ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఇల్లందు,వెలుగు: నిత్య జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తెలిపారు. శనివారం పట్టణంలోని సింగరేణి స్కూల్​లో నిర్వహించిన సైన్స్ ఫేర్​ ముగింపు కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా హాజరై 650 మంది స్టూడెంట్స్​ తయారు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఇలాంటి సైన్స్ ఫేర్లు నిర్వహించడంతో విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన డాక్టర్​ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ గా ఎదిగారని గుర్తు చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించాలని టీచర్లకు సూచించారు. అనంతరం స్టూడెంట్స్​కు ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్,  కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

ఖమ్మం టౌన్: అరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్  యంత్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో పుడుతున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు టిఫా స్కానింగ్  ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రు.20 కోట్లతో 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషీన్లు ప్రారంభించినట్లు చెప్పారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టిఫా స్కానింగ్​ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మేయర్ పూనుకోలు నీరజ, జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ రాజ్, కలెక్టర్ వీపీ గౌతమ్,  సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రాజ్యాంగం ద్వారానే సమానహక్కులు : జస్టిస్ జి. రాధారాణి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ జి. రాధారాణి తెలిపారు. కొత్తగూడెం కోర్టులో నిర్మించిన న్యాయమూర్తుల సమావేశ మందిరాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించేలా అంబేద్కర్​ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. న్యాయపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పర్చాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. శ్యాం, సీనియర్​ సివిల్​ జడ్జీలు జి. భానుమతి, ఎ. నీరజ, జూనియర్​ జడ్జీలు బి. రామారావు, కె. దీప, ఎం. నీలిమ, జి. ముకేశ్, ఎం. వెంకటేశ్వర్లు, బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు ఎ. రాంప్రసాద్​ పాల్గొన్నారు. అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండల లీగల్​ సర్వీసెస్​ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్స్​ అందజేశారు. 

కోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వినతి

దమ్మపేట: కొత్తగూడెం వచ్చిన హైకోర్టు జడ్జిని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరరావు కలిసి సన్మానించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో కోర్టు ఏర్పాటు చేయాలని  కోరారు. జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, రాజేశ్వరరావు, న్యాయవాదులు రాజేంద్ర ప్రసాద్, వెంకట్రావు, లక్కినేని నరేంద్ర, సోడెం గంగరాజు, అబ్దుల్ జిన్నా ఉన్నారు. 

రామయ్యకు సువర్ణ తులసీదళార్చన

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం తులసీదళాలతో అర్చన జరిగింది. గర్భగుడిలో మూలవరులకు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఉదయం గోదావరి నుంచి మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య తీర్థబిందెను తెచ్చి సుప్రభాతసేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం సీతారాములకు బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. 66 జంటలు కంకణాలు ధరించి స్వామి వారి కల్యాణాన్ని చేశారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

ఎఫ్ఆర్వో హత్యపై విచారణ జరపాలె

చండ్రుగొండ, వెలుగు: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యపై సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎఫ్ఆర్వోది ప్రభుత్వ హత్యగా పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి రూ.కోటి ఎక్స్​గ్రేషియా చెల్లించాలన్నారు. బాధిత కుటుంబానికి సీఎం కేసీఆర్  ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాటిలైట్ తో సంబంధం లేకుండా అర్హులైన గిరిజనులకు పోడు హక్కు పత్రాలు పంపిణీ చేయాలని కోరారు. చండ్రుగొండలోని మెగా పార్క్ కు ఎఫ్ఆర్వో పేరు పెట్టాలన్నారు. జడ్పీటీసీ వెంకటరెడ్డి, సర్పంచ్ వినోద్, కాంగ్రెస్  లీడర్లు దయాకర్ రావు, గోవిందరెడ్డి, రమణ, రామకృష్ణ పాల్గొన్నారు.

కన్వెన్షన్ ను ప్రారంభించిన మంత్రి

ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలో శ్రీశ్రీశ్రీ గ్రూప్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉష హరి కన్వేషన్, శ్రీశ్రీశ్రీ ఎక్సలెన్సీ హోటల్ ను శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. మేయర్ పూనుకోలు నీరజ, గ్రూప్  అధినేత ఈశ్వరప్రగడ హరిబాబు, తెలంగాణ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్ మోహన్ శర్మ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్​ సిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కమర్తపు మురళి, కార్పొరేటర్  దొరేపల్లి శ్వేత, మువ్వా విజయ్ బాబు, బేబీ స్వర్ణ కుమారి పాల్గొన్నారు.

వివాదాస్పద భూములను సర్వే చేపడతాం

పెనుబల్లి, వెలుగు: రామచంద్రాపురం గ్రామంలోని వివాదాస్పదంగా ఉన్న  సర్వే  నెంబర్​ 54పై త్వరలో స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తామని కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ తెలిపారు. శనివారం పోడు భూముల గ్రామసభను ఎంపీపీ లక్కినేని అలేఖ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులతో రికార్డులో లేని సర్వే నెంబర్లలో భూముల బదలాయింపు జరిగిందని చెప్పారు. గ్రామానికి చెందిన భూముల రికార్డులను పరిశీలిస్తామని తెలిపారు. 54 సర్వే నెంబర్ భూముల​పై సర్వే నిర్వహించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని చెప్పారు. జడ్పీటీసి చెక్కిలాల మోహనరావు, తహసీల్దార్​ రమాదేవి, ఎంపీడీవో మహాలక్ష్మి, వియంబంజర్​ ఎస్ఐ సూరజ్, సర్పంచ్​ కుమారి పాల్గొన్నారు.

ఆదివాసీలకు నాణ్యమైన వైద్యం అందిస్తాం

భద్రాచలం, వెలుగు: మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన ఆదివాసీలకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన వైద్యం అందించేందుకు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సౌలతులు కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతం పోట్రు తెలిపారు. శనివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసి వివిధ వార్డులను పరిశీలించారు. అంతకుముందు గర్భిణుల కోసం రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్ ను, రూ.3.15 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం రక్తనిధి  కేంద్రం, లాబొరేటరీ రిపేర్​ పనులు, వంట షెడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రోగులకు వైద్యం అందించే విషయంలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా చూడాలని సూచించారు. సూపరింటెండెంట్​ రామకృష్ణ, డా.సౌజన్య, ఐటీడీఏ ఇంజనీరింగ్  విభాగం టీఏ శ్రీనివాస్, డీఈ హరీశ్, రాజశేఖర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఏఈ సలీం పాల్గొన్నారు.