ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: హాస్టల్స్, గురుకులాలకు టెండర్​ ప్రకారం నాణ్యమైన సరుకులు సప్లై చేయని కాంట్రాక్టర్లను బ్లాక్​ లిస్ట్​లో పెట్టాలని కలెక్టర్​ అనుదీప్​ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ఆఫీసర్లు, జిల్లా అధికారులు, ప్రిన్సిపాళ్లు, కాంట్రాక్టర్లతో సోమవారం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. స్టూడెంట్స్​కు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. సరఫరా చేసిన వస్తువులు ఎప్పటికప్పుడు రిజిష్టర్​లో నమోదు చేయాలని అన్నారు. ప్రతి గురుకులం, హాస్టల్​లో కంప్లైట్​ బాక్స్​ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీటింగ్​కు హాజరు కాని కాంట్రాక్టర్లకు షోకాజ్​ నోటీసులు జారీ చేయాలన్నారు. అనంతరం తెలంగాణ ఓపెన్​ స్కూల్స్​లలో అడ్మిషన్లపై రూపొందించిన పోస్టర్లను రిలీజ్​ చేశారు. రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్​ అవార్డు పొందిన దుమ్ముగూడెం  యూపీఎస్​కు కలెక్టర్​ అవార్డుతో పాటు రూ.10 వేల నగదును అందజేశారు.

గంజాయి పట్టివేత

సుజాతనగర్, వెలుగు: వెహికల్స్  చెక్​ చేస్తుండగా 6.5 కేజీల గంజాయి పట్టుబడినట్లు డీఎస్పీ వెంకటేశ్వర బాబు తెలిపారు. ఎస్ఐ తిరుపతిరావు సిబ్బందితో కలిసి సోమవారం మండలంలోని వేపలగడ్డ రైల్వే బ్రిడ్జి సమీపంలో నెంబర్  ప్లేట్  లేని బైక్​ను ఆపారు. ఒడిసా రాష్ట్రం మల్కాన్​గిరి జిల్లా కంగురుగొండ గ్రామానికి చెందిన బలరాం చౌదరి పారి పోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. బైక్​ను చెక్ చేయగా సీటు కింద, పెట్రోల్ ట్యాంక్ కవర్​లో గంజాయి దొరికినట్లు చెప్పారు. 

ఖమ్మం రైల్వే స్టేషన్​లో..

ఖమ్మం కార్పొరేషన్: రైలులో ఢిల్లీకి తరలించడానికి సిద్దంగా ఉన్న 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్​కు తరలించినట్లు ఖమ్మం ఎక్సైజ్​ సీఐ కొత్త రాజు తెలిపారు. ఆర్పీఎఫ్, ఎక్సైజ్​ టాస్క్​ఫోర్స్​ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి విజయనగరానికి చెందిన విజయ్​కుమార్​ పురోహిత్, యూపీ​ఘజియాబాద్​కు చెందిన ఖుస్​నసీబ్, మహ్మద్​ ఆసిఫ్​లు ఢిల్లీకి వెళ్లేందుకు ట్రైన్​ మారుతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. తనిఖీల్లో ఎక్సైజ్​ అధికారులు రవి, అచ్చారావు, షేక్​ రబ్బానీ, ఆర్పీఎఫ్​ ఎస్ఐ త్రివేణి, ఏఎస్ఐ రఘురామరావు, సిబ్బంది శవికాంత్, నరేశ్, మదన్మోహన్, మారేశ్వరరావు పాల్గొన్నారు. 

52 బైక్​లు స్వాధీనం

అశ్వారావుపేట, వెలుగు: పట్టణంలోని వడ్డెర బజారులో సోమవారం సీఐ బొమ్మెర బాలకృష్ణ ఆధ్వర్యంలో కార్డన్  సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 బైక్​లను సీజ్​ చేశారు. సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్ఐలు రాజేశ్ కుమార్, సాయి కిశోర్ రెడ్డి పాల్గొన్నారు.

మణుగూరులో కార్డెన్ సెర్చ్ 

మణుగూరు, వెలుగు: మండలంలోని శివలింగాపురం, బాపనకుంట, శేషగిరి నగర్, రాజుపేట ఏరియాల్లో మణుగూరు డీఎస్పీ ఎస్వీ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మణుగూరు, అశ్వాపురం, పినపాక సీఐలు ముత్యం రమేశ్, చెన్నూరు శ్రీనివాస్, బూర రాజగోపాల్, ఎస్ఐలు రాజ్ కుమార్, పురుషోత్తం, సూరి పాల్గొన్నారు.

నేడు డయల్​ యువర్​ ఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: డయల్​ యువర్​ ఎస్పీ ప్రోగ్రామ్​ మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్​ వినీత్​ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి 12,30 గంటల వరకు డయల్​ యువర్ ఎస్పీ  ప్రోగ్రామ్​ ఉంటుందని, 08744–243666 నెంబర్​కు ఫోన్​ ద్వారా సమస్యలు తెలపాలని సూచించారు. 

