
- కొందరు కార్పొరేటర్ల వెంట కుటుంబసభ్యులు
- 42 మంది కార్పొరేటర్లతో పాటు 18 మంది ఫ్యామిలీ మెంబర్స్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్లు, అధికారుల స్టడీ టూర్ వివాదాస్పదంగా మారింది. దాదాపు 80 మంది సభ్యుల టీమ్ బుధవారం ఉదయం ఖమ్మం నుంచి పూణే బయల్దేరి వెళ్లింది. ఖమ్మం నుంచి రెండు ఏసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్ కు వెళ్లిన ఈ టీమ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ముంబైకి వెళ్లారు. అక్కడి నుంచి బస్సుల్లో రాత్రికి పూణే చేరుకున్నారు.
అయితే ఈ జంబో టీమ్ లో 42 మంది కార్పొరేటర్లు, 15 మంది వరకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో పాటు కొందరు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు 18 మంది వరకు ఉండడం విమర్శలకు దారితీసింది. అధికారిక పర్యటనకు వెళ్తున్న సమయంలో కొందరు మహిళా కార్పొరేటర్ల వెంట వారి భర్తలు వెళ్లడం, మరికొందరు కార్పొరేటర్లు భార్యలను తీసుకెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
స్టడీ టూర్ కోసమేనట..!
గత కొద్ది నెలల నుంచి ఈ టూర్ కోసం కార్పొరేటర్లు ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్టడీ టూర్ కోసం వచ్చే నిధులను ఉపయోగించుకుంటూ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారం, పది రోజుల క్రితం షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో మహారాష్ట్రలోని పూణే కార్పొరేషన్ లో స్వచ్ఛ్ భారత్ మిషన్ కు సంబంధించి శానిటేషన్, ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్, అర్బన్ మేనేజ్ మెంట్ కోసం అవలంభిస్తున్న విధానాలను కార్పొరేటర్లు స్టడీ చేయనున్నారు.
ఆ అనుభవాలను ఉపయోగించుకొని ఖమ్మం కార్పొరేషన్ ను క్లీనర్, గ్రీనర్ సిటీగా మార్చేందుకు ఈ కార్పొరేటర్ల ట్రిప్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఖమ్మంలో 60 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ టూర్ కు మేయర్ పునుకోలు నీరజ సహా 43 మంది కార్పొరేటర్లు వెళ్ళారు. టూర్ కు నోడల్ ఆఫీసర్ గా కార్పొరేషన్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ షఫీ ఉల్లా వ్యవహరిస్తున్నారు. యావరేజీగా ఐదుగురు కార్పొరేటర్లకు ఒకరి చొప్పున మున్సిపల్ సిబ్బందిని ఎటాచ్ చేశారు.
ఈ సిబ్బందిలో అకౌంట్స్ ఆఫీసర్, శానిటరీ సూపర్ వైజర్, ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్లున్నారు. ఒక ఈఈ, ఇద్దరు ఏఈలు టూర్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి అదనంగా ఇద్దరు మీడియా ప్రతినిధులు, మరో ఇద్దరు టూర్ ఆపరేటర్లు, 18 మంది వరకు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులున్నారు. మొత్తం 80 మంది వరకు పూణే పర్యటనకు వెళ్లగా వీళ్లందరికీ ట్రాన్స్ పోర్ట్, వసతి ఏర్పాట్లు, ఫుడ్, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.30 లక్షల వరకు అవుతుందని టూర్ ని ఆపరేట్ చేస్తున్న ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజా ప్రతినిధుల స్టడీ టూర్ల కోసం వచ్చే నిధులను దీనికి ఉపయోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కార్పొరేటర్లు, అధికారులకు సంబంధించిన అఫిషియల్ ఖర్చు మాత్రమే కార్పొరేషన్ భరిస్తుందని, వారి కుటుంబ సభ్యుల ఖర్చులను కార్పొరేటర్లే సొంతంగా పెట్టుకుంటున్నారని వివరిస్తున్నారు.