- కరకగూడెంలో 22.7సెం.మీ.
- చర్లలో 13.4సెం. మీ. వాన
- గ్రామాలకు రాకపోకలు బంద్
భద్రాద్రి,కొత్తగూడెం, వెలుగు : ఎడతెగని వర్షాలు ఏజెన్సీ గ్రామాలను అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. చర్ల, పినపాక, కరకగూడెంతో పాటు పలు మండలాల్లో పంట పొలాల్లోకి వరద నీరు భారీగా చేరడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మణుగూరు, ఆళ్లపల్లి,చర్ల తదితర మండలాల్లోని ఇండ్లలోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు.
తాలిపేరు ప్రాజెక్ట్ 25గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరో వైపు గోదావరి కి వరద పెరుగుతుండడంతో ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల్లో కలెక్టర్ డాక్టర్ ప్రియాంకతో పాటు స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కరకగూడెంలో 22.7 సెం. మీ. వర్షపాతం
జిల్లాలోని కరకగూడెంలో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 22.7 సెం. మీ. వర్షపాతం నమోదైంది. చర్ల మండలం సత్యనారాయణపురంలో 14.4, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో 14, సుజాతనగర్లో 13.8, కొత్తగూడెంలో 13.4 సెం. మీ. వర్షపాతం నమోదైంది. అత్యవసర సమాయాల్లో తగిన సాయం కోసం 8712682128 నెంబర్కు లొకేషన్ షేర్ చేస్తే పోలీస్లు వచ్చి అవసరమైన సాయం అందిస్తారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు.
కూసుమంచి
మండలంలోని పాలేరు జలాశయానికి, 8వేల క్యూసెక్కుల వరద చేరుతుంది. అలాగే 24 ఆటోమేటిక్ గేట్ల ద్వారా సుమారు 10 వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోతుంది.
కుంటలను తలపిస్తున్న పొలాలు
చర్ల, పినపాక, ఆళ్లపల్లి, జూలూరుపాడు మండలాల్లో పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో అవి చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. గుండాల మండలంలోన తొట్టి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మటంలంక నుంచి గుండాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కిన్నెరసాని, ఏడు మెలికల వాగులు కలిసే చోట లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకటాపురం,మల్లెలగుంపు మధ్య ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఆగిపోయాయి. చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెంలో డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వరద నీరు చేరింది.
ఇల్లెందు పట్టణంలోని స్టేషన్ బస్తీలో కూలి పోయిన ఇండ్లను జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సందర్శించారు. భద్రాచలం, చర్ల మధ్య ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిల్చిపోయాయి. పాల్వంచ మండలంలో కిన్నెరసాని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.జూలూరుపాడు మండలంలో తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బేతాలపాడు,పడమటి నర్సాపురం గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. అశ్వాపురంమండలంలో గొందిగూడెం, తుమ్మల చెరువు, అమ్మగారిపల్లి పంచాతీయల్లోని పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.
కిన్నెరసాని గేట్లు 12 ఎత్తివేత
పాల్వంచ రూరల్, వెలుగు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు చేరుతుంది. రిజర్వాయర్ నీటిమట్టం 404.50 అడుగులకి చేరింది. దీని పూర్తి సామర్థ్యం407అడుగులు. రిజర్వాయర్కున్న 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు బుధవారం విడుదల చేశారు.
ఖమ్మం జిల్లాలో ఉప్పొంగిన వాగులు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో బుధవారం రోజంతా ముసురుపట్టినట్టు వాన కురుస్తూనే ఉంది. జిల్లాలో ఇప్పటికే చాలా చెరువులు నిండగా, ఇంకొన్ని నిండేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాలేరు, వైరా రిజర్వాయర్ లు పూర్తి స్థాయిలో నిండడంతో అలుగు పోస్తున్నాయి. బేతుపల్లి రిజర్వాయర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. లంకా సాగర్ ప్రాజెక్టు మరో అడుగు నీరు చేరితే పూర్తిగా నిండుతుంది. మున్నేరు, ఆకేరు, కట్టలేరు, బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. తీర్థాల దగ్గర ఆకేరుపై ఉన్న లోలెవల్ వంతెన పై నుంచి నీళ్లు పోతుండడంతో ఆ రూట్ లో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది.
జిల్లాలో బుధవారం అత్యధికంగా కారేపల్లిలో 5.6 సెంటీమీటర్లు, పెనుబల్లిలో 5.5, కామేపల్లిలో 4.4, వేంసూరులో 4, కల్లూరులో 3.9, రఘునాథపాలెం, కొణిజర్లలో 3.8, ఖమ్మం రూరల్ లో 3.3, సత్తుపల్లిలో 3.2, మధిరలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ఖమ్మంలో మున్నేరును ఆనుకొని ఉన్న కాలనీల్లో కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించారు. ముంపు కాలనీల్లో ఉన్న వారిని తరలించేందుకు నయాబజార్ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే టోల్ ఫ్రీ నెం.7901298265, 9866492029 కు సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుతం మున్నేరులో 1.38 లక్షల క్యూసెక్కులతో ప్రవాహం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆకేరు, బయ్యారం వాగులో ప్రవాహం పెరిగితే మున్నేరు వాగు పరిసరాల్లో ఇబ్బంది ఎదురుకావొచ్చని అంచనా వేస్తున్నారు. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 18. 3 అడుగులు కాగా ప్రస్తుతం 18.5 నీటిమట్టం ఉండడంతో మొదటి అలుగు మీదుగా ప్రవాహం కొనసాగుతోంది.
పెనుబల్లి మండలంలో లంకాసాగర్ ప్రాజెక్ట్ కెపాసిటీ 16 అడుగులు ఉండగా, ప్రస్తుతం 15 అడుగులకు చేరింది. మండల కేంద్రంలోని రాతోని చెరువు ఇంకా అలుగు పడలేదు. పెనుబల్లి, గంగాదేవిపాడు గ్రామాల మధ్య వాగులో వచ్చే వరద వల్ల రెండు గ్రామాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి.