ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ లీడర్లు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల బలప్రదర్శన చర్చనీయాంశమవుతోంది. మూడేళ్లు సైలెంట్ గా ఉన్న ఈ ఇద్దరు లీడర్లు ఇటీవల దూకుడు పెంచారు. గతంలో నెలకోసారి చొప్పున నియోజకవర్గాల్లో టూర్లేయగా, ఇప్పుడు ప్రతి వారం ప్రజల్లో ఉండేందుకు ప్రియారిటీ ఇస్తున్నారు. కార్యకర్తలు, అభిమానుల సందడి మధ్య భారీ సంఖ్యలో కార్లతో ర్యాలీలు తీస్తున్నారు. గ్రామాల్లోకి బైక్‌లపై వెళుతూ హల్ చల్ చేస్తున్నారు. ఇంతకుముందు నియోజకవర్గాల్లో తిరిగిన సమయంలో ఎవరైనా కార్యకర్తల కుటుంబసభ్యులు, గ్రామస్తులు చనిపోతే పరామర్శించడం, చిన్న ఫంక్షన్లకు కూడా అటెండ్ కావడం వంటివి చేశారు. ఇప్పుడు అదే కార్యక్రమాలకు వెళ్తున్నా.. ఆయా ఊర్లలో బలప్రదర్శన చేయడం దేనికన్న చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయమున్నా, పార్టీలో ఏ ప్రాధాన్యతా లభించని మాజీలుగానే మిగలడంతో తమ ఫాలోవర్స్‌లో నమ్మకం, ధైర్యం సడలకుండా ఉండేందుకే ఈ హంగామా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూపల్లితో భేటీ తర్వాత పెరిగిన దూకుడు
40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీలో కేసీఆర్ తో ఉన్న అనుబంధంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2014లో ఖమ్మం అసెంబ్లీ నుంచి ఓడిపోయిన తుమ్మలను పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన కేసీఆర్ మంత్రివర్గంలో చేర్చుకున్నారు. పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి 2016లో చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున తుమ్మల పోటీ చేసి గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత కందాల టీఆర్ఎస్ లో చేరడంతో వర్గపోరు మొదలైంది. కాంట్రాక్టర్ గా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలిసారిగా 2014లో వైసీపీ తరపున ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ తరపున గెలిపించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. 2019లో ఖమ్మం ఎంపీ టికెట్ పొంగులేటికి కాకుండా నామా నాగేశ్వరరావుకు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. అప్పటికే కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినా టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. రాజ్యసభ సీటు వస్తుందని, ఎమ్మెల్సీ ఇస్తారని పలుసార్లు ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఏ పదవీ పొంగులేటికి దక్కలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్జిల్లాకు చెందిన టీఆర్ఎస్నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల ఖమ్మం వచ్చి తుమ్మల, పొంగులేటితో వేర్వేరుగా సమావేశమయ్యారు. పార్టీలో ఒకే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్న ముగ్గురు లీడర్లు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ఇబ్బందులు, ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై నేతలు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత జిల్లా పర్యటనల్లో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఇక తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన కామెంట్లు, మధిర, నేలకొండపల్లి టూర్లలో తుమ్మల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజకీయ శత్రువులకన్నా, రాజకీయ ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తాను పాలేరు బరిలో ఉంటానని తుమ్మల వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే లేదా ఎంపీగా తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో కేటీఆర్, కేసీఆర్ ఇంతవరకు చెప్పలేదని, అయినా తాను పోటీలో ఉంటానని పొంగులేటి చెప్పారు. రెండు జాతీయ పార్టీల నేతలు ఢిల్లీ నుంచి తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఈ ఇద్దరు నేతలు ఒక్కసారిగా టూర్లు, స్పీచ్‌లలో స్పీడ్ పెంచడం ప్రత్యర్థి వర్గాలకు మింగుడు పడడం లేదు.
బయటపడిన అంతర్గత విభేదాలు
ఉప్పు, నిప్పుగా ఉన్న తుమ్మల, కందాల మధ్య వర్గపోరు ఇటీవల మరింత పెరిగింది. తుమ్మల వర్గం నేతలు ఖమ్మంలో మీటింగ్ పెట్టుకొని పాలేరు నుంచి తుమ్మల పోటీ చేయాలని తీర్మానించారు. టీఆర్ఎస్ లోనే ఉన్న తమను ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. అదే సమయంలో రాజకీయ ద్రోహులు అంటూ తుమ్మల నాగేశ్వరరావు కామెంట్చేయడం మీద ప్రత్యర్థివర్గం కౌంటర్లు వేస్తున్నారు. జిల్లాలో తుమ్మలను మించిన ద్రోహి ఎవరూ లేరని అంటున్నారు. స్థానికుడైన కందాల ఉపేందర్‌రెడ్డి మీద దండయాత్ర చేస్తున్నట్టుగా స్థానికేతరుడైన తుమ్మల కాన్వాయ్‌తో ర్యాలీలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా రెండువర్గాల నేతలు మీడియా ముందుకు రావడం, తుమ్మలవర్గం నేతలపై కేసులు పెడుతున్నారంటూ పోలీస్స్టేషన్ల దగ్గర టీఆర్ఎస్ లీడర్లే ఆందోళన చేయడం వంటి ఘటనలతో పార్టీ అంతర్గత పోరు కాస్త వీధిన పడింది.
పార్టీ మారతారా?
టీఆర్ఎస్లో పార్టీ అధినేత కేసీఆర్ఆదేశాల ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేనే బాస్ అనే విధానాన్ని ఫాలో అవుతున్నారు. అయితే ఆ రూల్స్‌ను లైట్ తీసుకుంటూ మాజీ నేతలు ఆయా సెగ్మెంట్లలో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు జరగడం లేదు. తుమ్మల, పొంగులేటి ఇద్దరూ పార్టీ మారతారనే ప్రచారం ఓ వైపు జరుగుతుండగా, వాళ్ల అనుచరులు మాత్రం తమ నేత ఫలానా సీటు నుంచి పోటీ చేయడం పక్కా అని.. ఏ పార్టీ అనేది త్వరలో తెలుస్తుందని అంటున్నారు. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తుండగా, ఖమ్మం జిల్లాలో దానికి తగ్గట్టుగా ముఖ్యనేతలు నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.