ఇద్దరిపై పీడీ యాక్ట్

భద్రాచలం: గంజాయి అక్రమ రవాణా, మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న కేసులో భద్రాచలం ఏఎస్పీ రోహిత్​రాజ్​ సోమవారం ఇద్దరిపై పీడీ యాక్ట్​ నమోదు చేసినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు. గంజాయి కేసులో మిర్యాలగూడకు చెందిన దారావత్​ రమణపై, మావోయిస్టు పార్టీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడనే కారణంతో పినపాకకు చెందిన భగతు వెంకన్న పీడీ యాక్ట్​ పెట్టి హైదరాబాద్ లోని​చర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు.

చెరుకు తోట దగ్ధం

అశ్వారావుపేట, వెలుగు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మండలంలోని ఊట్లపల్లికి చెందిన వెంకట రామారావుకు చెందిన 20 ఎకరాల చెరుకు తోట దగ్ధమైంది. సోమవారం సాయంత్రం స్టార్టర్  దగ్గర షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. ఫైర్  ఇంజన్​ వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈలోగా 8 ఎకరాల తోట దగ్ధమై రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.

లంచాలు ఇవ్వలేక ఉద్యోగానికి రాజీనామా

భద్రాద్రి కొత్తగూడెం: లంచాలు ఇవ్వలేకనే తన ఉద్యోగానికి రాజీనామా చేశానని సుజాతనగర్​ మండలం గరీబ్​పేట గ్రామదీపిక షహనాజ్​బేగం కలెక్టర్​ అనుదీప్​ కు కంప్లైట్​ ఇచ్చారు. కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో ఆమె ఫిర్యాదు చేశారు. సీసీ శ్రీలక్ష్మి తనకు రావాల్సిన జీతాన్ని ఇవ్వకుండా వేధిస్తున్నారని, ఏ లోన్​ కావాలన్నా, జీతం కావాలన్నా లంచం ఇవ్వాల్సిందేనని వాపోయారు. ఇక ధరణిని రద్దు చేయాలని పాండురంగాపురానికి చెందిన రైతులు కలెక్టర్​కు వినతిపత్రాన్ని అందజేసి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో తమ ఇండ్లను గ్రామపంచాయతీలో నమోదు చేసుకున్నామని, ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని, అయినా జీపీ ఆఫీసర్లు ఇంటి నెంబర్లు రద్దు చేశారని మల్లికారాణి కలెక్టర్​కు దరఖాస్తు అందించారు. అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. 

డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలి

ములకలపల్లి,వెలుగు: డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి బుంగవీటి సరళ, జిల్లా కార్యదర్శి ఎం జ్యోతి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీజీవీబీ బ్యాంక్ ఎదుట రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు హామీ అమలు చేయలేదన్నారు. బ్యాంకర్లు సామన్లను జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఐద్వా మండల అధ్యక్ష, కార్యదర్శులు మేకల అనసూర్య, బేతి అమల, తిమ్మంపేట సర్పంచ్ గౌరి లక్ష్మి, ముదిగొండ రమాదేవి, సమ్మక్క, విమల, సిద్దిని రమణ, భుక్యా శ్రీదేవి పాల్గొన్నారు.

‘119 శాతం ఉత్పత్తి సాధించినం’

మణుగూరు, వెలుగు: మణుగూరు ఏరియా అక్టోబర్ నెలలో 119 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. కాన్ఫరెన్స్ హాల్​లో సోమవారం ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ నెలలో 10.16 లక్షల టన్నుల టార్గెట్ కు గాను, 12.06 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించామని చెప్పారు. ఓవర్ బర్డెన్ (మట్టి తొలగింపు) 15 లక్షల క్యూబిక్  మీటర్లకు గాను, 11.64 లక్షల క్యూబిక్ మీటర్లు తీసినట్లు తెలిపారు. ఏజీఎం జి నాగేశ్వరరావు, ఎస్ఓటు జీఎం లలిత్ కుమార్, ఏరియా ఇంజనీర్ ఫ్రిడ్జ్ గేరాల్డ్, పీవో లక్ష్మీపతి గౌడ్, డీజీఎంలు వెంకట్రావు, నర్సిరెడ్డి, రమేశ్ పాల్గొన్నారు. 

పంచాయతీ ఆఫీసులోకి దూసుకెళ్లిన వ్యాన్

చండ్రుగొండ,వెలుగు: మండలంలోని మద్దుకూరు గ్రామ పంచాయతీ ఆఫీసులోకి సోమవారం డీసీఎం వ్యాన్ దూసుకెళ్లి బోల్తా పడింది. విజయవాడ నుంచి కొత్తగూడెంకు కూరగాయల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ సోమవారం తెల్లవారుజామున మూలమలుపు వద్ద అదుపుతప్పి జీపీ ఆఫీసులోకి దూసుకెళ్లింది. రూ.50 వేల విలువైన కూరగాయలు నేలపాలయ్యాయి. వ్యాను పూర్తిగా ధ్వంసం కాగా డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్ఐ విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముత్తంగి రూపంలో రామయ్య దర్శనం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం భక్తులకు ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో  స్వామికి సుప్రభాతసేవ చేసిన అనంతరం అర్చకులు బాలబోగం నివేదించాక ముత్యాలు పొదిగిన వస్త్రాలతో మూలవరులను అలంకరించారు. ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు. లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిని కూడా ముత్యాలు పొదిగిన వస్త్రాలతో అలంకరించి ముత్తంగి సేవ చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. 21 మంది జంటలు కంకణాలు ధరించి స్వామి కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. అనంతరం రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. కార్తీక సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో రామయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

పోలీస్​ అభ్యర్థులకు శిక్షణ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పోలీస్​ ఉద్యోగ నియామకాలకు అర్హత సాధించిన వారికి ఫ్రీ కోచింగ్​ ఇస్తామని సింగరేణి జీఎం (వెల్ఫేర్)​ కె. బసవయ్య తెలిపారు. అర్హత పొందిన అభ్యర్థులకు కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లోని జయశంకర్​ గ్రౌండ్​లో 45 రోజుల పాటు ట్రైనింగ్​ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఫ్రీ కోచింగ్​ కోసం ఈ నెల 7లోగా జీఎం వెల్ఫేర్​ ఆఫీస్​లోని సింగరేణి సేవా సమితి కో ఆర్డినేటర్​కు అందజేయాలని సూచించారు.

రౌడీ ముఠా అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పట్టణంలోని గాజుల రాజం బస్తీలో ఏడుగురు సభ్యులున్న రౌడీ ముఠాను అరెస్ట్​ చేసినట్లు త్రీటౌన్​ సీఐ అబ్బయ్య తెలిపారు. కత్తులు, గొడ్డళ్లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో ఎస్ఐ సోమేశ్వర్​ నిఘా పెట్టారని తెలిపారు. ప్రభాకర్​, మిరియాల శ్రీకాంత్​ అలియాస్​ గుడుంబా శ్రీకాంత్, సంగం సందీప్, కె. భరత్, డీజే నవీన్, మాలోత్​ సాయి, కె గోపిచంద్​కలిసి ఇటీవల మర్డర్​ కేసులో జైలుకెళ్లిన జగడం సాయికుమార్​ పేరుతో రౌడీ గ్యాంగ్​ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీరి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నల్లబ్యాడ్జీలతో ఉద్యోగ సంఘాల నిరసన

ఖమ్మం, వెలుగు: ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ముందు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్​ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలతో డ్యూటీలకు హాజరైన ఉద్యోగులు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అఫ్జల్ హసన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానించడం తగదన్నారు. ఉద్యోగ సంఘాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. జిల్లా కార్యదర్శి సాగర్, జేఏసీ నాయకులు కోడిలింగయ్య, హకీమ్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ చెంచు వీరనారాయణ, ఉపాధ్యక్షుడు నందగిరి శ్రీను, మహిళా విభాగం అధ్యక్షురాలు శాబాసు జ్యోతి పాల్గొన్నారు. 

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

కారేపల్లి, వెలుగు : మండలంలోని వివిధ గ్రామాల్లో ఏసీడీపీ నిధులతో పూర్తయిన సీసీ రోడ్లను వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్  సోమవారం ప్రారంభించారు. కారేపల్లి, గేట్ కారేపల్లి, కమలాపురం గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎంపీపీ  మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

సైబర్ నేరాలపై అవగాహన

సత్తుపల్లి, వెలుగు: ఆర్థిక నేరాలు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ రాములు సూచించారు. సోమవారం మండలంలోని గంగారం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్  కాలేజీలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలేజీ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్  డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి, డైరెక్టర్ డాక్టర్ చెన్నుపాటి విజయకుమార్, ఏఎస్ఐ ఎం జయబాబు పాల్గొన్నారు.
 

ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్​ పోటీలు

ఏడో తెలంగాణ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్  గర్ల్స్  వాలీబాల్ పోటీల్లో నల్గొండ జట్టు విజేతగా నిలిచింది. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వరంగల్​తో జరిగిన పోరులో 3–-2 తేడాతో నల్గొండ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో మహబూబ్​నగర్​తో జరిగిన మ్యాచ్​లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. ​విజేతలకు గెస్ట్​లు బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం రాష్ట్ర జట్లను ప్రకటించారు. ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్యాంప్​ ఫైర్​లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. - భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు

ఘనంగా ఏక్తా దివస్

సర్దార్​ వల్లభాయ్ పటేల్​ జయంతి సందర్భంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏక్తా దివస్​ జరుపుకున్నారు. ప్రధాన పట్టణాల్లో ఏక్తా దివస్​ ర్యాలీలను చేపట్టారు. పటేల్​ ఫొటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏక్తా దివస్​ ప్రతిజ్ఞ చేశారు. - వెలుగు, నెట్​వర్క్