మధిర, వెలుగు : మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం బోనకల్లు పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులతో మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా నియంత్రించేలా నిఘా ఉండాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఇల్లెందు : యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రభాను తెలిపారు. గురువారం మండలంలోని ఆజాద్ నగర్లో ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రభాను ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ పేట్లు లేని 50 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.
ములకలపల్లి : ములకలపల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణపై ఆటో డ్రైవర్లు, హమాలీ వర్కర్లు, యువతకు పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ అవగాహన కల్పించారు. యువత బాధ్యతగా చెడు వ్యసనాలకు దూరంగా, డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీసులకు సహకారించాలని కోరారు.
భద్రాచలం : భద్రాచలంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఏఎస్పీ అంకిత్ కుమార్ శాంక్వర్ మాట్లాడుతూ యువత పెడదోవ పట్టొద్దని, తల్లి దండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పుడూ అలర్ట్గా ఉండాలని సూచించారు.