ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం,వెలుగు: శుభ్రత పాటిస్తే రోగాలకు దూరంగా ఉంచొచ్చని ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు అన్నారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా శనివారం ఏపీ కోర్, యూనిసెఫ్​ సంయుక్తంగా నిర్వహించిన హ్యాండ్​ వాషింగ్​ డే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ హానికరమైన రోగాలు రావడానికి అపరిశుభ్రతే కారణమని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ పాటించేలా చైతన్య పర్చాలని సూచించారు. దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని 36 మారుమూల గ్రామాల్లో మైక్​ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఏపీ కోర్, యూనిసెఫ్​ ప్రతినిధులు తెలిపారు. ఏపీవో జనరల్​ డేవిడ్​రాజు, ఏవో భీమ్, అగ్రికల్చర్​ ఏడీ భాస్కరన్, మేనేజర్​ ఆదినారాయణ పాల్గొన్నారు.

ఆర్టీసీని ఆదరించండి

దమ్మపేట, వెలుగు: ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి ఆదరించాలని సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి కోరారు. శనివారం మండలంలోని గణేశ్ పహాడ్  గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ మర్రి కుటుంబరావు అధ్యక్షతన ‘ప్రజల వద్దకు ఆర్టీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ అనేక రాయితీలను కల్పిస్తూ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుందని తెలిపారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులను ఆదరించాలని కోరారు. 

చౌటపల్లిలో పశువైద్య శిబిరం

కూసుమంచి, వెలుగు: మండలంలోని చౌటపల్లి గ్రామంలో శనివారం రిలయన్స్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరాన్ని పశు వైద్యాధికారి డాక్టర్​ నీలికాంత్​ ప్రారంభించారు. 927 జీవాలకు చికిత్స చేశారు. చల్లా వెంకటేశ్వర్లు, సిబ్బంది వరలక్ష్మి, స్వరూప, వీరబాబు పాల్గొన్నారు.

కల్తీ ఆహారంపై అవగాహన పెంచుకోవాలి

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మం సిటీలోని న్యూ, ఓల్డ్ బస్టాండుల వద్ద కల్తీ ఆహారంపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ ఇన్​స్పెక్టర్  కిరణ్​కుమార్​ మాట్లాడుతూ కల్తీ ఆహారంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ అందించాలని ఆదేశించారు. ఆహార కల్తీకి పాల్పడి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బి నీలిమ, విజయ్ కుమార్  పాల్గొన్నారు.

గంజాయి పట్టివేత

మణుగూరు, వెలుగు: మండలంలో గంజాయి అమ్ముతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ముత్యం రమేశ్​ తెలిపారు. మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన సాధనాల కాంతి, బోడ తరుణ్, ఏపీలోని చింతూరు మండలం వేకవారి గూడెం గ్రామానికి చెందిన వేక రామకృష్ణ కలిసి చింతూరు నుంచి  గంజాయిని తీసుకొని మణుగూరు ప్రాంతంలో అమ్ముతున్నారని చెప్పారు. రెండున్నర కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్సై రాజకుమార్, ఏఎస్సై శాంతి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, బాబు పాల్గొన్నారు. 

రేపటి నుంచి జోనల్​ లెవల్​ స్పోర్ట్స్

భద్రాచలం,వెలుగు: ఈ నెల 17 నుంచి 19 వరకు గురుకులం జోనల్​ లెవల్​ స్పోర్ట్స్  మీట్​ నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పోటీలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. తన చాంబరులో శనివారం స్పోర్ట్స్  మీట్​ ఇన్విటేషన్​ను గురుకులం కోఆర్డినేటర్, ఏపీవో జనరల్​ డేవిడ్​రాజుతో కలిసి రిలీజ్​ చేశారు. స్టూడెంట్లకు, వారితో వచ్చే ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, పీఈటీలకు పాల్వంచ, కిన్నెరసానిలలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. 

