- ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో దడ పుట్టిస్తున్న అసమ్మతి నేతలు
- ‘గడపగడపకు గడల’ పేరుతో ఇంటింటి ప్రచారానికి గడల శ్రీకారం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు సోమవారం విడుదలవుతుందనే వార్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సిట్టింగు ఎమ్మెల్యేల్లో దడ పుట్టిస్తున్నాయి. లిస్టుల్లో తమ పేర్లు ఉంటాయో లేదో అనే ఆందోళనలో ఉన్న ఇల్లెందు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు మకాం మార్చారు. హరీశ్‌రావు లాంటి కీలక నేతల సాయంతో సిట్టింగులు టికెట్ కన్ఫర్మ్చేసుకునే పనిలో ఉండగా, అసమ్మతి నేతలు కూడా తమ వంతు లాబీయింగ్ చేస్తున్నారు. టికెట్ నాదంటే నాదని ప్రచారం చేసుకోవడంతో పాటు కొత్తగూడెంలో స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు ఏకంగా ‘గడపగడపకు గడల’ పేరుతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది.
సిట్టింగుల్లో ఆందోళన..
ఇల్లెందులో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ డి. వెంకటేశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని పలువురు నేతలు అసమ్మతికి తెరలేపారు. టికెట్ ఇస్తే పార్టీకి నష్టమని బహిరంగంగా పేర్కొంటున్నారు. కొత్తగూడెంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఎవరికి వారు టికెట్ తనకే అంటూ ప్రకటించుకుంటున్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి తిరిగి సొంత గూటికి చేరిన తెల్లం వెంకట్రావ్‌కు టికెట్ ఇవ్వవద్దని ప్రభుత్వ విప్ రేగా కాంతారావును వాజేడు మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య కలిశారు.
అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా అసమ్మతి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇల్లెందులో అసమ్మతి నేతలకు ఎమ్మెల్సీలు తాతా మధు, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మద్దతు ఉందనే ప్రచారం ఉంది. కొత్తగూడెంలో గడల శ్రీనివాసరావుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మద్ధతు ఉన్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధను అసమ్మతి నేతలు క్యాండిడేట్‌గా బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొత్తగూడెం, ఇల్లెందు సీట్ల వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
రాజధానికి చేరిన సీట్ల లొల్లి..
ఎమ్మెల్యే బానోత్ హరిప్రియకు వ్యతిరేకంగా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నేతలు అసమ్మతి గళం విప్పారు. ఇల్లెందులో గెలవాలంటే కొత్త వ్యక్తులు రావాలని పరోక్షంగా అనురాధ పేరును ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యే భర్త హరిసింగ్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం జరుగుతోందని, తనపై అవిశ్వాసానికి కౌన్సిలర్లలో విభేదాలు సృష్టించారని ఆరోపించారు.
ఈ క్రమంలో హరిప్రియ అనుచరులు ఎమ్మెల్సీ తాతా మధు అసమ్మతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇల్లెందులో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఆదివారం హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. సీఎం, మంత్రి కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో మంత్రి హరీశ్‌రావును కలిసి ఇక్కడి పరిస్థితి వివరించారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే కూతురు గుమ్మడి అనురాధను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగూడెం సీటు తమదంటే తమదని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు గడల శ్రీనివాసరావు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
భద్రాచలంలోనూ అదే సీన్..
భద్రాచలం నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న తెల్లం వెంకట్రావ్ ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. నాలుగు రోజుల కింద కాంగ్రెస్‌ను వీడి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. సీపీఎంతో పొత్తులు లేకపోతే టికెట్ తెల్లం వెంకట్రావ్‌కే నంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వాజేడు మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య రంగంలోకి దిగారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావును కలిసి తనకే టికెట్ ఇప్పించాలని కోరారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా చాప కింద నీరులా పలువురు నేతలు అసమ్మతికి ఆజ్యం పోస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు దడ పుట్టిస్తున్నారు.
సీఎంను కలిసిన వెంకట్రావ్ దంపతులు
ఇటీవల కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరిన తెల్లం వెంకట్రావు దంపతులు ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తున్న నేపథ్యంలో సీఎంను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాగ్రత్తగా పనిచేసుకో అంటూ కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా వెంకట్రావ్ వర్గీయులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తొలి జాబితాలో భద్రాచలం అభ్యర్థిగా వెంకట్రావ్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఆ ఎన్నికలో వెంకట్రావ్ ఓడిపోయినా, పార్టీ అధికారంలోకి పార్టీ వచ్చింది. మళ్లీ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలని వెంకట్రావ్‌కు హామీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి నుంచి అండదండలు ఉండడం కలిసి వస్తుందని చెబుతున్నారు.