విజిబుల్ పోలీసింగ్ తో నేరాల నియంత్రణ : సీపీ సునీల్ దత్

విజిబుల్ పోలీసింగ్ తో నేరాల నియంత్రణ : సీపీ సునీల్ దత్
  •   నేర సమీక్షా సమావేశంలో సీపీ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు : నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్​లో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం జరగాలంటే, కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. దొంగతనాల నియంత్రణ, చోరీ సోత్తు రికవరీ, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

గ్రామాల్లో, పట్టణాల్లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఉపయోగం, మత్తు పదార్థాల వలన కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించడానికి రోడ్డుపై బారికేడ్స్,  కోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

 ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్​కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్​ ఆర్డర్ ప్రసాద్ రావు, ట్రైనీ ఐపీఎస్ అధికారి రుత్విక్ సాయి, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రహెమాన్, రవి, శ్రీనివాసులు, సర్వర్, రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.