ఖమ్మం టౌన్, వెలుగు : రూరల్ మండలంలోని రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్పకు చెందిన స్థలాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకొని భూసేకరణ రికార్డులు అందించాలని హౌసింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. ఖాళీ స్థలాన్ని ప్లాట్లుగా చేసి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు. బఫర్ జోన్ పోను 3 ఎకరాల 15 గుంటల స్థలం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్ ఎన్ మధుసూదన్, ఆర్డీవో రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఆఫీసర్ వెంకట్ రావు, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాము, తహసీల్దార్ సుమ ఉన్నారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కూసుమంచి/ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వం యాదవులకు 35 శాతం సబ్సిడీపై అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ సూచించారు. ఆదివారం మండలకేంద్రంలో గొర్రెల సంఘం మండల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల మార్కెట్ కోసం రూ,25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డీసీసీబీ చైర్మన్ కూరాకూల నాగభూషణం, గొర్రెలు, మేకల సంఘం జిల్లా అధ్యక్షుడు బారి మల్సూర్ పాల్గొన్నారు.
ఖమ్మం టౌన్: సిటీలోని యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం లీడర్లు గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ ను సన్మానించారు. సంఘ నాయకులు మేకల మల్లిబాబు యాదవ్, చిలకల వెంకట నర్సయ్య యాదవ్, చిత్తారి సింహాద్రి యాదవ్, పొదిల సతీశ్ యాదవ్, సత్తి వెంకన్న యాదవ్, బొల్లి కొమురయ్య, కోటేశ్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలపై వివక్ష చూపుతున్రు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం ఆరోపించారు. కొత్తగూడెంలో ఆదివారం ఎస్టీయూ 75 వసంతాల సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే పీఆర్సీలో కోత విధించిందని అన్నారు. టీచర్లు, ఎంఈవో ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు కరుణాకర్‌రెడ్డి, పోల్‌రెడ్డి, గోపాల్‌రావు, జ్యోతిరాణి, చందర్, గోపాల్, శ్రీను, వెంకట్, రమేశ్, వెంకటనారాయణ పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక
అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక రసాభాసగా మారింది. ఆదివారం గిరిజన భవన్ వద్ద ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో చీమకుర్తి వెంకటేశ్వరరావుకు పదవి ఇవ్వవద్దని వైస్ ఎంపీపీ ఫణీంద్ర, కేదార్నాథ్ తో పాటు రైతులు ఆందోళన చేశారు. రైతు సంఘాల పెద్దలు మురళి, మహిపాల్, పైడి వెంకటేశ్వరరావు, జూపల్లి రమేశ్, దొడ్డకుల రాజేశ్వరరావు వారిని శాంతింపజేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఆలపాటి రామచంద్ర ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా అంకతమహేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, ధారా యుగంధర్, నందికొండ ముత్తారెడ్డి, కోటగిరి సీతారామస్వామి, కాసాని చంద్రమోహన్, చీమకుర్తి వెంకటేశ్వరరావు , తూరుపల్లి అంజయ్య, దడివి నవీన్, ఎడ్ల సోమిరెడ్డి, విన్నపరెడ్డి బాపురెడ్డి, సామినేని ప్రసాద్, పూర్ణచందర్ రెడ్డి, బండి గుర్నాథ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, గంగిశెట్టి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
119 కుటుంబాలకు ఆర్థికసాయం
కూసుమంచి, వెలుగు : తిరుమలాయపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన 119 మంది కుటుంబాలకు ఎమ్మెల్యే సతీమణి విజయ ఆదివారం రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఎంపీపీ బోడా మంగీలాల్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తల్లాడ, వెలుగు: మిర్చి సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు డిమాండ్ చేశారు. తల్లాడ మండలం నారాయణపురంలో మిర్చి చేలను పరిశీలించారు. 20 మంది రైతులు 50 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, 40 రోజుల తరవాత వేర్లు కుళ్లిపోయి మొక్కలు ఎండిపోవడంతో రైతులు నష్టపోయారని అన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గాదె కృష్ణారావు, వాడవల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఘనంగా వాల్మీకి జయంతి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం వాల్మీకి జయంతిని జరుపుకున్నారు. ఆయన ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామాయణ కావ్యాన్ని రాసి స్థిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. - వెలుగు, నెట్వర్క్
కాన్షీరామ్‌కు ఘన నివాళి
బహుజనుల సంక్షేమమే లక్ష్యంగా కాన్షీరాం పని చేశారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్అన్నారు. వర్ధంతి సందర్భంగా కొత్తగూడెంలోని బీఎస్పీ ఆఫీసులో ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాన్షీరాం వర్ధంతిని నిర్వహించారు.- వెలుగు, నెట్వర్క్
