
- ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం
- భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు
- ఈ సీజన్లోనూ సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్
ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా నాట్లు వేసిన చోట వరి పంట కోతల దశకు వస్తుండడంతో ముందస్తుగా సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 488 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో 15 రోజుల్లో కొనుగుళ్లు ప్రారంభం కానున్నాయి.
ఎక్కడ.. ఎలా?
ఖమ్మం జిల్లాలో ఈ సీజన్ లో 2.58 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం 344 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. డ్వాక్రా సంఘాల ద్వారా 151, పీఏసీఎస్‌ల ద్వారా 162, డీసీఎంఎస్ ద్వారా 28, మెప్మా 3 కేంద్రాలు ఏర్పాటుచేయనున్నాయి. ఈ కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం పరీక్షించే మిషన్లు, తూర్పార పట్టే యంత్రాలను సమకూర్చుకునే పనిలో ఉన్నారు.
వచ్చే నెల మొదటి వారం నుంచి అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా అధికారులు రెడీ అవుతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 144 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి తర్వాత కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు.
పెరిగిన పంటల సాగు విస్తీర్ణం
జిల్లాలో గతేడాది నాగార్జున సాగర్ లో నీళ్లు లేకపోవడం ఎన్ఎస్పీ ఆయకట్టు కింద చాలా వరకు పంట సాగుచేయలేదు. కానీ ఈసారి సాగర్ జలాలు అందుబాటులో ఉండడం, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఏన్కూరు లింక్ కాల్వ ద్వారా గోదావరి నీటిని కూడా తరలించడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ యాసంగి సీజన్ లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో సన్న రకం పండించారని భావిస్తున్నారు. మొత్తం 5.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, అందులో రైతుల సొంత అవసరాలకు పోను 2.58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. వీటి కోసం 64.62 లక్షల గోనె సంచులు కావాల్సి ఉండగా, ప్రస్తుతానికి 19.39 లక్షలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి.
మిగిలినవి కొనుగోళ్లు ప్రారంభం అయిన తర్వాత దశలవారీగా తెప్పించనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 70 మిల్లులకు తరలించనున్నారు. వాటిని మర పట్టించి మిల్లర్లు బియ్యం తిరిగివ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ మొదటివారం నుంచి మే నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఏప్రిల్ రెండోవారం నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
బోనస్ కంటిన్యూ కానీ..
ఈ సీజన్ లో కూడా సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ యాసంగి సీజన్ లో బోనస్ మీద ఆశతోనే 60 శాతానికి పైగా రైతులు సన్నరకం ధాన్యం పండించారు. కాగా, వానా కాలం సీజన్ కు సంబంధించి ఇంకా 17 వేల మందికి పైగా రైతులకు ధాన్యం బోనస్ డబ్బులు పెండింగ్ ఉన్నాయి. మొత్తం 47,494 మంది రైతులు సన్న వడ్లు అమ్మగా, ఈనెల పదో తేదీ వరకు అందులో 29,957 మంది రైతులకు రూ.88.13 కోట్లు బోనస్ గా చెల్లించారు. మిగిలిన 17,537 మంది రైతులకు రూ.48.19 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది.
క్రమంగా అందరు రైతుల అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ అవుతాయని సివిల్ సప్లయ్స్ అధికారులు చెబుతున్నారు. అయితే పంట అమ్మి రెండు నెలలు కావస్తుండడంతో బోనస్ అందని రైతులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. బోనస్ రూ.500 కోసమే ధాన్యాన్ని ఎండబెట్టి మరీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే, ఇంత ఆలస్యం చేయడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు.