నో బ్లడ్​ తలసేమియా బాధితులకు కష్టాలు .. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 500 మంది బాధితులు

నో బ్లడ్​ తలసేమియా బాధితులకు కష్టాలు .. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 500 మంది బాధితులు
  • బ్లడ్​బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత 
  • దాతలు ముందుకు రావాలంటున్న సంస్థలు

18 నుంచి 65 ఏళ్ల వయస్సున్న ఆరోగ్యవంతులెవరైనా రక్తదానం చేయవచ్చు. శరీర బరువు కనీసం 45 కేజీలు ఉండాలి. హిమోగ్లోబిన్​ కనీసం 12.5 గ్రాములు ఉండాలి. మనిషి శరీరంలో కనీసం 4.5 లీటర్ల నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. రక్తదానం చేసేవారినుంచి ఒక యూనిట్​ అంటే 350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. మూడ్రోజుల్లో ఆ రక్తం శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం 160 సార్లు రక్తదానం చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 

ఖమ్మం, వెలుగు: తలసేమియా బాధిత చిన్నారులు, వారి కుటుంబ సభ్యులను రక్తం కొరత తీవ్రంగా వేధిస్తోంది. తలసేమియా బాధితులకు 10, 15 రోజులకోసారి రక్తం ఎక్కించవలసి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 500 మందికి పైగా బాధితులు ఉన్నారు. నెలల వయస్సున్న పిల్లల నుంచి 27 ఏళ్ల యువకుడి వరకు తలసేమియాతో బాధపడుతున్నారు. వీరంతా ఖమ్మం, హైదరాబాద్​లలో రక్తం ఎక్కించుకుంటారు. 14 ఏళ్ల లోపు వారికి ఒక యూనిట్, 15 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న వారికి 2 యూనిట్ల రక్తం అవసరం అవుతుంది. వీరి అవసరాలకోసం ఉమ్మడి జిల్లాలో నెలకు కనీసం 1200 యూనిట్ల రక్తం కావాలి. ఎండాకాలం కావడంతో పాటు వివిధ కారణాలవల్ల దాతలు ముందుకు రాకపోవడంతో బ్లడ్​బ్యాంకుల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి.

 దీంతో అత్యవసర సమయాల్లో తెలిసిన వారిని ఒప్పించి రక్తదానం చేయించాల్సివస్తోందని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి కూడా ప్రతి రోజూ 8 నుంచి 10 మంది బాధితులు ఖమ్మం వస్తుంటారు. సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నెలకు 220 మంది వరకు తలసేమియా బాధితులకోసం ఉచితంగా రక్తం ఇస్తున్నారు. ఇది అందరికీ సరిపోకపోవడంతో కొందరు తలసేమియా పేషెంట్ల తల్లిదండ్రులు రక్తం కోసం బ్లడ్​ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో వివిధసంస్థలు, యువజన సంఘాల వారు రక్తదాన శిబిరాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఎండాకాలం కావడం వల్ల శిబిరాలు తగ్గిపోయాయి. కాలేజీలకు సెలవులు కావడంతో తరచు బ్లడ్​ డొనేట్ చేసే స్టూడెంట్స్​కూడా అందుబాటులో లేరు. దీంతో పేషెంట్లకు అవసరమైన రక్తాన్ని సమకూర్చడం కష్టమవుతోంది. 

పది రోజులకోసారి రక్తం ఎక్కించాలి 

మా బాబు టి.జోసెఫ్​ రాజ్ కు ఐదేళ్లు. 10రోజులకోసారి రక్తం ఎక్కించాలి. ఎండాకాలం కావడం వల్ల రక్తం కోసం చాలా ఇబ్బంది అవుతోంది. మా లాంటి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి దాతలు ముందుకురావాలి. రక్తదానం చేసి వందలాది మంది చిన్నారుల ప్రాణాలను నిలబెట్టాలి. 

రాహెల్, ముత్యాలమ్మ నగర్, మణుగూరు 

రక్తదాతలు ముందుకు రావడం లేదు

వేసవిలో రక్తం కొరత ఎక్కువగా ఉంటుంది. తలసేమియా పేషెంట్లు పెరుగుతున్నారు. రక్త దానం చేసే వారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో డొనేట్​ చేసేందుకు ముందుకు రావడం లేదు. నెగటివ్ బ్లడ్ గ్రూప్ అవసరం ఉన్న రోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలను నిలబెట్టే రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి. 

ప్రొద్దుటూరు పావని, సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్