ఖమ్మం టౌన్, వెలుగు: ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచి అందుబాటులోకి తేవాలని అన్నారు. సబ్ స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేసి, విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎఫ్వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఆర్అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, వాణిశ్రీ, ఆర్అండ్ బీ ఏఈ విశ్వనాథ్ ఉన్నారు.
గోళ్లపాడు పనుల పరిశీలన
గోళ్ళపాడు ఛానల్ పై చేపడుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు. ప్రకాశ్ నగర్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, మంచికంటినగర్, రంగనాయకులు గుట్ట వరకు పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి పాల్గొన్నారు.
రామయ్య కల్యాణ వైభోగం
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి గురువారం ప్రాకార మండపంలో నిత్య కల్యాణం వైభవంగా జరిగింది. గర్భగుడి నుంచి కల్యాణమూర్తులను పల్లకిలో మండపానికి తీసుకొచ్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం ఆరాధన నిర్వహించారు. పండితులు క్షేత్ర మహత్యాన్ని భక్తులకు వివరించారు. తర్వాత భక్తులు కంకణాలు ధరించి స్వామి వారి కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం నివేదించారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించారు. మధ్యాహ్నం రాజబోగం సమర్పించగా, సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
నీటి కుంటలతో భూగర్భ జలాలు పెరుగుతాయ్
కూసుమంచి, వెలుగు: నీటి కుంటలు నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని డీఏవో విజయనిర్మల అన్నారు. గురువారం మండలంలోని గోపాల్రావుపేట, కూసుమంచి, గట్టుసింగారం గ్రామాల్లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద రైతులు నిర్మించిన నీటి కుంటలను ఆమె పరిశీలించారు. ఏడీఏలు విజయచంద్ర, సరిత, టెక్నికల్ ఏవో రామకృష్ణ, ఏవో రామడుగు వాణి, ఏఈవోలు రవితేజ, వంశీకృష్ణ, ప్రియాంక పాల్గొన్నారు.
పైప్లైన్ నిర్మాణానికి ఆర్థికసాయం
వైరా, వెలుగు: పట్టణంలోని టీఎస్ ఆర్జేసీలో పైప్లైన్ ఏర్పాటుకు స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆర్థికసాయం చేశారు. వారం రోజులుగా పైప్ లైన్ పని చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న పేరెంట్స్ రూ.50 వేల ఆర్థికసాయం చేశారు. గురువారం కాలేజీ ఆవరణలో జేసీబీతో పైప్ లైన్ పనులు ప్రారంభించారు. టీఎస్ఆర్ జేసీలో విద్యార్థులు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ వెనక భాగంలో గోడ కూలడంతో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు వెన్నుపోటు పొడుస్తున్రు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కార్మికులకు వెన్నుపోటు పొడుస్తుందని ఏబీకేఎంఎస్(బీఎంఎస్) సెక్రటరీ పి మాధవ్ నాయక్ ఆరోపించారు. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే–5 ఇంక్లైన్లో గురువారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విషయంలో టీఆర్ఎస్ సర్కార్, టీబీజీకేఎస్ తెరవెనుక డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలంలో కంపెనీ పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. తాడిచర్ల బొగ్గు బ్లాకును ప్రైవేట్ వాళ్లకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 17న చేపట్టిన చలో పార్లమెంట్ ప్రోగ్రామ్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ నాయకులు మొగిలిపాక రవి, సంఘం చందర్, గణేశ్, భీమా, రాజమౌళి, హరికృష్ణ పాల్గొన్నారు.
మనబడి పనులను స్పీడప్ చేయాలి
ఎర్రుపాలెం, వెలుగు: మన ఊరు–-మనబడి పనులను స్పీడప్ చేయాలని అడిషనల్ కలెక్టర్ స్నేహలత సూచించారు. గురువారం రాజులదేవరపాడు, పెద్దగోపవరం, ఎర్రుపాలెం గ్రామాల్లో ఆమె పర్యటించి స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్, సర్పంచులతో మాట్లాడారు. పనులను క్వాలిటీగా చేపట్టాలని సూచించారు. ఎంపీపీ దేవరకొండ శిరీష, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీవో నాగరాజు, సర్పంచులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఇనుపనూరి శివాజీ, మొగిలి అప్పారావు పాల్గొన్నారు.
ఐదుగురిపై కేసు నమోదు
చండ్రుగొండ,వెలుగు: మండలంలోని రావికంపాడు సెక్షన్ పోకలగూడెం బీట్ పరిధిలోని ప్లాంటేషన్ లో పోడు సాగు కోసం పలువురు మొక్కలు నరికారు. గురువారం చండ్రుగొండ ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు, ఎంపీడీవో అన్నపూర్ణ, సర్పంచ్ రన్యా, పోలీసు సిబ్బంది నరికిన మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ ప్లాంటేషన్ లో మొక్కలు నరికిన, పోడు సాగు చేసిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పట్టా పాస్ బుక్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పోకలగూడెం ప్లాంటేషన్ లోని 2 హెక్టార్లలో రూ.2.79 లక్షల విలువైన 2,200 మొక్కలు, మద్దుకూరు ఫారెస్ట్ లో హెక్టారులో రూ. 1.34 లక్షల విలువైన 1,200 మొక్కలు నరికినట్లు తెలిపారు. మొక్కలు నరికిన ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలు నరికిన వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తామని అన్నారు.