నెట్వర్క్, వెలుగు : ఈనెల 26 నుంచి రాష్ట్రప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ పథకాలు అందుతాయని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు ముజామ్మిల్‌ఖాన్, జితేశ్వి పాటిల్‌తోపాటు పలువురు అధికారులు ప్రజలకు సూచించారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టి పల్లిలో జరిగిన గ్రామసభలో జితేశ్వి పాటిల్, ఖమ్మం నగరంలోని 28వ డివిజన్ ప్రకాశ్ నగర్ సభలో ముజామ్మిల్‌ఖాన్‌తో పాటు ఆయా చోట్ల సభలకు ఎమ్మెల్యేలు, అడిషనల్ కలెక్టర్లు, పలువురు అధికారులు హాజరయ్యారు.
రెండో రోజు కూడా గ్రామసభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలుచోట్ల జాబితాలో తమ పేర్లు లేవని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను అడ్డుకుని నిరసన తెలిపారు. ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాగా వారి సందేహాలను అధికారులు నివృత్తి చేసి సర్దిచెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఒకటి రెండు మిస్ అయినా, మళ్లీ దరఖాస్తు అందిస్తే వాటిని విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామన్నారు.