నేలకొండపల్లి/కల్లూరు, వెలుగు: మండలంలోని రాజేశ్వరపురం గ్రామ పరిధిలోని మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్‌ను ఆదివారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నష్టాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తీసుకున్నానని చెప్పారు. అప్పటి నుంచి నష్టాలను భరిస్తూ ఫ్యాక్టరీని నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే మద్దతు ధర ప్రకటించకపోవడంతో ఫ్యాక్టరీ ఎండీ నామా కృష్ణయ్య వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. మద్దతు ధర ప్రకటించి వెళ్లాలని వాగ్వాదానికి దిగారు. రెండు రోజుల్లో రైతులతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఎంపీపీ వజ్జా రమ్య, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, సర్పంచ్ గడ్డు సతీశ్, నెల్లూరి భద్రయ్య, రచ్చా నర్సింహారావు, మస్తాన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కల్లూరులో..
కాకతీయ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ను ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ చల్లగుండ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. సివిల్ ఇంజనీర్ కొడాలి రఘునాథ్, సీడీసీ చైర్మన్ ముక్కెర భూపాల్ రెడ్డి, రవీంద్రనాథ్ చౌదరి, వేజెండ్ల శ్రీకాంత్, హరిప్రసాద్, బ్రహ్మయ్య, అప్పారావు, వేజెండ్ల ఆదినారాయణ పాల్గొన్నారు.
నేటి తరానికి కాళోజీ ఆదర్శం
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కాళోజీ నారాయణరావు నేటి తరానికి ఆదర్శమని పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఖమ్మం బస్టాండ్ ఆవరణలో ఆర్ఎం ప్రభులత ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌ను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు కాళోజీ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రజాకార్ల దౌర్జన్యాలను ప్రతిఘటిస్తూ సంఘ మహాసభలను నిర్వహించారని గుర్తు చేశారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, పగడాల నాగరాజు, డాక్టర్. గిరిసింహారావు, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం నగరంలోని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. శ్రీనివాసనగర్ ఎస్ఎన్ మూర్తి మామిడితోటలో వేర్వేరుగా జరిగిన నగర ఆర్యవైశ్య సంఘం, వైఎస్ఆర్ నగర్ మామిడితోటలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రధాని ప్రకటనతో సింగరేణిలో సంబురాలు
సత్తుపల్లి, వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటు చేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో జేవీఆర్ ఓపెన్ కాస్ట్ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఉడతనేని అప్పారావ్లు కార్మికులకు స్వీట్లు పంచి పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటుందని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పారు. జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, పట్టణ, మండల అధ్యక్షులు ఆచంట నాగస్వామి, పాలకొల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాజ్యాధికారం కోసం పోరాడాలి
కల్లూరు, వెలుగు: సంఘటితంగా ఉంటూ రాజ్యాధికారం కోసం మున్నూరుకాపులు ఐక్యంగా పోరాటం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలోని కప్పల బంధంలో మండల మున్నూరు కాపు సంఘం వనసమరాధన మండల కన్వీనర్ లక్కినేని రఘు, ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీర రాఘవయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90 శాతం ఉన్న బీసీలు, బహుజనులు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సాధ్యమన్నారు. ఆర్జేసీ కృష్ణ, శెట్టి రంగారావు, ఆకుల గాంధీ, పారా నాగేశ్వరరావు, లక్కినేని అలేఖ్య వినీల్ పాల్గొన్నారు.
మెకానిక్ కుటుంబానికి ఆర్థికసాయం
మధిర, వెలుగు : ఇటీవల రోడ్డు ప్రమాదంలో చింతకానికి చెందిన షేక్ రంజాన్ చనిపోగా, ఖమ్మం జిల్లా మెకానిక్ యూనియన్ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.35 వేల ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ మెకానిక్ లు ప్రమాదాల్లో, అనారోగ్యంతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెకానిక్‌ల కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రమాద బీమా కల్పించాలని కోరారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ దేశ సేవకులు : హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్కౌట్స్ అండ్ గైడ్స్ దేశ సేవకులని స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్ లో ఆదివారం జరిగిన గైడ్ కెప్టెన్ బేసిక్ కోర్స్ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లుగా ప్రతీ స్టూడెంట్ను చేర్చుకోవాలని కోరారు. ఈ విభాగంలో చేరడమే ఒక అదృష్టంగా భావించాలన్నారు. లీడర్ ట్రైనర్‌గా గిరిజాదేవి, అసిస్టెంట్ స్ట్రీట్ ఆర్గనైజింగ్ కమిషనర్ సామల వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, ఎన్ భరతమాత, లక్ష్మీరెడ్డి, విజయలక్ష్మి, వి నాగేంద్ర రమణమ్మ, పీవీ రమణ, సమ్మయ్య, కొడాలి జగదీశ్ పాల్గొన్నారు.