ఖమ్మం జిల్లాకు జాక్​ పాట్..!

  • రాష్ట్ర కేబినెట్ లో ముగ్గురికి దక్కిన అవకాశం 

ఖమ్మం, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గంలో ఖమ్మం జిల్లా జాక్​ పాట్ కొట్టింది. కొత్త  ప్రభుత్వంలో  జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు అవకాశం దక్కింది.  గురువారం హైదరాబాద్​ లోని ఎల్బీ స్టేడియంలో  జిల్లా నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.  మధిర నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించిన మల్లు భట్టి విక్రమార్క,  పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి,  ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు బెర్తులు దక్కించుకున్నారు.

 
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కలేదు. వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి కేబినెట్​ లో మాత్రమే ఒకేసారి ఇద్దరికి బెర్త్ దొరికింది. అప్పుడు సంభాని చంద్రశేఖర్​, వనమా వెంకటేశ్వరరావు మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఒకేసారి మూడు  మంత్రి పదవులు  ఖమ్మం జిల్లాకు దక్కడంతో కాంగ్రెస్​ శ్రేణులతో పాటు జిల్లా ప్రజల్లోనూ సంతోషం వ్యక్తమవుతోంది.

​ 
ఖమ్మం జిల్లా నుంచి గతంలో జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. పలువురు నాయకులు కేంద్ర మంత్రులుగా పనిచేసినా, ఇప్పటి వరకు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో దక్కిన అత్యుత్తమ పదవి ముఖ్యమంత్రి పోస్టే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కకి అవకాశం దక్కింది. ఎన్​ఎస్​యూఐ కార్యకర్త స్థాయి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ, మధిర నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించడం, రాష్ట్రంలో ఆదిలాబాద్​ నుంచి ఖమ్మం వరకు 109 రోజుల పాటు 1365 కిలోమీటర్లు మండుటెండలో చేసిన పాదయాత్ర చేసి కాంగ్రెస్​ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేయడం, చీఫ్​ విప్​ గా, డిప్యూటీ స్పీకర్​ గా, సీఎల్పీ నేతగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించడం వంటి కారణాలు భట్టికి సానుకూలంగా మారాయి. సామాజిక సమీకరణాలు కూడా ఆయనకు కలిసివచ్చాయి. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఎన్టీఆర్​, చంద్రబాబు, కేసీఆర్​ కేబినెట్​ లలో మంత్రిగా పనిచేశారు.

సత్తుపల్లి నుంచి మూడు సార్లు, ఖమ్మం నుంచి రెండు సార్లు, పాలేరు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా, ఎక్సైజ్​ మినిస్టర్​ గా, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రజబ్​ అలీ సరసన చేరిన తుమ్మలకు మంత్రిగా ఉన్న ఎక్స్​ పీరియన్స్​ దృష్ట్యా కాంగ్రెస్​ లో చేరిన రెండునెలల్లోనే ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిగా అవకాశం లభించింది. 

ఇక పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచింది ఇదే మొదటిసారి అయినా రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించారు. మాజీ ఎంపీగా కాంగ్రెస్​ లో చేరిన కొద్దికాలంలో కీలక నేతగా ఎదిగారు. ఆయన చేరిక సందర్భంగా ఈ ఏడాది జులై 2న ఖమ్మంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభతోనే రాహుల్​ గాంధీకి సన్నిహితుడిగా మారారు. రాష్ట్ర కాంగ్రెస్​ ప్రచార కమిటీ కో చైర్మన్​ గా నియమితులై, ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు స్థానాల్లో పొంగులేటి ప్రచారం నిర్వహించారు. 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థులకు ఆయన ఆర్థికంగా అండగా నిలబడ్డారని పార్టీలో ప్రచారముంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్, ప్రియాంకగాంధీని రప్పించారు. ఇక పాలేరు సెగ్మెంట్ నుంచి 56 వేల భారీ మెజార్టీతో గెలుపొంది కేబినెట్ బెర్త్ కన్ఫామ్​ చేసుకున్నారు. 

రాష్ట్రంలో 1992 నుంచి 2004వ సంవత్సరం మినహా మిగిలిన అన్ని ప్రభుత్వాల్లో ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి పదవి లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు శీలం సిద్ధారెడ్డి, జలగం వెంగళరావు, తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, కోనేరు నాగేశ్వరరావు, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా పని చేశారు. వీరిలో 2004లో ఒకేసారి సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఒకేసారి ముగ్గురు మంత్రులవ్వడం విశేషం.