భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : అభివృద్ధిలో జిల్లాను రోల్ మోడల్‌గా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సోమవారం వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో ఐదో స్థానం, దక్షిణాది రాష్ట్రాల విభాగంలో మూడో స్థానంలో నిలవడానికి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారమే కారణమన్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో పాల్వంచ మున్సిపాలిటీ 11, ఇల్లందు 18, కొత్తగూడెం 25, మణుగూరు 53 స్థానాల్లో నిలిచాయన్నారు. ఇంకొంచెం కష్ట పడితే టాప్ టెన్‌లో ఉంటామన్నారు. అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో రమాకాంత్, డీఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత పాల్గొన్నారు. అనంతరం ప్రజావాణిలో అర్జీలను స్వీకరించారు. లీజు గడువు ముగిసినా ఆ స్థలాల్లో వ్యాపారులు ఉంటున్నారని, మున్సిపాలిటీ వాటిని స్వాధీనం చేసుకోవాలని సింగరేణి భూ పరిరక్షణ కమిటీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
గ్రూప్–1 అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్
జిల్లాలో గ్రూప్–1 ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్(08744241950) పని చేస్తుందన్నారు. 9392919743 వాట్సాప్ నెంబర్ 24 గంటలు పని చేస్తుందన్నారు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ ప్రాంతాల్లో 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాల ఏర్పాటుకు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 18లోగా ఆర్డీవో, సబ్ కలెక్టర్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి
భద్రాచలం: దసరా సెలవులు ముగిసి పిల్లలు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు తిరిగి వచ్చిన నేపథ్యంలో వాతావరణ మార్పుల వల్ల అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని, వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులను ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏలో గిరిజన దర్బారులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. స్కూళ్లు రీ ఓపెన్ అయిన దృష్ట్యా పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.