ చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలను హాట్ స్పాట్ లకు జియో ట్యాగ్ చేయాలని, కార్పొరేషన్ పరిధిలో ముందుగా 10 హాట్ స్పాట్ లను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి, అక్కడ ముందు ఎలా ఉంది, తరువాత ఎలా ఉందో ఫొటోలు పెట్టాలన్నారు. జిల్లా ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.
పారిశుధ్య నిర్వహణలో సహకరించని వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ ను రద్దు చేసేందుకు సైతం వెనుకాడవద్దన్నారు. వేసవి దృష్ట్యా కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపునకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలకు, వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లాలో అనుమతి లేకుండా రోడ్డు కటింగ్ చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా నిర్మించే రోడ్ల నాణ్యత పరీక్షించే వరకు బిల్లుల చెల్లింపు చేయవద్దని చెప్పారు. నగరంలో కొత్త ఇండ్ల నిర్మాణం వద్ద సామగ్రి రోడ్లపై వేస్తే ఫైన్ వేయాలని సూచించారు.
మున్నేరు పరివాహక ప్రాంతంలో పర్యటన
మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో అడిషన్ కలెక్టర్‌తో కలిసి ఆయన పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మహిళలతో మాట్లాడుతూ మహిళా సంఘాలు చర్చించుకొని టైలరింగ్, వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, వాటి గ్రౌండింగ్ కు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. వరద కష్టాలు పునరావృతం కావద్దంటే మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మించాలని, దీనికోసం ఇళ్లు తొలగించాల్సి వచ్చినా కొత్త ఇండ్లు ఇచ్చి తొలగిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. అంతకుముందు మున్నేరు నదీ వద్ద రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.