భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో జరుగుతున్న పోడు భూముల సర్వే, క్రీడా ప్రాంగణాల పనులపై డైలీ రిపోర్ట్ అందజేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోడు సర్వే కోసం నియమించిన టీమ్స్ అన్నీ పాల్గొనాలని ఆదేశించారు. గైర్హాజరైన టీమ్స్‌తో పాటు ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. సర్వే ప్రక్రియ స్లోగా జరగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణాలపై రోజువారీ నివేదికలు అందించాలన్నారు. డీఎఫ్ వో రంజిత్ లక్ష్మణ్‌నాయక్, అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో రమాకాంత్ పాల్గొన్నారు.
రామయ్య కల్యాణ వైభోగం
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి గురువారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు మేళతాళాలతో గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించారు. అనంతరం పల్లకిలో కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత కల్యాణ క్రతువు షురూ చేశారు. యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత స్వామికి రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
పెద్దమ్మతల్లికి..
పాల్వంచ: మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి బంగారు పుష్పాలతో అర్చన నిర్వ హించారు. 108 పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన, తదితర పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎట్టకేలకు ఫీల్డ్ ఎంక్వైరీ కంప్లీట్
ఖమ్మం, వెలుగు: భూముల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, 59 అప్లికేషన్ల ఫీల్డ్ ఎంక్వైరీని ఆఫీసర్లు పూర్తి చేశారు. రెండు జీవోల కింద రెగ్యులరైజేషన్ కోసం దాదాపు 15 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఖమ్మం అర్బన్ ప్రాంతంలోనే 7 వేల వరకు అప్లికేషన్లు వచ్చాయి. జిల్లా స్థాయి ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన 20 టీమ్స్దరఖాస్తులను పరిశీలించాయి. ముందుగా జీవో58 కింద అప్లికేషన్లను పరిశీలించిన ఆఫీసర్లు, ఇటీవల 59 కింద వచ్చిన 3 వేల దరఖాస్తులను కూడా పరిశీలించారు. వీటి రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన శ్లాబ్‌ల ప్రకారం అప్లికేషన్ల వారీగా ఎవరు ఎంత ఫీజు చెల్లించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదని అధికారులు చెబుతున్నారు. జీవో 58 కింద 9398 దరఖాస్తులు రాగా, 3348 అప్లికేషన్లను యాక్సెప్ట్ చేశారు. సరైన ధృవపత్రాలు లేకపోవడంతో 5022 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. ఇక 125 గజాలకు మించి ఉన్న జీవో నెంబర్ 58 కింద దరఖాస్తు చేసుకున్న వాటిని జీవో 59కి కన్వర్ట్ చేశారు. ఇలాంటి లబ్ధిదారులు అవసరమైన ఫీజు చెల్లించిన తర్వాతే వాటిని రెగ్యులరైజ్ చేయనున్నారు. 2014 కంటే ముందు నుంచి సంబంధిత స్థలాల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్నా రుజువులను చూపించలేకపోవడంతో ఆ అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. దరఖాస్తుదారుల ఇండ్లను పరిశీలించి రిపోర్టులను ఆన్లైన్లో అప్ లోడ్ చేశారు. త్వరలోనే ఆయా శ్లాబ్ ల ప్రకారం లబ్ధిదారులు చెల్లించాల్సిన ఫీజు నిర్ణయించి నోటీసులు ఇస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్‌కు రుణపడి ఉంటా
సత్తుపల్లి/ వేంసూరు, వెలుగు: రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు జన్మంతా రుణపడి ఉంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లి, వేంసూరు మండలాలకు చెందిన టీఆర్ఎస్ కేడర్ తో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ జెండాలు పెద్ద సంఖ్యలో కనిపించడం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చీఫ్ గెస్ట్‌గా హాజరు కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా వేంసూరు మండలం ఎన్టీఆర్ కెనాల్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఎన్టీ రామారావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
భద్రాచలానికి భక్తుల పాదయాత్ర
చండ్రుగొండ, వెలుగు: కార్తీకమాసం సందర్భంగా మండలంలోని దామరచర్ల గ్రామంలోని 50 కుటుంబాలకు చెందిన భక్తులు భద్రాచలానికి గురువారం పాదయాత్రగా బయిలుదేరారు. ఉదయం 9 గంటలకు గ్రామం నుంచి చెక్కభజనలతో శ్రీరాముడిని స్మరిస్తూ కాలినడకన వెళ్లారు. లోక కల్యాణంతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ కాలినడకన భద్రాచలానికి వెళ్తున్నట్లు వారు తెలిపారు.
రోడ్ సేఫ్టీ బిల్లు రద్దు చేయాలి
ఖమ్మం టౌన్, వెలుగు: రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇఫ్టూ ఆఫీస్ నుంచి ఆర్టీఏ ఆఫీస్ వరకు డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఏ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పరోక్షంగా 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. డ్రైవర్లు, వర్కర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం అధిక ట్యాక్స్ విధించడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపించారు. ఆర్టీఏ ఆఫీసులో అవినీతిని అరికట్టాలని డీటీవో తోట కిషన్ రావుకు వినతిపత్రం అందించారు. సంఘం ఖమ్మం ఏరియా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్లవల్లి ఉపేందర్, ఎం లక్ష్మీనారాయణ, లీడర్లు రాజేశ్, సతీశ్ పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు షురూ
పాల్వంచ,వెలుగు: కొత్తగూడెం మెడికల్ కాలేజీలో శుక్ర వారం అడ్మిషన్ల ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. శుక్రవారం కేరళ రాష్ట్రానికి చెందిన శ్రేయనాయక్ కు కాలేజీలో తొలి అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ మెడికల్ కౌన్సిల్ ద్వారా కేటాయించిన మెడికల్ సీట్లను భర్తీ చేసి నవంబర్ 15 నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర కోటాలో 150 మంది వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉందన్నారు. ఆర్అండ్ బీ డీఈ బీమ్లా, కాలేజీప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు, సూపరింటెండెంట్ కుమారస్వామి, డీపీఆర్వో శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్రు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీజెపీ, టీఆర్ఎస్ లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ విమర్శించారు. గురువారం నగరంలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావీద్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు టీఆర్ఎస్ ఆజ్యం పోస్తే బీజెపీ అమలు చేస్తుందని, రెండు పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అధికారం కోసం వెంపర్లాడుతున్నాయని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్, రబ్బానీ, గంగరాజు, వీరారెడ్డి, సీతారాములు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ములకలపల్లి, వెలుగు: ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగుచేస్తున్న గిరిజనేతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మండలంలోని సీతారాంపురం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 241లో 63 ఎకరాల భూమిని కబ్జా చేసిన 16 మందికి రెవెన్యూ అధికారులు తప్పుడు పట్టాలు జారీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్న గిరిజనేతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోయం బాబురావు, సత్యనారాయణ, భిక్షం, ఆరం ప్రశాంత్, కురసం రమేశ్, కుంజా రవి, బండి ధర్మరాజు, కోండ్రు భాస్కర్ పాల్గొన్నారు.