సమస్యలకు పరిష్కారం చూపుతాం
ఖమ్మం రూరల్, వెలుగు: రూరల్ సీఐశ్రీనివాస్ను బదిలీ చేయాలని సీపీఐ సోమవారం తలపెట్టిన ఆందోళనను విరమించాలని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని సమస్యలకు సానుకూల పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇదిలాఉంటే ఈ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
తల్లితో కలిసి భర్తను చంపిన భార్య
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన కూతురితో కలిసి అల్లుడిని హత్య చేయించింది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ హత్య విషయం తాజాగా నిందితులు లొంగిపోవడంతో వెలుగుచూసింది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం పట్టణంలోని యూపీహెచ్ కాలనీకి చెందిన ఎస్‌కే.అన్వర్ (33) చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. మద్యానికి, గంజాయికి బానిసగా మారి భార్య సల్మాను అనుమానించడంతో పాటు, చిత్రహింసలకు గురిచేసేవాడు. సల్మా తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి సాధుఖాన్ కూతురు, అల్లుడి ఇంట్లోనే ఉంటూ సుతారి పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో అన్వర్ అత్త సాధుఖాన్‌కు చింతకాని మండలం అనంతసాగర్‌కు చెందిన బాలాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అన్వర్‌కు తెలియడంతో పలుమార్లు అతడిని హెచ్చరించాడు. అయినా అతడు పట్టించుకోకపోవడంతో గతేడాది సెప్టెంబర్ 26న బాలాజీకి చెందిన బైక్‌ను తగులబెట్టడంతో పాటు, అతడిపై కత్తితో దాడి చేశాడు. ఓ వైపు తనను హింసిస్తుండడంతో సల్మా, వివాహేతర సంబంధానికి అడ్డొస్తుండడంతో సాధుఖాన్ కలిసి అన్వర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సాధుఖాన్ కుమారుడు యాకూబ్, బాలాజీతో పాటు మరో వ్యక్తి సాయం తీసుకున్నారు. ఐదుగురు కలిసి గతేడాది సెప్టెంబర్ 30న అన్వర్ కాళ్లకు తాళ్లు కట్టి ఆటోలో తీసుకెళ్లి గోపాలపురం ఎస్‌ఆర్ గార్డెన్స్ వెనుకాల ఉన్న సాగర్ కాల్వలో పడేశారు. అన్వర్ కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో అతడి తల్లి ఎస్‌కే.రహమత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన సీఐ రామకృష్ణ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దీన్ని గమనించిన నిందితులు తప్పించుకోలేమని భావించి శనివారం తమకు తెలిసిన వారి సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో సల్మా, సాధుఖాన్, యాకూబ్, బాలాజీతో పాటు మరో వ్యక్తిని కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ తెలిపారు.
‘జీపీఎస్ సర్వేతో అన్యాయం’
ములకలపల్లి,వెలుగు: పోడు భూములను జీపీఎస్ ద్వారా సర్వే చేయడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిడియం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. టీఏజీఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వజ్జా సురేశ్, సరియం కోటేశ్వరరావు, సున్నం గంగా, గౌరీనాగేశ్వరావు, పాయం నర్సింహారావు, కుంజా శ్రీను, తొడం తిరుపతిరావు, పెనుబల్లి నానారావు, వెంకటేశ్వర్లు, రామ్మూర్తి పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పొంగులేటి పరామర్శ
మధిర/కల్లూరు, వెలుగు: మధిర, కల్లూరు మండలాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. వంగవీడు, అంబారుపేట, మధిర పట్టణాలతో పాటు చండ్రుపట్ల గ్రామాల్లో పలువురిని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోట రాంబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బొమ్మెర రామ్మూర్తి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
మద్యానికి బానిసై ఆత్మహత్య
పెనుబల్లి, వెలుగు: మద్యానికి బానిసై మండలంలోని గంగదేవిపాడు గ్రామానికి చెందిన గన్నెపోగు మారేశ్వరావు(32) శనివారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం తాగేవాడు. ఎంతచెప్పినా మద్యం మానకపోవడంతో మూడు నెలల క్రితం ఇద్దరు పిల్లలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య రాకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు.
ముగిసిన కోటమైసమ్మ జాతర
కారేపల్లి, వెలుగు: మండలంలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతర ఆదివారంతో ముగిసింది. విజయదశమి సందర్భంగా ప్రారంభమైన జాతర ఐదు రోజుల పాటు రాత్రింబవళ్లు వైభవంగా సాగింది. లక్షకు పైగా భక్తులు కోటమైసమ్మకు వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఆలయ ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభిరామారావు, ఆలయ ఈవో వేణుగోపాలచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాష్శర్మ, సింగరేణి సీఐ ఆరిఫ్ అలీఖాన్, ఎస్సై కుశకుమార్ ఆధ్వర్యంలో జాతరలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.