బీఆర్ఎస్ మీటింగ్ లో ఖాళీ కుర్చీలు.. అసహనానికి లోనైన ఎంపీ

భద్రాద్రి కొత్తగూడెంలో ఓ చోట ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జిల్లాలోని సుజాతనగర్ మండలం నాయకులగూడెం నుంచి పెద్దమ్మ గుడి వరకు సెప్టెంబర్ 4న 500 కార్లతో ర్యాలీగా వెళ్లి బలప్రదర్శన చేద్దామనుకున్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. 

అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ వద్దకు వెళ్లగానే ఎంపీ షాక్ తిన్నారు. సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు చూసి ఎవరూ లేని మీటింగ్ లో ఏం మాట్లాడాలని ఒకింత అసహనానికి లోనయ్యారు. 

తిరిగి వెళ్లిపోబోయిన ఎంపీని ఎమ్మెల్యే వర్గీయులు శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అనంతరం స్టేజీ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడించారు. ఈ మీటింగ్ కి ఎంపీ నామా నాగేశ్వరరావు పలువురు కీలక నేతలు హాజరుకాకపోవడంతో జిల్లా బీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడ్డాయి.