వీరలక్ష్మిగా లక్ష్మీతాయారు అమ్మవారు
భద్రాచలం, వెలుగు: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు వీరలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చారు. ముందుగా అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి, లక్ష్మీతాయారు, ఆంజనేయస్వామి మూలవరులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవ చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారి ఉత్సవమూర్తిని వీరలక్ష్మిగా అలంకరించారు. సామూహిక కుంకుమార్చనలు, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చనలు చేశారు. ప్రాకార మండపంలో శ్రీసీతారామచంద్రస్వామికి నిత్య కల్యాణం నిర్వహించారు. చిత్రకూట మండపంలో శ్రీమద్రామాయణ పారాయణంలో భాగంగా యుద్దకాండ పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి
పాల్వంచ,వెలుగు: దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మండలంలోని కేశవాపురం–జగన్నాథపురంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 21 మంది రుత్వికులతో రుద్రాభిషేకం జరిపించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాద్రికొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్య నారాయణ (చిన్ని) కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
పింఛన్ కార్డులు అందజేత
ఖమ్మం రూరల్, వెలుగు: ఆసరా పింఛన్ కార్డులను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. సోమవారం మండలంలోని గుదిమళ్ల, వెంకటగిరి, గుర్రాలపాడు, ముత్తగూడెం, తల్లంపాడు, ఆరెంపుల, చింతపల్లి, ఆరెకోడుతండా, కస్నాతండా, గూడూరుపాడు, ఎంవీ పాలెం గ్రామాల్లో పర్యటించారు. ప్రార్థనా మందిరాలకు ఎమ్మెల్యే విరాళాలు అందించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, ముత్యం కృష్ణారావు, జగన్, నండ్రా ప్రసాద్ పాల్గొన్నారు.
కోటమైసమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష
కారేపల్లి,వెలుగు: మండలంలోని ఉసిరికాయలపల్లిలో దసరా సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహించే కోటమైసమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సమీక్షించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభిరామారావు, సీఐ ఆరిఫ్ అలీఖాన్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఈవో వేణుగోపాలచార్యులు, సర్పంచ్ బన్సీలాల్, ఎంపీటీసీ మూడు జ్యోతి పాల్గొన్నారు.
పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో సోమవారం ఆయుధ పూజ నిర్వహించారు. ఈ పూజలో ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. సేవా కార్యక్రమాల్లోను పోలీసులు తమవంతు సాయం అందిస్తున్నారని చెప్పారు. గోదావరి వరదల సమయంలో పోలీసుల సేవలు మరువలేనివని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, సాయి మనోహర్, ఏఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీలు వెంకటేశ్వరబాబు, రమణమూర్తి, రాఘవేంద్రరావు, సత్యనారాయణ, ఆర్ఐలు సోములు, కామరాజు, దామోదర్, సుధాకర్ పాల్గొన్నారు.
పేదల కోసం పోరాడితే కేసులు పెడుతున్రు
సత్తుపల్లి, వెలుగు: పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసిన వారిపై అక్రమ కేసులు బనాయించడం సరైంది కాదని టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ విరాట్ నగర్ లోని పాత ఎన్టీఆర్ కెనాల్ ఖాళీ ప్రభుత్వ స్థలంలో కాంగ్రెస్ జెండాలు పాతి నిరసన తెలిపిన తమపై అక్రమ కేసులు బానాయించడాన్ని ఖండించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అక్రమ కేసులు పెట్టించారని, ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ నున్నా రామకృష్ణ, ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రటరీ రావి నాగేశ్వరరావు, సొసైటీ వైస్ చైర్మన్ గాదె చెన్నకేశవరావు, నాయకులు దేశిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మానుకోట ప్రసాద్, ఐ కృష్ణ, కంభంపాటి కాంతారావు, అడప అనీల్, ఎస్కే ఖలీల్, బాజి, ముగ్దుమ్ పాల్గొన్నారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే అర్జీలను పరిశీలించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ మీటింగ్ హాల్లో ప్రజావాణిలో భాగంగా అర్జీలను స్వీకరించారు. అనంతరం దళితబంధు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10 లోగా 70 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన చింతకాని మండలంలో 3421 యూనిట్లలో 1606 గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. 710 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి, ఆర్డీవో రవీంద్రనాథ్, జడ్పీ సీఈవో అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, డీటీవో కిషన్ రావు, డీఏవో విజయ నిర్మల, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శ్రీరామ్ పాల్గొన్నారు.
మణుగూరు, వెలుగు: మండలంలోని రైల్వే లైన్ భూ నిర్వాసితులకు పరిహారం సోమవారం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చెక్కులను అందజేశారు. మణుగూరు రైల్వే స్టేషన్ నుంచి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు రవాణా కోసం నిర్మిస్తున్న రైల్వే లైన్లో భూములు కోల్పోయిన 22 మంది రైతులకు రూ.కోటి చెక్కులతో పాటు ఉపాధి కోసం మరో రూ. లక్ష చొప్పున మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే లైన్ లో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇంటి స్థలం అందిస్తుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ పోశం నరసింహారావు, తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని టీయూడబ్ల్యూఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. రామ్‌నారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు రవీంద్ర శేషు డిమాండ్ చేశారు. నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా ఎలక్ర్టానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులో పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం అయిందని, ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేసి ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఇద్దరు దొంగల అరెస్ట్
రూ. 9.44 లక్షల సొత్తు స్వాధీనం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రూ.9.44 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులను చూసి ఇర్ఫాన్, అజీమ్ లు పారిపోతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇద్దరిని రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఇర్ఫాన్‌పై వివధ పోలీస్ స్టేషన్లలో 15 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇండ్లకు తాళం వేసి వెళ్లే వారు సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇస్తే పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మీడియా సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు, త్రీటౌన్ సీఐ అబ్బయ్య పాల్గొన్నారు.
రామాలయం పరిసరాల్లో ఆక్రమణల తొలగింపు
భద్రాచలం,వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసరాల్లో తూర్పు ద్వారం వైపు ఆక్రమణలను సోమవారం ఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు. పలువురు షాపుల ముందు రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకోవడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. మాడవీధుల విస్తరణలో భాగంగా అక్కడి ఇళ్లకు పరిహారం ఇచ్చి రోడ్లు వెడల్పు చేశారు. కానీ అక్కడే భవనాలు నిర్మించుకున్న కొందరు యజమానులు ముందు భాగంలో షాపులకు అద్దెకు ఇచ్చారు. వారు రోడ్లపైనే దుకాణాలు పెట్టడంతో దేవస్థానం ఈవో ఫిర్యాదుతో పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించారు.