ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్​ పట్టణ కార్యదర్శి కొలిపాక శివ ఆధ్వర్యంలో సబ్​ కలెక్టర్​ ఆఫీస్​ ఏవోకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ఆసుపత్రికి గిరిజనులు వైద్యం కోసం వస్తున్నారని, వైద్యులు, సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే పరిస్థితిలో లేరని తెలిపారు. భరణి హరీశ్, మారెడ్డి గణేశ్, వంకపాటి తిరుపతి, అయినా హరీశ్​​పాల్గొన్నారు.

స్వర్ణకవచధారిగా రామయ్య

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం బంగారు కవచాలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ అనంతరం అర్చకులు మూలవరులను స్వర్ణ కవచాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. ఆ తర్వాత లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి నివేదన ఇచ్చారు. కుంకుమార్చన చేసి లక్ష్మీ అష్టోత్తర శతనమార్చన నిర్వహించారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్యకల్యాణం జరిపించారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి కల్యాణంలో పాల్గొన్నారు. సాయంత్రం అద్దాల మండపంలో శ్రీసీతారామచంద్రస్వామికి దర్బారు సేవ నిర్వహించి సంధ్యాహారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇంజినీరింగ్​ స్టూడెంట్​ మిస్సింగ్

ఖమ్మం రూరల్​, వెలుగు: మండలంలోని ఎం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెన్నూరు మధుకృష్ణ (22) పొన్నెకల్లులోని కిట్స్​ ఇంజినీరింగ్​ కాలేజీలో బీటెక్​ ఫైనల్​ ఇయర్​ చదువుతున్నాడు. ఈ నెల 27న కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకక పోవడంతో అతడి తల్లి రామలక్ష్మి శుక్రవారం రూరల్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జూనియర్​ వాలీబాల్​ పోటీలు షురూ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర స్థాయి జూనియర్​వాలీబాల్​ పోటీలు కొత్తగూడెంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో పోటీలను భద్రాద్రికొత్తగూడెం జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెంలో నేషనల్​లెవెల్​వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, బాస్కెట్​బాల్​తదితర పోటీలను నిర్వహించేందుకు సింగరేణి ముందుకు రావాలని కోరారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలికలు, బాలుర జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్ర వాలీబాల్​అసోసియేషన్​ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పోటీలు మొత్తం టీఆర్ఎస్​ కనుసన్నల్లో కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. పోటీల ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన వేదికపై మాజీ ఎంపీ శ్రీనివాస్​రెడ్డి బర్త్​ డే సందర్భంగా కేక్​ కట్​చేశారు. జట్ల మార్చ్​ఫాస్ట్​లో పొంగులేటి ఫ్లెక్సీలతో కూడిన జెండాలను పట్టుకున్నారు. గేమ్స్​కు ప్రభుత్వం ఫండ్స్​ఇవ్వడం లేదని, మాజీ ఎంపీ స్పందించి ఆయన బర్త్​డే సందర్భంగా గేమ్స్​మొత్తం ఖర్చు భరిస్తున్నారని ఆయన అనుచరులు చెప్పారు. 

తొలిరోజు విజేతలు వీరే..

జూనియర్ వాలీబాల్ బాలికల విభాగంలో వరంగల్, మెదక్ జట్ల మధ్య జరిగిన పోరులో 3–-0తో వరంగల్ జట్టు, నిజామాబాద్, హైదరాబాద్  మధ్య జరిగిన పోరులో 3–-0తో నిజామాబాద్ గెలిచింది. బాలుర విభగంలో ఖమ్మం–నిజామాబాద్ మధ్య జరిగిన పోరులో 3–-1తో ఖమ్మం జట్టు విజయం సాధించింది.

ఖమ్మంలో కబడ్డీ పోటీలు.. 

ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు  ప్రారంభమయ్యాయి. జిల్లా యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్  పరంధామరెడ్డి పోటీలను ప్రారంభించారు. పొంగులేటి స్వరాజ్యం, రాఘవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు మూడు రోజుల పాటు డే అండ్ నైట్  పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ. లక్ష ప్రైజ్ మనీ ప్రకటించారు.

ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై గంజాయి స్మగ్లర్ల దాడి

బూర్గంపహాడ్, వెలుగు: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం గంజాయి స్మగ్లర్లు ఎక్సైజ్​ కానిస్టేబుళ్లపై దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏపీ నుంచి కారులో గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రాచలం ఫారెస్ట్  చెక్ పోస్ట్  వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లర్లు చెక్ పోస్ట్  వద్ద కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో ఎక్సెజ్  కానిస్టేబుళ్లు వారిని వెంబడించి లక్ష్మీపురం వద్ద వారిని అడ్డుకున్నారు. కానిస్టేబుళ్లపై రాళ్లతో దాడి చేసి స్మగ్లర్లు తప్పించుకున్నారు. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. కారును స్వాధీనం చేసుకొని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. కారుతో పాటు 98 కిలోల గంజాయి స్వాధీని చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రహిమున్నీసా తెలిపారు. 

ఇద్దరిపై పీడీ యాక్ట్

భద్రాచలం: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రోహిత్​రాజ్​ తెలిపారు. ఏపీలోని సీలేరుకు చెందిన కొర్రాడ దారబాబు(8 కేసుల్లో నిందితుడు), ఖమ్మంకు చెందిన ముత్తినేని కిషన్​కుమార్​(4 కేసుల్లో నిందితుడు)లపై పీడీ యాక్టు నమోదు చేసి హైదరాబాద్​లోని చర్లపల్లి జైలుకు తరలించామని చెప్పారు. 

గంజాయి ధ్వంసం..

ఖమ్మం కార్పొరేషన్: జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 2500 కేజీల గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. పోలీస్​ ఫైరింగ్​ రేంజ్​ మంచుకొండ అటవీ ప్రాంతంలో గంజాయిని కాల్చివేశారు. 28 కేసులలో నిందితులను అరెస్ట్​ చేసినట్లు సీపీ విష్ణు ఎస్​ వారియర్​ తెలిపారు. ఏడీసీపీ అడ్మిన్​ డాక్టర్​ శబరీశ్, ఏసీపీ వెంకటస్వామి, సీఐ తుమ్మ గోపి పాల్గొన్నారు.

రామయ్య భూముల ఆక్రమణలపై ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ల ఆరా

భద్రాచలం, వెలుగు: ఏపీలోని పాడేరు అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 912 ఎకరాల భూమిని ఆక్రమించిన వైనంపై ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్లు ఆరా తీశారు. పాడేరు ఎండోమెంట్​ అసిస్టెంట్​ కమిషనర్​ చంద్రకుమార్, గండిపోచమ్మ తల్లి దేవస్థానం ఈవో లక్ష్మీకుమార్​ శుక్రవారం ఈవో శివాజీ, ఏఈవోలు శ్రావణ్​కుమార్, భవానీరామకృష్ణలతో భేటీ అయ్యారు. ఏపీలోని వైసీపీ లీడర్లు దేవస్థానం భూములను ఆక్రమిస్తున్నారని, కొన్ని క్రైస్తవ సంఘాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆరోపణలు రావడంతో పాటు బీజేపీ ఏపీ చీఫ్​ సోము వీర్రాజు అక్కడి సీఎం జగన్​కు లేఖ రాయడంతో కలకలం రేగింది. అలాగే దేవస్థానం తమ వద్ద ఉన్న ఆధారాలు, కోర్టు రిపోర్టులతో  గురువారం ఏపీ ప్రిన్సిపల్  సెక్రటరీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీంతో రామయ్య భూముల ఆక్రమణపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ పాడేరు ఎండోమెంట్ అసిస్టెంట్​ కమిషనర్​ను ఆదేశించారు. పురుషోత్తపట్నంలోని రాముడి భూముల వివరాలను, వివాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని చంద్రకుమార్​ తెలిపారు. పురుషోత్తపట్నం భూములు సీతారామచంద్రస్వామి దేవస్థానానివేనని చెప్పారు.

