- ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్
ఖమ్మం టౌన్, వెలుగు : అధికారం పోయి ఏం చేయాలో తోచక బీఆర్ఎస్ హింసను ప్రేరేపిస్తోందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆరోపించారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్లు తాము ప్రతిపక్షంలో ఉన్నా శాంతియుత ధర్నాలు, నిరసనలు తప్ప, ఏనాడు అధికారులపై దాడులకు పాల్పడలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే ఎంతటి వారైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ధోరణి మార్చుకొని అధికారులపై దాడులు ఆపాలని సూచించారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు కొత్తా సీతారాములు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా కిసాన్ కాంగ్రెస్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, గుదిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.