- ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన
- నలుగురు అరెస్ట్.. 2 బైకులు, 2 కత్తులు స్వాధీనం
కూసుమంచి, వెలుగు: భార్యపై అనుమానంతో ఖమ్మం జిల్లాలో స్నేహితుడిని చంపించాడో భర్త. సోమవారం కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రానికి చెందిన బైరోజు వెంకటచారి, పగడాల గిరిధర్‌రెడ్డి స్నేహితులు. మోతెలో వీరి ఇండ్లు ఎదురెదురుగా ఉంటాయి. వెంకటాచారి ప్రస్తుతం నడిగూడెం మండలం సిరిపురంలోని ప్రభుత్వ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. గిరిధర్‌రెడ్డి ఎస్ జీటీ టీచర్‌గా పనిచేస్తూ 2022 మే వరకు సస్పెన్షన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం తిరుమలగిరి మండలంలోని మొండిచింతబావిలో పనిచేస్తున్నాడు.
మోతెలో ఉన్న టైంలో వెంకటాచారి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని గిరిధర్ అనుమానం పెంచుకున్నాడు. తన కూతురికి డీఎన్ ఏ టెస్టు కూడా చేయించాడు. గిరిధర్బిడ్డనే అని తేలినా అనుమానం పోలేదు. తరచూ గొడవ పడుతుండడంతో ఏడేండ్ల కింద గిరిధర్‌ను భార్య వదిలేసింది. మోతెలోనే వేరేగా ఉంటోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని నాయకన్‌గూడెంలో ఉంటున్న వెంకటాచారి అప్పుడప్పుడు మోతె వెళ్లి వస్తుండడాన్ని గిరిధర్ గుర్తించాడు. వెంకటాచారి వల్లనే తన భార్య దూరంగా ఉంటోందని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మూడు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్న గిరిధర్వాయిదాల కోసం సూర్యాపేట కోర్టుకు వెళ్లి వచ్చే టైంలో సతీశ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
అతని సాయంతో వెంకటాచారిని చంపాలని స్కెచ్‌వేశాడు. సతీశ్తన స్నేహితులు మధు, నరేశ్ ను పరిచయం చేశాడు. గిరిధర్ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.15లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. సతీశ్, మధు, నరేశ్ఈ నెల 17, 19, 21, 22 తేదీల్లో వెంకటాచారిని చంపేందుకు ప్రయత్నించగా కుదరలేదు. 23న కూసుమంచి మండలంలో మందడినర్సయ్యగూడెం బ్రిడ్జి సమీపంలో బైక్‌తో ఢీకొట్టి, గొంతుకోసి వెంకటాచారిని చంపేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌చేశారు. కారు, 2 బైకులు, 2 కత్తులు,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కూసుమంచి సీఐ కంది జితేందర్‌రెడ్డి, ఎస్సైలు రమేశ్‌కుమార్, వరాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.