ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఎస్ఐ, ఇన్ చార్జీ తహశీల్దార్, సర్పంచ్ లను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జిల్లా కోర్టు ఆదేశించింది. ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న విషయంలో.. ట్రాక్టర్ల యజమానులు వీరిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్ ఊహించని తీర్పు చెప్పారు. ఎస్ఐ వై. నందీప్, ఇన్ చార్జ్ తహశీల్దార్ రాజేష్, సర్పంచ్ వెంకటేశ్వర్లు పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కస్టడీకీ తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో ఇసుక లోడ్‌తో తిరుమలాయపాలెంలోకి వస్తున్న 13 ట్రాక్టర్లను ఎలాంటి అనుమతులు లేవంటూ తిరుమలాయపాలెం పోలీసులు సీజ్ చేశారు. ట్రాక్టర్ల విడుదల కోసం యజమానులు మొదట ఖమ్మంలోని జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పర్సనల్ బాండ్లపై ఏప్రిల్ 4న ట్రాక్టర్లను విడుదల చేస్తూ జడ్జీ ఎన్. అనితారెడ్డి షరతులతో కూడిన ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ట్రాక్టర్లు, వాటిలోని ఇసుకను పంచనామా నిర్వహించడంతోపాటు ఇసుకను సంబంధిత తహసీల్దార్‌కు అప్పగించి 3 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఎస్సైను కోరింది. ఇసుక వేలం నిర్వహించి దానికి సంబంధించిన పత్రాలను 5 రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఇన్‌ఛార్జి తహసీల్దార్ కె.రాజేశ్‌కు సూచించింది. అయితే ట్రాక్టర్ల యజమానులు మాత్రం.. పర్సనల్ బాండ్ల విలువ తగ్గించాలని కోరుతూ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను జిల్లా న్యాయస్థానం కొంత సవరించింది. క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి… నివేదిక ఇవ్వాలని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తికి సూచించింది. వేలం పాటలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలంది.
పై కోర్టు ఆదేశానుసారం.. సివిల్ కోర్టు జడ్జీ అనితా రెడ్డి క్షేత్రస్థాయిలో విచారించి తన నివేదికను పైకోర్టుకు సమర్పించారు. ఆ విచారణలో అసలు అక్కడ వేలం పాట నిర్వహించలేదని తేలింది. తిరుమలాయపాలెం ఎస్‌ఐ, ఇన్‌ఛార్జి తహశీల్దార్, సర్పంచ్ కుమ్మక్కై న్యాయస్థానంలో తప్పుడు పత్రాలు సమర్పించినట్లు వెల్లడైంది. మే 8న ఎస్సై నందీప్, తహసీల్దార్(ఇన్‌ఛార్జి) రాజేశ్ కోర్టుకు హాజరై గ్రామ అవసరాల కోసం తమకు ఇసుక కేటాయించాలని సర్పంచి వెంకటేశ్వర్లు దరఖాస్తు చేసుకున్నట్లు ఓ లేఖను సమర్పించారు. మే 15న కోర్టుకు హాజరైన సర్పంచి వెంకటేశ్వర్లు తాను కోరిన ప్రకారం ఇసుక కేటాయించారని కోర్టుకు తెలిపారు. మేజిస్ట్రేట్ విచారణలో మాత్రం ఏడుకొండలు అనే వ్యక్తికి ఇసుక అమ్మేశారని తేలింది. దాంతో ఎస్సై నందీప్, ఇన్‌ఛార్జి తహశీల్దార్ కె.రాజేశ్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదనీ… సీజ్ చేసిన ఇసుక వేలంలో అవకతవకలకు పాల్పడ్డారనీ, తప్పుడు పత్రాలు సృష్టించారని మండిపడింది. ఈ విషయంలో ముగ్గురిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
For More News..