అర్హుల జాబితాను తెప్పించండి

ఎంపీడీవో ఆఫీసుల్లో ట్రైకార్, ఎంఎస్ఎంఈ, ఫిషరీస్, గిరివికాసం పథకాలకు అప్లై చేసుకున్న అర్హుల జాబితా వెంటనే తెప్పించి వాటిని గ్రౌండ్​ చేయాలని ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు యూనిట్​ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం తన చాంబరులో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడుతూ 2020–-21, 2021–-22 ఆర్ధిక సంవత్సరాల్లో అప్లై చేసుకున్న లబ్ధిదారుల జాబితా తెప్పించాలన్నారు. ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్, ఎస్​వో సురేష్​బాబు, ఫిషరీస్ స్పెషల్ ఆఫీసర్​ అశోక్  పాల్గొన్నారు.

మావోయిస్టు నేత సంతుకు హాని తలపెట్టొద్దు

చర్ల, వెలుగు: పోలీసుల అదుపులో ఉన్న చర్ల ప్లాటూన్​ సీనియర్​ దళ సభ్యుడు సంతును వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్​ కమిటీ కార్యదర్శి ఆజాద్​ పేరిట లేఖను విడుదల చేశారు. ఈ నెల 9న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం దొరమెట్టి గ్రామంలో సంతుతో పాటు గ్రామస్తుడు మణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వీరికి ఎలాంటి హాని తలపెట్టినా రెండు రాష్ట్రాల పోలీసులు, అధికార పార్టీ నాయకులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వారం రోజులు గడుస్తున్నా వారి అరెస్టు చూపలేదని, పార్టీ రహస్యాలు చెప్పమని  చిత్రహింసలకు గురి చేస్తున్నారని అరోపించారు.

చేపల పెంపకంపై శిక్షణ

కూసుమంచి, వెలుగు: చేపల పెంపకంలో చెరువు నిర్మాణానికి స్థల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుందని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం శాస్ర్తవేత్త డాక్టర్  జి విద్యాసాగర్​రెడ్డి చెప్పారు. శనివారం మత్స్య పరిశోధన కేంద్రంలో  ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన మత్స్యకారులకు 5 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. మంచినీటి చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. శాస్ర్తవేత్తలు పి శాంతన్న, రవీందర్​ పాల్గొన్నారు. 

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

కారేపల్లి,వెలుగు: వ్యాపారంలో నష్టపోయి అప్పుల భాదతో జర్పుల ప్రేమ్​కుమార్​(28) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భాగ్యనగర్​తండాకు చెందిన ప్రేమ్​కుమార్​ గ్రామంలో కిరాణా షాపు నడుపుతుండగా, సరిగా నడవక అప్పుల పాలయ్యాడు. దుకాణం తీసేసి రెండేళ్ల కింద భార్య, పిల్లలతో ఖమ్మం వెళ్లి ప్రైవేట్​ జాబ్​ చేస్తుండగా, అప్పులు ఇచ్చిన వారు అక్కడికి వెళ్లి డబ్బులు అడగడంతో ఈ నెల 13న భాగ్యనగర్​తండాకు వచ్చి ఇంటి వద్దనే పురుగులమందు తాగాడు. కుటుంబీకులు కొత్తగూడెం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి హరిసింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకొని వివాహిత..
కూసుమంచి: మండలంలోని బికారితండాలో అనారోగ్య కారణాలతో తేజావత్​ గంగ(32) ఆత్మహత్య చేసుకుంది. నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాస నందీప్​ తెలిపారు.

‘కాలేజీకి వెళ్లమంటే సూసైడ్​ చేసుకుంది’

ములకలపల్లి, వెలుగు: తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లమనడంతో మనస్థాపానికి గురై ఇంటర్ విద్యార్థిని ఉకే రమాదేవి(16) సూసైడ్​ చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని రాజాపురం గ్రామానికి చెందిన రమాదేవి గండుగులపల్లి ఏకలవ్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె తిరిగి కాలేజీకి వెళ్లకపోవడంతో శుక్రవారం తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లమని చెప్పారు. సోమవారం కాలేజీకి వెళ్తానని అనడంతో ఇప్పటికే ఆలస్యమైందని, వెళ్లాల్సిందేనని గట్టిగా మందలించారు. వస్తువులు కొనుక్కునేందుకు బయటికి వెళ్లిన ఆమె ఇంటి సమీపంలోని బావిలో దూకి సూసైడ్​ చేసుకుంది. తండ్రి నాగబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్​ తెలిపారు.

