వడ్ల కొనుగోలు సెంటర్ల ఏర్పాటుపై ఖమ్మం జిల్లా అధికారుల నజర్​

  • వచ్చే నెలలో ప్రారంభించేందుకు అధికారుల ప్లాన్​
  • ఈ ఏడాది కొనుగోలు లక్ష్యం 4లక్షల మెట్రిక్​టన్నులు
  • ఈసారి 50వేల ఎకరాల్లో తగ్గిన వరిసాగు 

ఖమ్మం, వెలుగు: వానాకాలం వరి కోతలు స్టార్ట్​ అవడంతో వడ్ల కొనుగోలు సెంటర్ల ఏర్పాటుపై జిల్లా అధికారులు నజర్​ పెట్టారు. రెండు వారాల్లో జిల్లా వ్యాప్తంగా 232 సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోతలు ముందుగా మొదలయ్యే పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వచ్చే నెల ఫస్ట్​వీక్​లో కొనుగోలు సెంటర్లు ప్రారంభించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఆ తర్వాత దశలవారీగా మిగిలిన చోట్ల స్టార్ట్​చేయనున్నారు. మహిళా సంఘాలు, పీఏసీఎస్​ల ఆధ్వర్యంలో సెంటర్లు ఏర్పాటుకానున్నాయి. గతేడాది ఏర్పాటుచేసిన అన్ని చోట్లా మళ్లీ ఏర్పాటుచేయాలని నిర్ణియించారు. అవసరాన్ని బట్టి, స్థానికంగా ఉన్న డిమాండ్​ ను బట్టి వాటిని మరింత పెంచేందుకు ప్లాన్​ చేస్తున్నామని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

తగ్గిన వరి సాగు 

ఈ ఏడాది 4లక్షల మెట్రిక్​టన్నుల వడ్లు కొనాలని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది 4 లక్షల మెట్రిక్​ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా 2.78 లక్షల మెట్రిక్​ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మరోవైపు గతేడాది వానాకాలం 2.95 లక్షల ఎకరాల్లో వరి సాగవగా ఈసారి దాదాపు 50 వేల ఎకరాల్లో పంట తగ్గింది. దీంతో ఆఫీసర్ల అంచనా మేరకు కొనుగోలు సెంటర్లకు వడ్లు రాకపోవచ్చని భావిస్తున్నారు. 

బార్డర్​లో చెక్​పోస్టులు 

రాష్ట్రంలో మద్దతు ధరకు ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుండడంతో జిల్లాను ఆనుకొని ఉన్న ఏపీ రైతుల నుంచి కొందరు స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు కొని ఇక్కడి రైతుల పేర్ల మీద వాటిని ప్రభుత్వానికి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ నుంచి జిల్లాలోకి వచ్చే రోడ్లపై 8 చోట్ల చెక్​ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఈ సీజన్​ లో కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉంటాయని అంచనా వేయగా, ఇప్పటికే 60 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాటిని కూడా తెప్పిస్తామని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్​ మిల్లులకు ధాన్యం తరలించేందుకు ట్రాన్స్​ పోర్ట్ టెండర్లకు నిర్వహించారు. టెండర్లలో లారీ యజమానులు కోట్ చేసిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని, వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

రెండు వారాల్లో కొనుగోలు సెంటర్లు

 జిల్లాలో ఈ సీజన్​ లో 232 కొనుగోలు సెంటర్లు ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించాం. అవసరాన్ని బట్టి వాటిని అదనంగా ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ సెంటర్లను వచ్చేనెల మొదటివారంలోగా ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 60 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయి. మరో 40 లక్షల గన్నీలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నాం.

సోములు, సివిల్​ సప్లైస్​ జిల్లా మేనేజర్​