అకాల వర్షం.. ఆగమాగం గాలివాన బీభత్సం.. నేలకొరిగిన పంటలు.. విరిగిన చెట్లు.. తెగిన కరెంట్ తీగలు

అకాల వర్షం.. ఆగమాగం గాలివాన బీభత్సం.. నేలకొరిగిన పంటలు.. విరిగిన చెట్లు.. తెగిన కరెంట్ తీగలు

నెట్​వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అకాల వర్షం.. ఆగమాగం చేసింది.. పలుచోట్ల పంటలు నేలకొరిగాయి.. చెట్లు విరిగిపడ్డాయి.. కరెంట్​తీగలు తెగిపోయాయి. రేకుల ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. 

కొత్తగూడెం పట్టణంలోని ఎంజీ రోడ్​లో చెట్టు కూకటి వేళ్లతో కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది. 

అశ్వారావుపేట–భద్రాచలం రోడ్డులోని ఊట్లపల్లి వద్ద భారీ వృక్షం నేలకొరగడంతో భద్రాచలం, అశ్వారావుపేటల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట మండల వ్యాప్తంగా 15 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 70 ఎకరాల మేర వేరుసెనగ పంట దెబ్బతిన్నది. 50 ఎకరాల్లో మినప పాడైంది. కాకర, చిక్కుడు పందిళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 100 ఎకరాల పైన మామిడి తోటలలో కాయలు రాలిపోయాయి. 

సత్తుపల్లి, వెంసూరు మండలంలోని  చేతికి వచ్చిన మామిడికాయలు, నిమ్మకాయలు నేలరాలాయి. సత్తుపల్లి మండలంలోనే సుమారు 60 ఎకరాల మామిడి తోట దెబ్బతిన్నదని, ఎనిమిది ఎకరాల్లో అరటి పాడైందని హార్టికల్చర్ ఆఫీసర్ శ్రావణి తెలిపారు. 

బలంగా వీచిన గాలికి గుండాల మండల కేంద్రంలోని ఇనుముల సమ్మయ్య ఇంటి రేకులు లేచిపోయాయి. చాలాచోట్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటను సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ లీడర్లు పరిశీలించారు. 
అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో మామిడి తోటలు, కోతకు వచ్చిన వరి పంట దెబ్బతిన్నాయి.  కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలు, పొగాకు, ధాన్యం తడిసి పోయాయి. అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురంలో కరెంట్​ తీగలపై వేప చెట్టు విరిగి పడింది. విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

ములకలపల్లి మండలం రామచంద్రపురంలో షార్ట్ సర్క్యూట్ తో తాటాకు ఇల్లుకు మంటలు అంటుకోగా అదే సమయంలో ఈదురుగాలి వీస్తుండడంతో నిమిషాల్లోనే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు బాల్దా అరుణమ్మ తెలిపారు. 

ఎర్రుపాలెం మండలం రాజుపాలెం, నారాయణపురం, సకినివీడు, మామునూరు, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటాపురం, భీమవరం గ్రామాలలో అకాల వర్షానికి పాడైన పంటలను మండల వ్యవసాయ అధికారి సాయి శివ, ఉద్యానవన శాఖ అధికారి విష్ణు పరిశీలించారు. మొక్కజొన్న, మామిడి పంటలకునష్టం వాటిల్లినట్లు తెలిపారు.