ఖమ్మం బీఆర్ఎస్ లో మాదంటే మాదే పైచేయి అని ఇద్దరు నేతల కొట్లాట తారాస్థాయికి చేరింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు వర్గాల మధ్య పోరు జిల్లా పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందంటున్నారు. మా వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారంటూ పువ్వాడ గ్రూప్ చెప్పుకుంటుంటే... పెద్ద సార్ నుంచే మాకు ఫుల్ సపోర్ట్ ఉందంటూ తాతా మధు గ్రూప్ తెగ హడావుడి చేస్తోంది. పెద్ద నేతల జోక్యంతో కొంతకాలం చల్లారినా ఒరిజినల్ అట్లాగే ఉందని ఇద్దరి నేతల అనుచరులు చెబుతున్నారు.
కొంతకాలంగా పాలేరు సహా పలు సెగ్మెంట్లలో మంత్రి అజయ్ వర్గం మాట చెల్లట్లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. మంత్రి మనుషుల వ్యవహారాల్లో కొందరు పార్టీ ఎమ్మెల్యేల మనుషుల నుంచే ఎదురుదెబ్బలు తప్పట్లేదన్న టాక్ నడుస్తోంది. దీని వెనుక ఎమ్మెల్సీనే ఉన్నారని మంత్రి వర్గం మండిపడుతోంది. పాలేరులో పలు కార్యక్రమాలకు మంత్రికి అసలు ఆహ్వానం కూడా ఉండట్లేదని చెబుతున్నారు.
ప్రోటోకాల్ వివాదాలు, అధికారులకు వార్నింగులు కూడా కామన్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ వర్గం నుంచి ఆదేశాలున్నాయని కొందరు అధికారులు మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చినికి చినికి గాలివాన అయినట్లు కోల్డ్ వార్ కాస్తా పార్టీ అంతర్గత మీటింగ్ లలో ఒకరినొకరు తిట్టుకునేదాకా పోయినట్లు సమాచారం. పార్టీ పెద్దలకు రిపోర్టులు ఇవ్వడానికి ఒకరి లోపాలు ఒకరు వెతికి పట్టుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. లోపాలు వెతికి లిస్ట్ చేయడానికే స్పెషల్ టీ మ్ లు పెట్టుకున్నారట.
చాలాకాలం పాటు తమకు ఎదురులేదని పువ్వాడ గ్రూప్ ఫీలవుతున్న సమయంలో తాతా మధు ఎమ్మెల్సీ కావడం, అంతలోనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఇవ్వడంతో షాక్ తగిలినట్లయింది. ఆ తర్వాతే రెండు వర్గాల మధ్య గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు. రాష్ట్రంలో మంత్రులను జిల్లాలకే పరిమితం చేస్తే... ఖమ్మం జిల్లాలో సెగ్మెంట్ కే మంత్రిలా తయారైందని పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు.
మరోవైపు పాలేరు సీటుపై ఇంట్రెస్ట్ తో ఎమ్మెల్సీ మధు ఉన్నట్లు ఆయన వర్గమే ప్రచారం చేస్తోంది. పాలేరు టికెట్ విషయంలో కందాల ఉపేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు మధ్య తేలకుంటే పిట్టపోరు పిల్లి తీర్చినట్లు ఎమ్మెల్సీ రేసులోకి వస్తారని చెప్పుకుంటున్నారు. అందుకే పాలేరులో ఎక్కువగా హడావుడి చేయడానికి ఇదే కారణమంటున్నారు.
ఎవరి రాజకీయం ఎట్లా ఉన్న ఇద్దరి మధ్య కేడర్ మాత్రం విలవిలలాడుతున్నామంటున్నారు. ఎన్ని గొప్పలు చెప్పుకున్నా జిల్లాలో పార్టీ ఒక్క సిటీ మించి గెలిచిందిలేదు. ఈసారి మరిన్ని సవాళ్లున్న సమయంలో లీడర్ల గొడవ ఎటు దారితీస్తుందోనని పార్టీ నాయకులు మొత్తుకుంటున్నారు.