ఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం

ఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం
  • గుర్రాలపాడులో పట్టుకున్న ఎక్సైజ్‌‌ ఆఫీసర్లు
  • 5.880 కిలోల చాక్లెట్లు స్వాధీనం, ఒకరు అరెస్ట్

ఖమ్మం రూరల్​, వెలుగు : ఖమ్మం రూరల్‌‌ మండలంలో గంజాయి చాక్లెట్ల అమ్మకం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం రూరల్‌‌ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుర్రాలపాడు గ్రామ శివారులోని శ్రీవినాయక గ్రానైట్‌‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలు అక్కడే షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. వారు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో ఖమ్మం ఎక్సైజ్‌‌ ఆఫీసర్లు మంగళవారం దాడి చేసి సుమారు 5.880 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని బానోతు హారియా అనే వ్యక్తిని అరెస్ట్‌‌ చేశారు.

ఇతడు ఒడిశా రాష్ట్రంలో గంజాయి చాక్లెట్లను కొని ట్రైన్‌‌లో ఖమ్మం తరలించి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ చంద్రమోహన్, సురేందర్, మౌలాంకర్, గురుప్రసాద్, నరసింహ, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు