ఖమ్మం జిల్లాకు మరో భారీ వరద గండం పొంచి ఉంది. ఆదివారం వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో... మున్నేరుకు వరద ఉదృతి పెరిగింది. బయ్యారం, గార్ల చెరువులకు భారీగా వరదనీరు వస్తోంది. మున్నేరు, ఆకేరు భారీగా వరద పెరిగే చాన్స్ ఉంది. దీంతో హై అలర్ట్ జారీ చేశారు అధికారులు.
మున్నేరు వెంట నివసించే దన్వాయిగూడెం, రమణపేట్, ప్రకాశ్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర నగర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. ఇప్పటికే పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. గత వారం భారీ వర్షం, వరదలతో మున్నేరు పరివాహక ప్రాంతం మునిగిపోయింది. ఇప్పటికే ఉన్నదంతా పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు బాధితులు. ఇప్పుడు మరో సారి భారీ వర్షం, వరద ఎఫెక్ట్ తో బిక్కు బిక్కుమంటున్నారు.
రాత్రి పునరావస కేంద్రాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముంపు బాధితుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని పరామర్శించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు భట్టి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. జిల్లా మంత్రులు తుమ్మల, పొంగులేటి .... మున్నేరు పరివాహక ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.