- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
పెనుబల్లి, వెలుగు: జల్సాలకు అలవాటు పడి వ్యవసాయ మోటార్లు దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెనుబల్లి మండలం బంజరు పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రఘు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి, వేంసూరు మండలాల్లో పొలం గట్లపై ఉన్న వ్యవసాయ విద్యుత్ మోటార్లు, వైర్లు, ట్రాక్టర్ సామాన్లు, టైర్లు, సెల్ ఫోన్ టవర్ బ్యాటరీలను పెనుబల్లి మండలం సూరయ్య బంజరు తండాకు చెందిన ఇద్దరు బాల నేరస్తులు, మరో తొమ్మిది మంది కలిసి చోరీలకు పాల్పడేవారు.
వీటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేసేవారు. చోరీ చేసిన సామాను అమ్మేందుకు వెళుతుండగా సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్య, వీఎం బంజరు ఎస్‌ఐ వెంకటేశ్ చేపట్టిన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. వీరి నుంచి మూడున్నర లక్షల విలువ చేసే వ్యవసాయ మోటార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ చేసిన సామాన్లు కొంటున్న నలుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులు ఉపయోగించిన ఓ బైకు, ఆటో ను సీజ్ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు.