భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలోని క్వార్టర్లను ఖాళీ చేయాలని సింగరేణి ఆఫీసర్లు మంగళవారం కాలనీకి వచ్చారు. వారిని రిటైర్డ్ కార్మికుల కుటుంబాలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెయిన్ హాస్పిటల్ ఏరియా వెనుక ఉన్న ప్రాంతంలో 50కి పైగా సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. ఇందులో 11 క్వార్టర్లలో కార్మిక కుటుంబాలు ఉంటుండగా, మిగిలిన వాటిలో రిటైర్డ్ కార్మిక కుటుంబాలు 40 ఏండ్లుగా ఉంటున్నాయి. ఇటీవల కార్మికులు కాని వారు క్వార్టర్లను ఖాళీ చేయాలని సింగరేణి ఆఫీసర్లు ఆదేశించారు. కరెంట్, వాటర్ సప్లై కూడా బంద్ చేయడంతో రిటైర్డ్ కార్మిక కుటుంబాలు ఆందోళన చేయడంతో సింగరేణి ఆఫీసర్లు కొంత వెనక్కి తగ్గారు. మంగళవారం జేసీబీలతో సింగరేణి ఆఫీసర్లు సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కాలనీ వచ్చారు. క్వార్టర్లను కూల్చివేయనున్నట్లు తెలిపారు. దీంతో జేసీబీని అడ్డుకొని క్వార్టర్లను కూల్చి వేస్తే తాము ఎక్కడికి వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఖాళీగా ఉన్న శిథిలావస్థకు చేరుకున్న క్వార్టర్లను మాత్రమే కూల్చి వేస్తున్నామని సింగరేణి ఆఫీసర్లు చెప్పగా వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇస్తామని చెప్పి సింగరేణి ఆఫీసర్లు వెళ్లి పోవడంతో ఆందోళన విరమించారు.
బ్యాక్‌లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
ఖమ్మం టౌన్, వెలుగు: దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శులు దోణవాన్ నాగరాజు, మహ్మద్ గౌస్ డిమాండ్ చేశారు. సిటీలోని ప్రజా సంఘాల భవనంలో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై 9 ఏండ్లు గడుస్తున్నా దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు ఉన్నా వేరే వాళ్లపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. దివ్యాంగులకు కూడా దళితబంధు తరహాలో స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌పీఆర్‌డీ లీడర్లు కె శ్రీనివాసరావు, ఎస్ ఉపేందర్, సతీశ్, లక్ష్మీదేవి, జగదీశ్, సుభద్ర, పాషా పాల్గొన్నారు.
అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలి
ఖమ్మం టౌన్, వెలుగు: అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ నేత్ర అవయవ దాతల సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన అవయవదాన కరపత్రాలను క్యాంప్ ఆఫీసులో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన తర్వాత అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలి పోవాలని అన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్, డీపీవో హరిప్రసాద్, పరకాల ఏసీపీ శివరామయ్య, డీఎల్పీవో పుల్లారావు, రిటైర్డ్ ఎంపీడీవో గుల్లపల్లి విద్యాసాగర్, ఆడెపు సుధాకర్, వెంకటేశ్వరరావు, దామోదర్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.
గిరిజనుల భూముల జోలికొస్తే ఊరుకోం
ఖమ్మం రూరల్, వెలుగు: 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు క్రీడా ప్రాంగణం పేరుతో లాక్కోవాలని చూస్తే ఊరుకోమని గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా రామ్మూర్తినాయక్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని సూర్యనగర్‌లోని సర్వే నెంబర్ 127/6లో ధరావత్ లచ్చు సాగు చేసుకుంటున్న భూమిని గిరిజన సంఘం నాయకులుపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో లచ్చుకు19 గుంటల భూమికి పట్టా ఇచ్చారని చెప్పారు. అధికారులు గిరిజనుడి భూమిని లాక్కుంటామని బెదిరించడం సరైంది కాదన్నారు. జిల్లా కార్యదర్శి బోడా వీరన్న, అధ్యక్షుడు భారత్, లీడర్లు బానోత్ రామకోటి, పాల్తీయ శ్రీను, బానోత్ రాంబాబు, అజ్మీరా కిషన్ నాయక్, భుక్యా మంగీలాల్, నరసింహ, గుగులోత్ శ్రీను, బానోత్ గడ్డ నాయక్ పాల్గొన్నారు.
20న మున్నూరు కాపు వన సమారాధన
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20న ప్రకాశ్ నగర్ లో నిర్వహించనున్న కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. మంగళవారం బుర్హాన్ పురంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మున్నూరుకాపుల్లో ఐకమత్యం, రాజకీయ చైతన్యం, సేవాభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కాపు ఫెడరేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టి రంగారావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నాయకులు మేకల బిక్షమయ్య, కె విజయ్ కుమార్, పసుపులేటి దేవేందర్, పసుపులేటి వెంకట్, రాపర్తి శరత్, శీలంశెట్టి వీరభద్రం, పొన్నం వెంకటేశ్వర్లు, ఉండీల గంగాధర్, ఆళ్ల కృష్ణ, మలిశెట్టి సతీశ్ పాల్గొన్నారు.
లోక్ అదాలత్ లో రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లే
ఇల్లందు, వెలుగు: జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖేశ్ తెలిపారు. మంగళవారం ఇల్లందు కోర్టులో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టులో కేసు నడిస్తే ఏండ్ల పాటు తిరిగినా ఒక్కరికే న్యాయం జరుగుతుందని అన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లే అవుతుందని అన్నారు. డబ్బున్న వారికి న్యాయం అందుతుందనేది పాతకాలం మాటని, ఇప్పుడు అందరూ ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేశ్వరరావు, లాయర్లు చెన్నకేశవరావు, బాలకృష్ణ, సుడిగాలి వెంకటనర్సయ్య, ఉమామహేశ్వరరావు, కార్తీక్ పాల్గొన్నారు.
పీవీకే-5 ఇంక్లైన్లో మ్యాన్ రైడింగ్ ఏర్పాటు చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఏరియాలోని పీవీకే–5 ఇంక్లైన్లో మ్యాన్ రైడింగ్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ డిమాండ్ చేశారు. మంగళవారం మైన్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాన్ రైడింగ్ లేక పని ప్రదేశాలకు వెళ్లేందుకు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాక్టింగ్ కార్మికులకు ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. అత్యవసర సిబ్బందికి ప్లేడేలు, ఓటీలు ఇవ్వాలని కోరారు. అనంతరం ఏజెంట్ రవీందర్, మేనేజర్ పాలడుగు శ్రీనివాస్‌లను కలిసి కార్మికుల సమస్యలు వివరించారు. రీజనల్ సెక్రటరీ కూసన వీరభద్రం, పిట్ సెక్రటరీ చిలక రాజయ్య, చంద్రమౌళి, శివ, రామారావు, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులపై కేసు
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలోని శ్రీ బాలాజీ చెస్ట్ హాస్పిటల్ పై, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించినట్లు ఛాతీ వైద్యులు డాక్టర్ జి.శ్యామ్ కుమార్ వెల్లడించారు. సిటీలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్యామ్ కుమార్ మాట్లాడారు. 2021 ఏప్రిల్ చివరి వారంలో ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన రోగి భద్రయ్య కరోనాతో బాధపడుతూ తమ ఆసుపత్రికి వచ్చారని, అతని కుటుంబసభ్యుల రిక్వెస్ట్మేరకు వైద్యం అందించామన్నారు. క్యూర్ అవుతున్న టైంలో హాస్పిటల్ స్టాఫ్ లేనిటైం చూసి, భద్రయ్య కుటుంబసభ్యులు కేస్‌షీట్ తో సహా ఉడాయించినట్లు చెప్పారు. తర్వాత వారం రోజులకు మే 5 న రోగి భద్రయ్య మృతి చెందగా, తమ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్లు టూ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా, తనపై,హాస్పిటల్ స్టాఫ్ పై కేసు నమోదైందన్నారు. బెయిలుపై వచ్చిన తాము, సీసీ ఫుటేజీని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా, కోర్టు ఆదేశాల మేరకు నిందితులు కల్యాణ్, సందీప్‌పై టూ టౌన్ లో కేసు నమోదుచేసి, కోర్టులో ప్రవే శపెట్టారని శ్యామ్కుమార్చెప్పారు. నిందితులకు శిక్ష పడే వరకు పోరాడతామని తెలిపారు.
వైస్ ఎంపీపీపై పోలీసులకు ఫిర్యాదు
ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలం చిమ్మాపూడి గ్రామంలో వైస్ ఎంపీపీ గుత్తా రవితో పాటు మరి కొంత మంది తనపై దాడి చేసినట్లు డీవైఎఫ్ఐ స్టేట్ కమిటీ లీడర్ చింతల రమేశ్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భూ వివాదంలో మాట్లాడేందుకు వెళ్లిన తనపై వైస్ ఎంపీపీ చెప్పుతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీపీఎం స్టేట్ కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్, మారం కరుణాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, జూలా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్ జె పాపయ్య, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు గుగులోత్ కుమార్, కేవీపీఎస్ లీడర్ బి.సాగర్ తదితరులు రమేశ్‌ను పరామర్శించారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
తల్లాడ, వెలుగు: ఏన్కూరు మండలం కొత్త మేడిపల్లి ఆదివాసీ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ గిరిజన సంఘం నాయకులు తహసీల్దార్ ఖాసీమ్‌కు వినతిపత్రం అందించారు. గ్రామంలో 60 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నా విద్య, వైద్యం, తాగునీరు అందక, విద్యుత్, రోడ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన సుక్కి కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి, రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్యా వీరభద్రం, అధ్యక్షుడు బానోత్ బాలాజీ, గంగరాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి
మణుగూరు, వెలుగు: సింగరేణిలో ప్రతి ఉద్యోగికి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యుడు మంద నరసింహారావు డిమాండ్ చేశారు. మణుగూరు సీఎస్పీలో మంగళవారం జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల సందర్భంగా సొంత ఇంటి పథకం, పేర్ల మార్పు, డిపెండెంట్ వయసు 40 ఏండ్లకు పెంపు హామీలిచ్చి అమలు చేయడం లేదన్నారు. వేతన ఒప్పందం ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన డీపీఈ గైడ్‌లైన్స్ కారణమని చెబుతూ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బ్రాంచ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు టీవీఎంవీ ప్రసాద్, వల్లూరి వెంకటరత్నం, స్టేట్ లీడర్స్ నెల్లూరు నాగేశ్వరరావు, కోడిశాల రాములు, రామ్మూర్తి, విల్సన్, లక్ష్మణరావు, బొల్లం రాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
సత్తుపల్లి, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలని మున్సిపల్ చైర్మన్ కోసంపూడి మహేశ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్‌ను ఆయన పరిశీలించారు. స్టూడెంట్లకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. అనంతరం పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు త్వరగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని
సూచించారు.