పోలీస్​ పెట్రోలింగ్​ కారు, ఆటో ఢీ

వేంసూరు, వెలుగు: ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, పోలీస్​ పెట్రోలింగ్​ కారు ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్  ఆఫీస్​ సమీపంలో సత్తుపల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పోలీస్ పెట్రోలింగ్ కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆటోలో ఏడుగురు ప్రయాణికులు ఉండగా, ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో సత్తుపల్లి గవర్నమెంట్​ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. 

అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

దమ్మపేట, వెలుగు: అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌  సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కోరారు. శనివారం మండలంలోని తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో గ్రామస్తులతో కలిసి అంబులెన్స్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ‌ మాట్లాడుతూ మండలంలో అంబులెన్స్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లి రూ.25 లక్షలతో అంబులెన్స్  మంజూరు చేయించినట్లు తెలిపారు. జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,108 మేనేజర్  భూమా నాగేందర్  పాల్గొన్నారు. 

బూత్​స్థాయి నుంచి పార్టీ పటిష్ఠం 

సత్తుపల్లి, వెలుగు: బీజేపీ సెంట్రల్ కమిటీ నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలోని 19 ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందని పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కనగాల వెంకటరామయ్య తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 18 నుంచి 35 ఏండ్ల వారంతా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో బూత్​ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖమ్మం పార్లమెంట్  కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు నాయుడు రాఘవరావు, సుదర్శన్ మిశ్ర, ఆర్గనైజింగ్  సెక్రటరీ హరీశ్, పట్టణ,  మండల అధ్యక్షులు నాగస్వామి, పాలకొల్లు శ్రీను, రహమతుల్లా, ఎస్కే సుభాని, మన్నెని నర్సింహామూర్తి పాల్గొన్నారు.

పోడు సర్వే ప్రారంభించాలి

ములకలపల్లి, వెలుగు: మండలంలో వెంటనే పోడు సర్వే కొనసాగించాలని సీపీఎం మండల కమిటీ నాయకులు శనివారం అడిషనల్​ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ ఫారెస్ట్  అధికారులు వివిధ కారణాలు చెబుతూ సర్వేను వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతారు చేస్తున్నారని, వెంటనే సర్వే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయుకులు పొడియం వెంకటేశ్వర్లు, ఊకంటి రవికుమార్, రావుజా పాల్గొన్నారు.

మాస్టర్ ప్లాన్ తయారీపై సమావేశం

మధిర, వెలుగు: పట్టణాన్ని డెవలప్​ చేసేందుకు శనివారం మధిర మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్  నోడల్ ఆఫీసర్ ప్రసాద్  అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మున్సిపల్ చైర్ పర్సన్  ఎం లత, మున్సిపల్​ కమిషనర్ రమాదేవి, టీపీవో రమేశ్, ఏఈ నరేశ్​రెడ్డి పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పావురాల ఖాసీం కుటుంబానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తరపున మండల నాయకులు శనివారం రూ.15 వేల ఆర్థికసాయం అందించారు. మున్నూరుకాపు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, సంఘం ట్రస్ట్ బోర్డు  సెక్రటరీ  కనిశెట్టి నర్సయ్య, సర్పంచ్ చెన్నబోయిన సైదులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి నగదును అందజేశారు.

‘యువతకు కలాం ఆదర్శం’

పెనుబల్లి, వెలుగు: నేటి యువత అబ్దుల్​కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని బ్రాహ్మలకుంట గ్రామంలో శనివారం ప్రైమరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన లైబ్రరీని కల్లూరు ఏసీపీ ఎన్​ వెంకటేశ్​తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టిందని నిరుద్యోగ యువత అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లైబ్రరీ పుస్తకాల దాత మనోహర్​రెడ్డి, సత్తుపల్లి రూరల్​ సీఐ హనూక్, ఎస్సైలు సూరజ్, కొండలరావు, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, నీలాద్రి చైర్మన్​ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

రామయ్యకు బంగారు తులసీదళార్చన

భద్రాచలం,వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం బంగారు తులసీదళాలతో అర్చన నిర్వహించారు. మూలవరులకు సుప్రభాత సేవ చేశాక బాలబోగం నివేదించారు. తర్వాత సువర్ణ తులసీదళాలతో స్వామికి అర్చన చేయగా, భక్తులు పాల్గొన్నారు. భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపంలోకి తీసుకొచ్చారు. నిత్య కల్యాణం నిర్వహించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత స్వామికి రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.