ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికల్లో కీలక దశకు చేరుకున్నామని, విధుల్లో అధికారులు మరింత అలర్ట్గా ఉండాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెబ్ కాస్టింగ్, ఓటరు స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్ లాంటి వాటిపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీస్ పరిశీలకులు చేరుకున్నట్లు తెలిపారు.
నివేదికలు ఎప్పటికప్పుడు అందించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతుల కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు సమయంలో సెక్టోరల్ అధికారి ఉండాలని తెలిపారు. వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లతో పాటు190 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో బయట వైపు సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గురువారం నుంచి ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ ప్రారంభించి 20లోగా పూర్తి చేయాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పు పంపిణీతో పాటు, సీ విజిల్ యాప్ కు సంబంధించిన పోస్టర్, ఓటర్ గైడ్ అందజేయాలని చెప్పారు. కొత్త పోలింగ్ కేంద్రాలు, లొకేషన్ మారిన కేంద్రాల విషయమై ఓటర్లలో అవగాహన కల్పించాలన్నారు. 21, 22, 23వ తేదీల్లో రెండవ విడత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ల కోసం ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటుచేసి, రిజర్వ్ పీవో, ఏపీవో లను కేటాయించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారులు, అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఫారం 12డీ రిజెక్ట్ చేస్తే, ఆ విషయాన్ని అభ్యర్థికి తెలుపాలన్నారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు రోజూ అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జడ్పీ సీఈవో అప్పారావు, ఎస్ఈ చంద్రమౌళి, సీపీఓ ఏ. శ్రీనివాస్, ఎస్ఈ ట్రాన్స్కో సురేందర్, డీఆర్డీవో విద్యాచందన, డీఈవో సోమశేఖరశర్మ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, మీషన్ భగీరథ ఎస్ఈ సదాశివకుమార్, స్వీప్ నోడల్ అధికారి కె. శ్రీరామ్, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్నికల పర్యవేక్షకులు రాంబాబు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మదన్ గోపాల్, మీనన్, సత్యనారాయణ, రంజిత్, అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ వర్క్స్ స్పీడప్ చేయాలి
ఈవీఎం గోడౌన్ పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో రూ. 2.78 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈవీఎం గౌడౌన్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ బుధవారం పరిశీలించి పలు సూచనలు చేశారు.