ధాన్యం దించుకునేందుకు మిల్లర్ల కొర్రీలు .. క్వింటాకు 5 కిలోల చొప్పున కట్ చేస్తామని కండీషన్​

ధాన్యం దించుకునేందుకు  మిల్లర్ల కొర్రీలు .. క్వింటాకు 5 కిలోల చొప్పున కట్ చేస్తామని కండీషన్​
  • ఐకేపీ, సొసైటీ సిబ్బంది ద్వారా రైతులపై ఒత్తిళ్లు 
  • తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటున్న అన్నదాతలు 
  • తరుగుకు ఒప్పుకోకుంటే కాంటాలు బంద్​ పెడుతున్న పరిస్థితి

కూసుమంచి మండలం రాజుతండాకు చెందిన రైతు భూక్యా రాంబాబు వారం రోజుల కింద 200 క్వింటాళ్ల ధాన్యాన్ని కూసుమంచి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. తేమ శాతం సరిగానే ఉన్నా కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేయడం లేదు. క్వింటాకు 5 కిలోల వరకు తరుగు తీసేందుకు ఒప్పుకుంటేనే కాంటా వేస్తామని కండీషన్​ పెట్టడంతో చివరకు తరుగుకు ఒప్పుకున్నాడు. కూసుమంచిలోని డీసీఎంఎస్​ కోనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 6వేల క్వింటాళ్లు మిల్లర్లకు పంపగా, క్వింటాకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల తరుగు విషయంలో కొందరు మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది. రైతుల నుంచి ధాన్యం సేకరణ సమయంలో ఎలాంటి తరుగు తీయొద్దని మంత్రులు, కలెక్టర్​ సహా అధికారులు స్పష్టంగా చెబుతున్నా మిల్లర్లు పట్టించుకోవడం లేదు. రెండు, మూడు రోజులుగా క్వింటాకు 4 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తామని, మిల్లు దగ్గరకు లోడ్​ వచ్చినా తరుగు తీస్తేనే అన్​లోడ్​ చేసుకునేందుకు ఒప్పుకుంటామని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. కూసుమంచి మండలం పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రం, కూసుమంచిలోని కొనుగోలు కేంద్రంలో ఇదే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. 

వైరా నియోజకవర్గంలోని గరికపాడు, ముసలిమడుగు కొనుగోలు కేంద్రాల్లో తరుగు విషయంలో మిల్లర్లు ఇబ్బంది పెడుతుండడంతో బాధిత రైతులు అక్కడి ఎమ్మెల్యే రాందాస్​ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. మిల్లర్​ తో స్వయంగా ఎమ్మెల్యే ఫోన్​ లో మాట్లాడినా ధాన్యం లోడ్​ దింపుకొనేందుకు నిరాకరించారు. తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్​ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా నేలకొండపల్లి మండలానికి చెందిన మిల్లర్​ తో మాట్లాడి తరుగు లేకుండా ధాన్యం అన్​ లోడ్ చేసుకునేందుకు ఒప్పించారు. మరోవైపు మిల్లర్లు కూడా తమ పరిస్థితిని సమర్థించుకుంటున్నారు. తాము క్వింటాకు 67 కిలోల బియ్యాన్ని లేవీగా ఇవ్వాల్సి ఉంటుందని, ఈ సీజన్​ లో పండిన ధాన్యాన్ని మర ఆడిస్తే 60 కిలోలు మాత్రం బియ్యం వస్తున్నాయని చెబుతున్నారు. ఎక్కువ వేడి కారణంగా బియ్యం నూకగా మారడంతో తాము నష్టపోతున్నామని, ధాన్యం తరుగు తీస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. 

లారీల కొరతతో తిప్పలు!

ఖమ్మం జిల్లాలో ఈ సీజన్​ 1.85 లక్షల టన్నుల సన్న ధాన్యం, 73 వేల టన్నుల దొడ్డు రకం ధాన్యం కలిపి మొత్తం 2.58 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1,317 మంది రైతుల నుంచి రూ. 24.66 కోట్ల విలువైన 10,628.760 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 8,900 టన్నుల సన్న రకం ధాన్యం కాగా, మిగతాది దొడ్డు రకం ధాన్యమని అధికారులు చెబుతున్నారు. రైస్ మిల్లుల దగ్గర, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో తరుగు పేరిట కోతలు లేకుండా పర్యవేక్షణ జరుపుతున్నామని ఒకవైపు ఆఫీసర్లు చెబుతున్నా, తరుగు తీస్తేనే కాంటాలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన సమయంలో లారీలు అందుబాటులో ఉండడం లేదు.

 కల్లూరు మండలం ఎర్రబంజర కొనుగోలు కేంద్రంలో గత వారం రెండు లారీల ధాన్యాని తరలించారు. ఆ తర్వాత వారం రోజులుగా 2 వేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసి, కాంటాలు వేసినా ఇప్పటి వరకు లారీలు రాలేదు. ఒకవైపు అకాల వర్షాలతో ఎప్పుడు వాన కురుస్తుందోనన్న భయం ఉండగా, కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని తరలించకపోవడంతో వాటిపై పట్టాలు కప్పి అక్కడే నిల్వ ఉంచారు. 

గన్నీ బ్యాగులూ అందడం లేదు!

మరికొన్ని కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో లేని కారణంగా ఇప్పటి వరకు కాంటాలు ప్రారంభం కాలేదు. కారేపల్లి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో మాదారం, సొసైటీ ఆధ్వర్యంలో విశ్వనాథపల్లి, సీతారాంపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశ్వనాథపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి  కొందరు రైతులు మూడు రోజుల కిందనే ధాన్యం తీసుకొచ్చారు. బస్తాలు లేకపోవడంతో నిర్వాహకులు కొనుగోలు ప్రారంభించలేదు. కారేపల్లి సొసైటీ సిబ్బంది 20 రోజుల కిందనే జిల్లా సివిల్ సప్లై అధికారికి బస్తాలు కావాలని ఇండెంట్ కూడా పెట్టారు. ఇప్పటి వరకు బస్తాలు రాలేదు. గన్నీ బస్తాల కొరతతో కొనుగోలు ప్రారంభించకపోవడంతో కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారు.