చండ్రుగొండ,వెలుగు: విద్యార్థుల పట్ల టీచర్లు బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే పోకలగూడెం జడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. అస్వస్థత కు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ఆవరణలో వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, మిడ్డే మీల్స్‌ను టీచర్లు పర్యవేక్షించాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. ఎంపీపీ పార్వతి, ఎంఈవో సత్యనారాయణ, ఎంపీడీవో అన్నపూర్ణ, తహసీల్దార్ రవికుమార్, టీఆర్ఎస్ లీడర్లు దారా బాబు, ఏడుకొండలు, మోహన్ రావు, రమేశ్ పాల్గొన్నారు.
ఇన్చార్జి బాధ్యతలు తప్పించాలని ..
మండలంలోని పోకలగూడెం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం జంకీలాల్ కు ఏకంగా ఐదు మండలాల ఇన్చార్జీ ఎంఈవో బాధ్యతలు అప్పగించడంపై ఎమ్మెల్యే విస్మయం వ్యక్తం చేశారు. జిల్లాలోని సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చర్ల మండలాలకు ఇన్ చార్జ్ ఎంఈవో గా, పోకలగూడెం జడ్పీ హైస్కూల్ పరిధిలోని 15 స్కూల్స్ కు కాంప్లెక్స్ హెచ్ఎంగా వ్యవహరిస్తున్నారు. స్కూల్ ను సందర్శించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు దృష్టికి హెచ్ఎం తన అదనపు బాధ్యతల విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే ఆయన కలెక్టర్ అనుదీప్ కు ఫోన్ చేసి ఐదు మండలాల ఇన్చార్జి ఎంఈవో బాధ్యతల నుంచి పోకలగూడెం హెచ్ఎంను తప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
క్రీడలకు సింగరేణి పెద్దపీట : సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : క్రీడలకు సింగరేణి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని కంపెనీ డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. రెండు రోజులుగా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న సింగరేణి కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి క్రీడాకారులు ప్రతిభ చూపి కంపెనీకి మెడల్స్ తీసుకురావాలని కోరారు. కబడ్డీలో విజేతగా నిలిచిన ఇల్లందు-, మణుగూరు జట్టును, బాల్ బ్యాడ్మింటన్ లో విజేతగా నిలిచిన ఆర్జీ–3 -భూపాలపల్లి జట్టు సభ్యులను ఆయన సన్మానించి, బహుమతులు అందజేశారు. వెల్ఫేర్ జీఎం కె బసవయ్య, జీఎం (పర్సనల్) ఆనందరావు, ఆఫీసర్లు రమేశ్ బాబు, శ్రీనివాస్, మూర్తి, గట్టు స్వామి, సుందర్ రాజ్ నెట్ పాల్గొన్నారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్రు : సీఐటీయూ నేత సాయిబాబా
భద్రాచలం, వెలుగు: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబా ఆరోపించారు. భద్రాచలంలో జరుగుతున్న సీఐటీయూ జిల్లా మూడవ మహాసభలకు ఆయన హాజరై ప్రసంగించారు. 48 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించారని, ఇవి అమలైతే రాజ్యాంగం కల్పించిన పోరాడే హక్కుతో పాటు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు తదితర సౌకర్యాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు అన్ని ట్రేడ్ యూనియన్లతో వచ్చే ఏప్రిల్ 5న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు గోదావరి బ్రిడ్జి పాయింట్ నుంచి యూబీ రోడ్డు, కొత్తమార్కెట్, ఫారెస్ట్ ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శులు మధు, నర్సింహారావు మాజీ ఎంపీ డా మిడియం బాబూరావు, బ్రహ్మాచారి, ఏజే రమేశ్, జి పద్మ పాల్గొన్నారు.
హైడెన్సిటీ పత్తి సాగుతో అధిక లాభాలు
కామేపల్లి, వెలుగు: రైతులు హైడెన్సిటీ పత్తి సాగుతో లాభాలు పొందవచ్చని ఇన్చార్జి డీఏవో సరిత అన్నారు. మండలంలోని పండితాపురం గ్రామంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సాగుచేసిన హైడెన్సిటీ పత్తిని అగ్రికల్చర్ ఆఫీసర్లు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పత్తి త్వరగా కాపునకు వచ్చి దిగుబడి ఒకేసారి వస్తుందని చెప్పారు. పత్తి పింజ ఎక్కువగా ఉండి, పత్తి ఏరడం కూడా ఈజీగా ఉంటుందని తెలిపారు. ఏడీఏలు శ్రీనివాసరావు, శ్రీనివాస రెడ్డి, నూజివీడు సీడ్స్ రీజినల్ మేనేజర్ వి రమణా రెడ్డి, ఏరియా మేనేజర్ కృష్ణారావు, సేల్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి, ఏవోలు తారాదేవి, భాస్కరరావు, సర్పంచులు దుర్గాజ్యోతి, లాకవత్ బీమా, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
సీతారాములకు తిరుమంజనం
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి బుధవారం బేడా మండపంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం జరిగింది. సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనంతో పాటు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ముందుగా ఉదయం గర్భగుడిలో గోదావరి నుంచి తీర్థబిందె తెచ్చి మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. తర్వాత బేడా మండపంలో ఉత్సవమూర్తులకు తిరుమంజనం, అభిషేకం చేశారు. ప్రాకార మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిపించారు. 36 మంది భక్తులు కంకణాలు ధరించి కల్యాణం చేయించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, కంకణధారణ, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక జరిగాయి. మంత్రపుష్పం నివేదించాక భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
‘భరతపుత్రులు’ యూనిట్‌కు సన్మానం
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ప్రాంతానికి చెందిన తాండ్ర వెంకటరమణారావు నిర్మించిన భరతపుత్రులు సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా సేవ్‌భద్రాద్రి వ్యవస్థాపకుడు పాకాల దుర్గాప్రసాద్ బుధవారం చిత్ర బృందాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన నటీ నటులతో తీసిన ఈ చిత్రం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. జావేద్‌ఖాన్, శరత్‌ఆలీ, కాజల్, కిరణ్‌లకు మరిన్ని అవకాశాలు రావాలని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ బాధ్యులు డా. కాంతారావు, డా.సుదర్శన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి డా. వెంకటరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సత్యవతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్‌రెడ్డి, బుడగం శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు చారుగుళ్ల శ్రీనివాస్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి పరిమి సోమశేఖర్, రోటరీ క్లబ్ ట్రైనర్ నాగేశ్వరరావు, అజీమ్, ముర్ల రమేశ్, గాదె మాధవ్‌రెడ్డి, పల్లింటి దేశప్ప పాల్గొన్నారు.