ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

పింఛన్ల పంపిణీ లో తెలంగాణ నెంబర్ వన్ 

గుండాల/సత్తుపల్లి , వెలుగు :   అర్హులందరికీ పింఛన్లు అందించడంలో తెలంగాణ నంబర్​ వన్​లో ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని రైతు వేదికలో లబ్ధిదారులకు కొత్త పింఛన్లు కార్డులను గురువారం  అందించారు . అనంతరం పగిడిద్దరాజు గద్దెల వద్ద దళిత బంధు స్కీమ్ లో వచ్చిన వెహికల్స్ ను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో  పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టారని అన్నారు.  కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భవానీ శంకర్ , ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి, నరసిహారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తీ లింగయ్య పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి అధిక సంఖ్యలో మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. గురువారం మున్సిపాలిటీలో లబ్ధిదారులకు పింఛన్​ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో గతంలో 30,595 మందికి పెన్షన్లు వస్తుండగా కొత్తగా 11,028 మందికి పింఛన్​ మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమ మహేశ్వరరావు,మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్​ పర్సన్​ కూసంపుడి మహేశ్, తోట సుజల రాణి, కమిషనర్ సుజాత, తహాసీల్దార్ శ్రీనివాస రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అర్హులందరికీ పింఛన్లు..

ముదిగొండ, వెలుగు:    లబ్ధిదారులకు పింఛన్​ పంపిణీ చేయడం ప్రభుత్వం బాధ్యతని, పింఛన్​​ అందని వారికి, మంజూరయ్యేలా కృషి చేస్తానని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్​ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు, మంజూరు పత్రాల  పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా 2,195 ఆసరా పింఛన్​ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గతంలోనూ ముదిగొండ మండలాన్ని అభివృద్ధి చేశామని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల రాజు, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ఎంపీడీవో శ్రీనివాసరావు, తాహసీల్దార్ దామోదర్, ఎంపీఓ సూర్యనారాయణ, సర్పంచ్ మందారపు లక్ష్మి, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే సమస్యను పరిష్కరించాలని వీఆర్​ఏలు చేస్తున్న దీక్షకు బట్టి విక్రమార్క సంఘీభావం తెలిపారు. 

సీపీఎస్ ను  రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉమ్మడి జిల్లాలో టీచర్లు డిమాండ్​ చేశారు. గురువారు పెన్షన్​ విద్రోహ దినంగా ప్రకటించి, ఆందోళనలు చేశారు. ఖమ్మంలో యూపీఎస్సీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సెప్టెంబర్​ 1న దేశవ్యాప్తంగా పెన్షన్ విద్రోహ దినోత్సవంలో భాగంగా ఆందోళన చేస్తున్నామనీ యూపీఎస్సీ రాష్ట్ర నాయకులు సీహెచ్.రవి, డి.సైదులు, శౌకత్ ఆలీ, నాగిరెడ్డి, దుర్గాభవాని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెబుతూ ఉద్యోగులను మోసం చేస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, నాగేశ్వరరావు, విజయ్, నాగిరెడ్డి,సంధ్యారాణి,ఉమాదేవి పాల్గొన్నారు. భద్రాద్రికొత్తగూడెంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బి.రవి ఆధ్వర్యంలో స్థానిక ఉపాధ్యాయులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అశ్వారావుపేటలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్​ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహాసీల్దార్ చల్లా ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో పీఆర్​టీయు రాష్ట్ర కార్యదర్శి అప్పారావు, శ్రీనివాసరెడ్డి, రామారావు, సుజాత, బుల్లెమ్మ, రమేష్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బిల్లులు చెల్లించాలని  మిడ్​ డే మీల్స్​ వర్కర్ల సమ్మెచండ్రుగొండ, వెలుగు: పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చండ్రుగొండ పీఎస్ లో మధ్యాహ్న భోజన వర్కర్లు గురువారం సమ్మె చేశారు. దీంతో ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మయ్య, హెచ్ ఎం, స్టాఫ్ కలిసి   భోజనాన్ని వండారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలు కలిపి రూ.10 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం చేయడంతో తమకు ఆర్థికంగా ఇబ్బంది అవుతోందన్నారు. పెరిగిన నిత్యావసర రేట్లతో  కిరాణా షాపు యజమానులు నగదు లేకుండా సరుకులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా   బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈఓ సత్యనారాయణ ను వివరణ కోరగా డీఈవో దృష్టికి సమస్య ను తీసుకెళ్తామని తెలిపారు. 


సంక్షేమ బోర్డు నిధులు దారిమళ్లుతున్నాయి

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 
ప్రధాన కార్యదర్శి రత్నకరం కోటంరాజు 

ముదిగొండ, వెలుగు: కార్మిక సంక్షేమ బోర్డు నిధులు రూ. 12 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు అన్నారు. ముదిగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో భవన కార్మిక సంఘం మండల ఐదవ మహాసభలు నాగరాజు, ఈశ్వర చారి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభల్లో కోటం రాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీరం చేసేందుకే బోర్డుకు అధికారులు నియమించలేదని విమర్శించారు. సంక్షేమ నిధులను దారమళ్ళీస్తూ కార్మికుల మనుగడను అడ్డుకుంటోందని ఆరోపించారు. కొత్త లేబర్ కోడు వల్ల కార్మికులు 8 గంటల నుంచి 12 గంటల పనిని బలవంతంగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అని విమర్శించారు. అనంతరం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ముదిగొండ మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణ్, వెంకటేశ్వరరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు దామోజు లక్ష్మయ్య, శ్రీనివాసరావు, మల్లికార్జున్ల, టీఎస్ కళ్యాణ్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

వెల్ఫేర్​ హాస్టల్​ను తనిఖీ చేసిన జడ్జి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్​సివిల్​జడ్జి మహ్మద్​అబ్దుల్​జావేద్​పాషా గురువారం స్థానిక గిరిజన సంక్షేమ హాస్టల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్​లో వసతులను పరిశీలించారు. హాస్టల్​గదులను, కిచెన్​ను   తనిఖీ చేశారు. రాష్ర్ట న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హాస్టల్​ తనిఖీ చేసినట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి15రోజులకు ఒకసారి హాస్టళ్ళలో తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ డా.వినీత్​ హెచ్చరించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 4వ తేదీన సింగరేణి లో  ఉద్యోగుల భర్తీకి నిర్వహించబోయే పరీక్షకు అభ్యర్థులు  సింగరేణి సంస్థ సూచించే రూల్స్​పాటించాలని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పటికే కొంత మంది   ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి   వారిని మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.