
- ఈనెల 30 వరకు పూర్తికానున్న రెవెన్యూ సదస్సులు
- ఖమ్మం జిల్లాలో 1,11,449 సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్
ఖమ్మం, వెలుగు: భూ భారతి చట్టం అమలు కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సగం అప్లికేషన్లు సాదాబైనామా గురించే వస్తున్నాయి. మండలంలో 32 గ్రామాలు ఉండగా, ఈనెల 22వ తేదీ వరకు 11 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. భూ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 1079 అప్లికేషన్లు రాగా, వాటిలో 508 దరఖాస్తులు సాదాబైనామా కు సంబంధించే వచ్చాయి.
మిగిలిన అప్లికేషన్లలో 15 శాతం మిస్ మ్యాచ్సర్వే నెంబర్ల గురించి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. భూముల సర్వే నిర్వహిస్తే, ఇలాంటి సమస్యలు పరిష్కారమయ్యే ఛాన్సుంది. ఈ నెల 30వ తేదీ వరకు నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేయాలని షెడ్యూల్ నిర్ణయించారు. వచ్చిన అప్లికేషన్లలో 50 శాతానికి పైగా సాదాబైనామాకు సంబంధించినవే కావడం చర్చనీయాంశంగా మారింది. భూ భరోసా పథకం అమలుతో ఐదేళ్ల తర్వాత సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది.
ఐదేళ్లుగా దరఖాస్తులు పెండింగ్..!
సాదాబైనామా కింద కొన్న భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అప్పట్లో రిజిస్ట్రేషన్ల ఖర్చును తగ్గించుకునేందుకు, స్టాంప్ పేపర్ల పైన, తెల్లకాగితాలపైనే భూములు కొని అగ్రిమెంట్లు రాసుకునేవారు. పెద్దమనుషుల సమక్షంలో భూమిస్వాధీనం చేసుకుని కొనుక్కున్న వారే పంటలు సాగుచేసుకునేవారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం పాత వారి పేర్లే కొనసాగేవి.
అప్పట్లో రైతు బంధు అమలు ప్రారంభించిన సమయంలో ఈ రికార్డుల ప్రక్షాళన కోసం 2014 జూన్ 2 కు ముందు సాదాబైనామాపై కొనుగోలు చేసిన వారి నుంచి దరఖాస్తులను తీసుకుంది. ఆ తర్వాత కోర్టు కేసులు, వివిధ కారణాలతో అప్పటి ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఖమ్మం జిల్లాలో అలా సాదాబైనామా కింద 1,11,449 దరఖాస్తులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 62,511 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రస్తుతం రెవెన్యూ సదస్సులు జరుగుతున్న గ్రామాల్లో ఉన్న దరఖాస్తుదారులు మరోసారి భూభారతి కింద అప్లై చేసుకుంటున్నారు.
కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు
భూభారతి పథకం అమలు కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రోజుకు రెండు గ్రామాల చొప్పున రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ, భూ సమస్యల గురించి అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈనెల 30తో అక్కడ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. జిల్లా కలెక్టర్ సహా రెవెన్యూ అధికారులు ఆయా సదస్సుల్లో పాల్గొంటూ, రైతులకు భూభారతి పథకం తీరుపై అవగాహన కల్పిస్తున్నారు. ఇవాళ (గురువారం) రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో అవగాహన సదస్సుకు హాజరుకానున్నారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో జరిగే సదస్సుల్లో పొంగులేటి
పాల్గొననున్నారు.