తలసేమియా పేషెంట్లకు ఉచిత పరీక్షలు

ఖమ్మం, వెలుగు: నగరంలోని తలసేమియా, సికిల్ సెల్​ సొసైటీ (టీఎస్ సీఎస్) ఖమ్మం బ్రాంచ్  ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా మెగా మల్టీ ఆర్గాన్స్  స్క్రీనింగ్  క్యాంప్  నిర్వహించారు. పిడియాట్రిక్, ఎండో క్రైనాలజిస్ట్, పిడియాడ్రిక్, కార్డియాలజిస్ట్, డెంటిస్ట్, ఆర్థోపెడీషియన్, ఆప్తమాలజిస్ట్ తదితర వైద్య నిపుణులు స్క్రీనింగ్  క్యాంపులో పాల్గొన్నారు. 2 వందల మంది తలసేమియా, సికిల్​సెల్ బాధితులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ఖమ్మం బ్రాంచ్  కో ఆర్డినేటర్, పిల్లల వైద్య నిపుణులు డా. కూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జిల్లా బ్రాంచ్ లో 300 మంది తలసేమియా, సికిల్ సెల్ బాధితులు రెండేళ్లుగా వైద్య చికిత్సలు పొందుతున్నారని తెలిపారు. విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా 
రక్తం అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు రెగ్యులర్ మల్టీ ఆర్గాన్ స్క్రీనింగ్ క్యాంప్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఎస్ సీఎస్ ఫౌండర్, చైర్మన్ చంద్రకాంత్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి రత్నావళి, డాక్టర్లు పాల్గొన్నారు.

మెగా హెల్త్​ క్యాంప్

సత్తుపల్లి, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్త్​డే సందర్భంగా శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు సేవలందిస్తున్న శ్రీనివాస్​రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  తోట సుజలరాణి, టీఆర్ఎస్  నాయకులు తోట గణేశ్, మందపాటి ముత్తారెడ్డి, ఇమ్మనేని ప్రసాద్, కృష్ణారెడ్డి, ఫయాజ్, సాంబశివరావు, శ్రీనివాసరావు, శ్రీనివాస్, నాని(దయాకర్), వంగరి రాకేశ్, కమల్ పాషా, భరత్ పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్​మెంట్​ విడుదల చేయాలి

ఖమ్మం టౌన్/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్  వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధు, ప్రవీణ్  డిమాండ్​ చేశారు. శుక్రవారం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఆందోళన చేస్తున్న లీడర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలు పర్వీన్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సహాయ కార్యదర్శి పోనుకుల సుధాకర్, సాయి, వెంకటేశ్, తరుణ్, శ్రావణి, నవ్య పాల్గొన్నారు.
కొత్తగూడెంలో..
ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​ బకాయిలు చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం డిమాండ్​ చేశారు. మెస్​ చార్జీలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని కోరుతూ కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్​ అనుదీప్​కు వినతిపత్రాన్ని అందజేశారు. గార్లపాటి పవన్, భూపేందర్, కె నాగేశ్వరరావు, పురుషోత్తం, అభిమిత్ర, యశ్వంత్, అఖిల, భవ్య పాల్గొన్నారు. 

టీచర్లు ప్రిపేర్​ కావాలి

చండ్రుగొండ, వెలుగు: స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పే ముందు టీచర్లు ప్రిపేర్  కావాలని డీఈవో సోమశేఖరశర్మ ఆదేశించారు. శుక్రవారం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో తొలిమెట్టు  కార్యక్రమం అమలు తీరుపై హెచ్ఎంలతో సమీక్షించారు. క్లాస్ రూమ్​లో టీచర్ల బోధనా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రతిరోజు చివరి పీరియడ్ లో స్టూడెంట్లతో ఎక్కాలు, తెలుగు పద్యాలు, ఇంగ్లిష్ పదాలు చెప్పించాలని సూచించారు. టెన్త్  క్లాస్ స్టూడెంట్స్ కు ఉదయం, సాయంత్రం స్పెషల్​ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. సబ్జెక్టులపై టీచర్లకు అవగాహన ఉండాలన్నారు. సింగిల్  టీచర్​ అన్ని సబ్జెక్టులు బోధించాలని తెలిపారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజు శేఖర్, ఎంఈవో సత్యనారాయణ, మండల మానిటరింగ్ ఆఫీసర్ సంజీవరావు, హెచ్ఎంలు, రిసోర్స్ పర్సన్స్  పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

కూసుమంచి, వెలుగు: మండలంలో జీళ్లచెరువు గ్రామంలోని ఇటీవల చనిపోయిన వారి కుటుంబాలకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి ఆర్థికసాయం చేశారు. శుక్రవారం రూ.10వేల చొప్పున రెండు కుటుంబాలకు రూ.20 వేలను  ఈ కుటుంబాలకు డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్, సర్పంచ్​ సత్యం నగదును మృతుల కుటుంబాలకు అందజేశారు. మల్లేశం, వెంకటేశ్వర్లు, నరేందర్​ పాల్గొన్నారు.