- పొంగులేటి కోసమా..? భట్టి కోసమా?
- ఢిల్లీ భేటీ నుంచే మొదలైన పంచాది
- పార్టీలో చేరకముందే రేవంత్ వర్గంగా ముద్ర వేసుకున్న శ్రీనివాసరెడ్డి
- ఎస్సార్ గార్డెన్ వెనుక పొంగులేటి భారీ ఏర్పాట్లు
- వేరే స్థలాలను పరిశీలించే పనిలో భట్టి వర్గం
- నాయకన్ గూడెంలో భట్టితో ఠాక్రే చర్చలు
- హాజరైన ఏఐసీసీ నేతలు, పొంగులేటి
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం లొల్లి మొదలైంది. వచ్చే నెల 2న నిర్వహించబోయే సభ పార్టీలో చిచ్చురేపింది. ఈ సభను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక కోసం నిర్వహించాలా? లేక సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభగా నిర్వహించాలా? అనే అంశంపై పార్టీలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. నిన్న మధ్యాహ్నం దాదాపు రెండున్నర గంటల పాటు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోజరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ ఎన్నికల వ్యూహం చర్చించేందుకు ఈ భేటీ జరిగినప్పటికీ ఖమ్మం సభ నిర్వహణ వైపే మీటింగ్ టర్న్ తీసుకుంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరికను హైప్ చేస్తూ సభ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పట్టుబట్టారు.
భట్టి విక్రమార్క పాదయాత్ర 100 రోజుల ముగింపు సభగా నిర్వహించాలని రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గం భీష్మించుకు కూర్చున్నది. రేవంత్‌రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాల వాదనతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి వర్గంగా ముద్రపడిందని పార్టీ నాయకుడు కామెంట్ చేశారు. భట్టి పాదయాత్రను తక్కువ చేసి చూపేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని సీనియర్లు ఆరోపించారు. ఖమ్మం సభ ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై టీపీసీసీ నేతల మధ్యనే ఏకాభిప్రాయం కుదరకుండానే ఢిల్లీలో సమావేశం ముగిసింది.
అయితే ఆ కాక ఇవాళ కూడా కొనసాగింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మానిక్ రావు ఠాక్రే ఇవాళ ఖమ్మం వెళ్లారు. ఈ సందర్భంగా పొంగులేటి వర్గం ఖమ్మం శివారులోని ఎస్సార్ గార్డెన్ వెనక వందెకరాల స్థలంలో భారీ బహిరంగ సభకు, 50 ఎకరాల జాగాలో పార్కింగ్ కోస చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న నాయకన్ గూడేనికి చేరుకున్నారు. ఆయన వెంట ఏఐసీసీ సెక్రటరీ రోహిన్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మదన్ మోహన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు. ఇదిలా ఉండగా భట్టి విక్రమార్క వర్గం పీపుల్స్ మార్చ్ ముగింపు సభ కోసం ఈ సభాస్థలితో సంబంధం లేకుండా ఇప్పటికే రెండు మూడు గ్రౌండ్ లను పరిశీలించింది. ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడే వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే ఖమ్మం కాంగ్రెస్ లో రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క వర్గాలున్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పొంగులేటి చేరితే మూడో వర్గం కూడా తయారవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఏఐసీసీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయన్నది త్వరలోనే తేలనుంది.