అన్నదాతకు అకాల వర్షాల దెబ్బ

అన్నదాతకు అకాల వర్షాల దెబ్బ
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం
  • ఓకే రోజు 3,194 ఎకరాల్లో ఆయా పంటలకు నష్టం..
  • 745 ఎకరాల్లో నేలరాలిన మామిడి 

కల్లూరు శివాలయం ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 100 మందికి పైగా రైతులు 80 వేల బస్తాల ధాన్యాన్ని గత 15 , 20 రోజులుగా రాశులుగా పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఇటీవల రెండు సార్లు వచ్చిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. తేమశాతం సాకుగా కొనుగోళ్లు వేగంగా చేయడం లేదని రైతులు చెబుతున్నారు. 

లారీల కొరత ఉండడం, ధాన్యం కాంటా చేసే గ్రూప్​లు కేవలం నాలుగైదు మాత్రమే ఉండడంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో అనేకమంది రైతుల ధాన్యం అకాల వర్షానికి తడిసింది. కల్లూరు పట్టణంలోని పుల్లయ్య బంజార రహదారి సమీపంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 20 మంది రైతులు ధాన్యం రాశులను ఆరబెట్టుకుంటున్నారు. మెట్టల రాధిక రెండు ఎకరాల్లో పంట కోసి ఆరబెట్టగా ఆదివారం రాత్రి  కురిసిన వర్షానికి పంట మొత్తం నీట మునిగిపోయింది. 

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అకాల వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు నష్టపోతున్నారు. ఈదురుగాలులతో కూడిన వాన పడడంతో అటు మామిడి, ఇటు వరి సాగు చేసిన రైతులకు నష్టం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 4 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రధానంగా కల్లూరు, తల్లాడ, వైరా, అన్నపురెడ్డి మండలాల్లో వరి పంటకు నష్టం జరగ్గా, కల్లూరు, పెనుబల్లి, చింతకాని, చంద్రుగొండ అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో మామిడి కాయలు రాలడంతో రైతులు నష్టపోయారు. 

కల్లూరు మండలంలో వరి 1,018 ఎకరాలు, మొక్కజొన్న 6 ఎకరాలు, తల్లాడ మండలంలో వరి 350 ఎకరాలు, మొక్కజొన్న 30 ఎకరాలు, వైరా మండలంలో 1,690 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది.అన్నపురెడ్డిపల్లి మండంలోని రంగాపురం, రాజాపురం, జానకిపురం, మర్రిగూడెం ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల్లో వరికి నష్టం జరిగింది. మొత్తం 3,194 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రాథమికంగా లెక్కతేలగా, నాలుగు మండలాల్లో 745 ఎకరాలకు పైగా మామిడి రైతులు నష్టపోయారు. ఇవేకాకుండా పలు చోట్ల  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కూడా తడిసిపోయింది.

పగులు ఎండ.. రాత్రి వాన.. 

జిల్లాలో కొన్ని రోజులుగా రోజంతా విపరీతమైన ఎండ కొడుతున్నా, సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఆరు గంటల తర్వాత గాలి దుమారంతో పాటు వర్షం కురుస్తోంది. ప్రధానంగా వారం పదిరోజుల్లోనే మూడుసార్లు ఇలా గాలి, వాన రావడంతో అటు మామిడి, ఇటు వరి సాగు చేసిన రైతులు ఆగమాగమవుతున్నారు. విపరీతమైన గాలులతో మామిడి కాయలు రాలుతుండగా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన వడ్లు తడిసిపోతున్నాయి. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, అశ్వారావుపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డి మండలాల్లో నష్టం ప్రభావం కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం లేదని, గన్నీ బ్యాగులు లేని కారణంగా పది రోజులుగా కాంటాలు వేయకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని రైతు సంఘం నేతలు చెబుతున్నారు.

 మరోవైపు ధాన్యం తడిచిన కొనుగోలు కేంద్రాల్లో ఖమ్మం జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్​ చందన్​ కుమార్ పర్యటించి రైతులతో మాట్లాడారు. తల్లాడ మండలంలోని తల్లాడ, గొల్లగూడెం, కిష్టాపురం, మల్సూరు తండా, రంగంబంజర్, కల్లూరు మండలంలోని చిన్న కోరుకోండి, లక్ష్మీపురం, పుల్లయ్య బంజర కొనుగోలు కేంద్రాలను సందర్శించి సెంటర్ ఇన్​చార్జిలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని తీసుకునేలా మిల్లర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించామని డీఎస్​ఓ చందన్​ కుమార్​ తెలిపారు.

తడిచిన ధాన్యాన్ని  కొనుగోలు చేయాలి

పద్దెనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాం. 16ఎకరాల్లో కోసిన పంటను 15 రోజులుగా శివాలయం ఆవరణలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రాశులుగా పోసి ఆరబెట్టుతున్నాం. ఆదివారం 200 బస్తాలు కాటాలు వేసిన తర్వాత, తేమ శాతం ఉందంటూ లోడింగ్ చేయకుండా నిలిపేశారు. దీంతో ఆదివారం రాత్రి ఆకస్మికంగా వచ్చిన వర్షానికి  ధాన్యం అంతా తడిసి ముద్దయింది. చాలా వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఆరు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. వర్షానికి తడిసిన ధాన్యాన్ని సర్కారు కొనుగోలు చేయాలి.  – బొల్లం రామయ్య, చంద్రకళ, రైతులు కల్లూరు