ఖమ్మం, వెలుగు: మావోయిస్టులం అంటూ, తుపాకీతో బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదివారం త్రీటౌన్ పీఎస్‌లో జరిగిన మీటింగ్‌లో వెల్లడించారు. ఖమ్మం నగరంలోని కస్బా బజార్‌కు చెందిన మహ్మద్ అఫ్సర్, ఖానాపురానికి చెందిన గుండమల్ల వెంకటేశ్వర్లు గతంలో మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.
వీరిపై గతంలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో చెరి మూడు కేసులు నమోదయ్యాయి. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా నష్టం రావడంతో అప్పులపాలయ్యారు. దీంతో మళ్లీ వ్యాపారులను బెదిరించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఎండీ.రియాజ్ అనే వ్యక్తిని బీహార్‌కు పంపించి మూడు పిస్టల్స్, నాలుగు మ్యాగ్జిన్లు, 17 బుల్లెట్స్ తెప్పించుకున్నారు.
ఆదివారం ఉదయం అఫ్సర్, వెంకటేశ్వర్లు కలిసి ముదిగొండ ఏరియాలో గ్రానైట్ వ్యాపారుల వద్దకు వెళ్తుండగా ప్రకాశ్‌నగర్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న ఖమ్మం త్రీటౌన్ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి పిస్టల్స్, మ్యాగ్జిన్లు, బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని, రియాజ్ పరారీలో ఉన్నాడని సీపీ సునీల్‌దత్ తెలిపారు. సమావేశంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, సీఐ రమేశ్ పాల్గొన్నారు.