ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్​ అసిస్టెంట్, టైపిస్ట్​, ఆఫీస్​ సబార్డినేట్​ పోస్టుల వివరాలను అందజేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అనుదీప్​ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య సర్వే చేపట్టాలన్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న పంచాయతీ భవనాలను ప్రారంభించి నిర్వహణలోకి తీసుకురావాలన్నారు. గవర్నమెంట్​ హాస్పిటల్స్​లలో సిబ్బంది సమయపాలన పాటించేలా బయోమెట్రిక్​ తప్పకుండా అమలు చేయాలన్నారు. మీటింగ్​లో డీఈవో సోమశేఖర శర్మ, డీపీవో రమాకాంత్​, పీఆర్​ఈఈ సుధాకర్​, హాస్పిటల్స్​ కో ఆర్డినేటర్​ డా.రవి బాబు పాల్గొన్నారు. 

ఎస్టీ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని..
తమకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చర్ల తహసీల్దార్​ ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాయక్​పోడు కులస్థులు కలెక్టరేట్ లోని సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​కు తరలివచ్చారు. తమకు సర్టిఫికెట్​ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను వేడుకున్నారు. జిల్లావ్యాప్తంగా పలు సమస్యలపై అర్జీదారులు కలెక్టర్​కు వినతిపత్రాలు అందించారు. 

అశ్వారావుపేట ఆయిల్​పామ్​ ఫ్యాక్టరీ కెపాసిటీ 60 టన్నులకు పెంపు

అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 30 టన్నుల నుంచి 60 టన్నులకు పెంచుతున్నట్లు ఆయిల్ ఫెడ్​ జనరల్​ మేనేజర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను సుధాకర్​రెడ్డి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అశ్వారావుపేట ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీ పక్కన స్థలంలో రూ. 70 కోట్లతో 30 టన్నుల సామర్థ్యం కలిగిన మరో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. 2.5 మెగావాట్ల టర్బైన్ కరెంట్​ఉత్పత్తికి పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రూ.36 కోట్లతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీ సామర్థ్యం 60 టన్నులు ఉండగా రూ.30 కోట్లతో వర్టికల్ స్టెరిలైజర్ సిస్టం ద్వారా మరో 30 టన్నుల కెపాసిటీని పెంచడం ద్వారా మొత్తం 90 టన్నులకు చేరుకుంటుందని వివరించారు. మొత్తంగా రూ.200కోట్లతో వివిధ నిర్మాణ పనులు చేపడుతున్నామని సుధాకర్​రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తనికెళ్ల కన్సల్టెన్సీ బాధ్యులు శివనాగిరెడ్డి, అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్లు బాలకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

పీఎం మోడీ ఫొటోకు క్షీరాభిషేకం

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: దేశ రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. సోమవారం పీఎం సమ్మాన్​ నిధి నుంచి 12వ విడత కింద రూ.16వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ లీడర్లు మోడీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్​, రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్​, మందా సరస్వతి, అంజయ్య, రవి రాథోడ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మధిర,వెలుగు: మధిరలో బీజేపీ, కిసాన్ మోర్చా లీడర్లు మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేశ్ పాల్గొన్నారు. 

తాగునీటి కోసం మహిళల ధర్నా

ములకలపల్లి,వెలుగు: ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ సుబ్బనపల్లి గ్రామంలో వారం నుంచి మంచినీరు  రావడంలేదని  సోమవారం గ్రామస్తులు రోడ్డుపై ఖాళీ  బిందెలతో ధర్నా నిర్వహించారు.  గ్రామస్తులు మాట్లాడుతూ అధికారులు స్పందించి నీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు ముదిగొండ రాంబాబు, కోండ్రు భాస్కర్​, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జోనల్​ గేమ్స్ ప్రారంభం

భద్రాచలం, వెలుగు: ఖమ్మం, నల్గొండ, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల జోనల్ గేమ్స్ భద్రాచలం గిరిజన గురుకుల కాలేజీలో సోమవారం ప్రారంభమయ్యాయి. సోమవారం భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు క్రీడాపోటీలను ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​, టెన్నికాయిడ్, హాకీ, రెజ్లింగ్​, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర గేమ్స్ జరిగాయి. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. జాతీయ,అంతర్జాతీయ పోటీలకు ట్రైబల్ వెల్ఫేర్​ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సెలెక్ట్​కావాలని ఆకాంక్షించారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. కార్యక్రమంలో గురుకులం ఏసీవో డేవిడ్​రాజ్, 
ఇతర అధికారులు పాల్గొన్నారు.

రామయ్యకు ప్రత్యేక పూజలు

భద్రాచలం, వెలుగు: శ్రీరామపునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించారు. ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవ చేశారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి కల్యాణం చేశారు. యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించారు. కల్యాణ క్రతువు ముగిశాక భక్తులు స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత స్వామికి రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

కిస్తీలు కట్టలేదని లారీ సీజ్..​ఓనర్​​ సూసైడ్​

ఖమ్మం రూరల్​, వెలుగు: ఖమ్మం రూరల్​మండలం గొళ్లగూడెం గ్రామంలోని ఫైనాన్స్ యార్డు వద్ద సూర్యాపేట జిల్లా మోతె మండలం రాంపురం తండాకు చెందిన అంగోతు శంకర్(50) ఉరేసుకొని సూసైడ్​చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శంకర్​ ఫైనాన్స్ తీసుకుని లారీ కొనుగోలు చేసి నడుపుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలలుగా కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో ఫైనాన్స్​కంపెనీ లారీని తీసుకెళ్లి గొళ్లగూడెం వద్ద ఫైనాన్స్ యార్డులో పెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన శంకర్ సోమవారం యార్డులో ఉన్న లారీకి ఉరేసుకొని చనిపోయాడు. 

ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి

ఖమ్మం టౌన్, వెలుగు: డ్యూటీ సమయాల్లో డ్రైవర్లు,కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మం సిటీలోని ఆర్టీసీ రీజియన్ ఆఫీస్ లో రీజినల్ మేనేజర్ ఎం.ఎస్తేర్ ప్రభులత అధ్యక్షతన రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న ప్రతి బస్ లో ప్రయాణికులను అదనంగా ఎక్కించుకునేలా చూడాలన్నారు. వారితో మర్యాదగా ప్రవర్తించేలా కండక్టర్, డ్రైవర్లకు సూచనలు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్.భవాని ప్రసాద్, పర్సనల్ ఆఫీసర్ విలాస్ రెడ్డి, అకౌంట్ ఆఫీసర్ బాలస్వామి, డీఎంలు శంకర్రావు, దేవదానం, రామారావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.