ఖమ్మం కలెక్టరేట్ లో మరో సోలార్ షెడ్ .. ఈవీఎం గోడౌన్​ వైపు ఏర్పాటుచేసే ప్లాన్​

ఖమ్మం కలెక్టరేట్ లో మరో సోలార్ షెడ్ .. ఈవీఎం గోడౌన్​ వైపు ఏర్పాటుచేసే ప్లాన్​
  • రాష్ట్రంలో మొదటి గ్రీన్ బిల్డింగ్ ఇదే
  • రెండేండ్ల కింద  రూ.కోటిన్నరతో సోలార్ పార్కింగ్ షెడ్ ఏర్పాటు
  • కింద వాహనాలకు నీడ, పైన కరెంట్ ఉత్పత్తి
  • నెలకు రూ.2.16 లక్షల విద్యుత్​ బిల్లు ఆదా
  • కలెక్టరేట్ కు 75 శాతం కరెంట్ ఇక్కడే ఉత్పత్తి

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం కలెక్టరేట్ లో మరో సోలార్ పార్కింగ్ షెడ్​ ఏర్పాటుకు జిల్లా ఉన్నతాధికారులు ప్లాన్​ చేస్తున్నారు. 200 కిలోవాట్ల సామర్థ్యంతో ప్రస్తుతం ఈవీఎం గోడౌన్​ ఉన్న వైపు కొత్తగా షెడ్​ నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కలెక్టరేట్ లో ఇప్పటికే 200 కిలో వాట్ల సామర్థ్యంతో రెండేండ్ల కింద సోలార్​ పార్కింగ్ షెడ్​ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దేశంలోనే సోలార్​ విద్యుత్​ లో నడిచే మొదటి కలెక్టరేట్ గా ఖమ్మం రికార్డుల్లోకి ఎక్కింది. రాష్ట్రంలో మొదటి గ్రీన్​ బిల్డింగ్ గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు అక్కడే మరో షెడ్​ ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కలెక్టర్​ ముజమ్మిల్ ఖాన్​ నిర్ణయించారు. ఇటీవల దీనిపై విద్యుత్​ శాఖ, రెడ్కో అధికారులతో సమావేశాన్ని నిర్వహించి కొత్త ప్లాంట్ ఏర్పాటుపై సమీక్షించారు. 

నెలకు రూ.2.16 లక్షలు ఆదాజ...

కలెక్టరేట్ లో సోలార్​ పార్కింగ్ షెడ్​ ఏర్పాటు కారణంగా కలెక్టరేట్ లో నెలకు రూ.2.16 లక్షల కరెంట్ బిల్లు ఆదా అవుతోంది. కలెక్టరేట్ లో పనిచేసే ఉద్యోగుల వాహనాలకు ఒకవైపు నీడనిస్తూనే, మరోవైపు కలెక్టరేట్ కు అవసరమైన విద్యుత్​ లో 75 శాతం కరెంటును ఉత్పత్తి చేస్తోంది. 2023 సెప్టెంబర్​ 2న రూ.1.58 కోట్లతో 200 కిలోవాట్ల సామర్థ్యంతో ఇక్కడ సోలార్​ రూఫ్డ్ పార్కింగ్ షెడ్ ను ఏర్పాటు చేశారు. అప్పటి కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆలోచన మేరకు డీఎంఎఫ్​టీ, సత్తుపల్లి స్పెషల్​ డెవలప్ మెంట్ ఫండ్​ నిధులు దీనికి కేటాయించారు. ఇందులో 100 కిలోవాట్ సామర్థ్యంలో ఒక హైటెన్షన్​ లైన్​, 30 కిలోవాట్ల సామర్థ్యంతో రెండు ఎల్​టీ లైన్లు, 40 కిలోవాట్ల సామర్థ్యంతో మరో ఎల్​టీ లైన్​ ఉన్నాయి.

 ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్​ ను వర్కింగ్ డే రోజుల్లో కలెక్టరేట్ కు వాడుతుండగా, సెలవు రోజుల్లో ఉత్పత్తి అయిన విద్యుత్​ ను నెట్ మీటర్​ ద్వారా గ్రీడ్​ కు ఎక్స్ పోర్ట్ చేస్తున్నారు. కలెక్టరేట్​అవసరాల కోసం నెలకు 28 వేల యూనిట్ల ​విద్యుత్ ఉపయోగిస్తుండగా, 24 వేల యూనిట్లను సోలార్​ షెడ్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన 4 వేల యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. సోలార్​ పవర్​ ద్వారా నెలకు రూ.2.16 లక్షలు కరెంటు బిల్లు ఆదా అవుతుందని విద్యుత్​ శాఖ అధికారులు లెక్కతేల్చారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ప్లాంట్ 25 ఏండ్ల పాటు సోలార్​ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని అధికారులు చెబుతుండగా, ఆరు నుంచి ఏడేండ్లలో విద్యుత్ ఛార్జీల రూపంలో పెట్టుబడి మొత్తం ఆదా అవుతుందని, ఆ తర్వాత 17 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్​ ను ఉపయోగించుకోవచ్చని ​వివరిస్తున్నారు.  ​ 

కొత్తగా మరో సోలార్​ రూఫ్డ్ పార్కింగ్ షెడ్​

ఖమ్మం కలెక్టరేట్ లో దాదాపు 35 డిపార్ట్ మెంట్ల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లందరితో పాటు రోజూ వివిధ పనుల కోసం కొన్ని వందల మంది విజిటర్స్​ కలెక్టరేట్ కు వస్తుంటారు. దీంతో ప్రస్తుతం ఉన్న సోలార్​ పార్కింగ్ షెడ్ సరిపోకపోవడంతో వాహనాలను బయటే ఉంచాల్సి వస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్​ కూడా పూర్తి స్థాయిలో కలెక్టరేట్ అవసరాలకు సరిపోవడం లేదు. ఈ రెండు అవసరాల దృష్ట్యా ఈవీఎం గోడౌన్​ ముందున్న ఖాళీ స్థలంలో మరో 200 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన విద్యుత్​ కంటే ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.