
- నేలకొరిగిన వరి పంటను కోసేందుకు డబుల్ ఖర్చు
- ఎక్కువ సమయం తీసుకుంటున్న వరి కోత మిషన్లు
- రెండు రకాలుగా నష్టపోతున్న అన్నదాతలు
- ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంతోనూ ఇబ్బందిపడుతున్న రైతులు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తూర్పులోకవరానికి చెందిన కంభంపాటి కిరణ్ కుమార్ రెండెకరాల్లో వరిసాగు చేశారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురియడంతో కోత దశకు వచ్చిన పొలం మొత్తం నేలకొరిగింది. సాధారణంగా రెండెకరాల పొలాన్ని వరి కోత మిషన్ తో కట్ చేయించేందుకు రెండు గంటలు సమయం పడుతుండగా, అడ్డం పడిన పొలాన్ని కోసేందుకు మూడున్నర గంటల సమయం పట్టింది. గంటకు రూ.3 వేల చొప్పున రూ.6 వేలతో కోత పూర్తవ్వాల్సిన పొలం కాస్తా, ఇప్పుడు రూ.10వేల ఖర్చయింది. గాలి వాన కారణంగా రాలిపోయిన వడ్ల నష్టానికి ఇది అదనపు భారం.
ఖమ్మం, వెలుగు: పంట చేతికందిన దశలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లను మిగుల్చుతున్నాయి. వరి పొలాలు కోతకు వచ్చిన సమయంలో గాలి దుమారం కారణంగా నేలకొరుగుతుండడంతో, హార్వెస్టర్లతో కోత కోయడం కూడా ఆలస్యమవుతోంది. దీంతో గాలి వానతో రాలిన వడ్లతోనే రైతులకు నష్టం జరుగుతుండగా, మిగిలిన వడ్లను దక్కించుకునేందుకు ఎక్కువ ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇక కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఎండబెట్టుకున్న రైతులది మరో దీనగాథ. పొలాలు కోసిన తర్వాత పది పదిహేను రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టగా, తేమ శాతం తగ్గినా సకాలంలో కాంటాలు వేయకపోవడంతో వడ్లు తడుస్తున్నాయి.
గన్నీలు అందకపోవడం, కాంటా వేసే కూలీ ముఠాలు రాకపోవడం, లారీలు రాకపోవడం వంటి వేర్వేరు కారణాలతో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఖమ్మం జిల్లాలో 56 గ్రామాల్లో 1,776 మంది రైతులకు చెందిన 3,212 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మూడ్రోజుల కింద కురిసిన వానకు 3,094 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరో 700 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం జరిగింది. మొత్తానికి గత రెండు వారాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను నష్టపోయారు.
కొనుగోళ్లలో కొర్రీలు..!
ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు పెడుతున్న కొర్రీలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి మరీ నచ్చిన ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటామని చెబుతుండడంపై సీరియస్ అవుతున్నారు. కల్లూరు మండలం కొర్లగూడెం ఐకేపీ కొనుగోలు కేంద్రానికి బుధవారం కల్లూరు ధాన్యాన్ని అలాట్మెంట్చేసిన త్రిబుల్ ఆర్ రైస్ మిల్లు యజమానులు కొనుగోలు కేంద్రానికి వచ్చారు. ఆ కేంద్రంలో కొన్ని రాశులను మాత్రమే కొంటామని చెప్పారు.
దీనిపై రైతులు అభ్యంతరం చెప్పారు. ఐకేపీ సిబ్బంది ఇచ్చిన టోకెన్ సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి ధాన్యం ఆరబోస్తే, వారం రోజుల కింద కేంద్రాన్ని ప్రారంభించారని, ఇప్పుడు మిల్లర్లు వచ్చి కొర్రీలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. దీంతో ఉన్నతాధికారులకు చెప్పి సమస్య పరిష్కరిస్తామని రైతులకు ఐకేపీ సిబ్బంది సర్దిచెప్పారు.
పది రోజులైనా కొనుగోలు చేయడం లేదు
మూడెకరాల సొంతభూమితో పాటు 8 ఎకరాలు కౌలుకు తీసుకొని, మొత్తం 11 ఎకరాల్లో వరి సాగుచేశా. దిగుబడి వచ్చిన ధాన్యాన్ని 10 రోజుల కింద కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టి తేమ శాతం తగ్గించాం. కానీ ఇంత వరకు కొనుగోలు చేయడం లేదు. అకాల వర్షాలతో వడ్లు తడిస్తే తమ పరిస్థితి ఏంటి? ఐకేపీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదు. లారీలు రావడం లేదు. వెంటనే ధాన్యం కొనాలి.
గుంజి భూషణం, రైతు, కొర్లగూడెం