
- ఆస్పత్రుల్లో ప్రాణాలకు రిస్క్
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్ల పట్ల మేనేజ్మెంట్ల నిర్లక్ష్యం
- ఇరుకైన భవనాల్లో ఆస్పత్రుల నిర్వహణ
- ఖమ్మంలోని ఓ ఆస్పత్రి నిర్వాహకులకు నోటీసులు జారీ
ఖమ్మం నెహ్రూ నగర్ లో ఉన్న ప్రసూన ఆర్థోపెడిక్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈనెల 21న లిఫ్ట్ ప్రమాదం జరిగింది. మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడిపోవడంతో అందులో స్ట్రెచర్ పై ఉన్న హార్ట్ పేషెంట్ సట్టు సరోజనమ్మ (55) స్పాట్ లోనే చనిపోయింది. మరొకరికి గాయాలయ్యాయి. దీంతో లిఫ్ట్ మెయింటనెన్స్ విషయంలో ఆస్పత్రి మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం బయటపడింది. ఈ ప్రమాదంతో స్పందించిన వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆస్పత్రిని పరిశీలించి యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
లిఫ్ట్ సరిగా పనిచేయడం లేదని, పేషెంట్ల సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి లెవల్ 3 నిబంధనలను పాటించలేదని గుర్తించారు. ఎందుకు ఆస్పత్రి అనుమతులను రద్దు చేయకూడదు, ఎందుకు సీజ్ చేయకూడదో.. మూడ్రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల మేనేజ్ మెంట్లు కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టిపెడుతున్నాయి. కనీస సౌకర్యాలు లేకుండా, ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకోకుండా రోగులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నాయి. ఆస్పత్రుల ఏర్పాటు సమయంలో ఆయా డిపార్ట్ మెంట్ల అధికారులను మామూళ్లతో మేనేజ్ చేస్తూ, అవసరమైన సర్టిఫికెట్లు, ఎన్వోసీలు సంపాదిస్తున్నాయి. తర్వాత ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ అనుమతి పొందినవి 541 ఆస్పత్రులు ఉన్నాయి. హాస్పిటల్ కు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో మున్సిపల్ డిపార్ట్ మెంట్ నుంచి బిల్డింగ్ అనుమతులు, ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ముందస్తు అనుమతి తీసుకున్న ప్లాన్ ప్రకారమే బిల్డింగ్ నిర్మించామని చెబుతూ మున్సిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆస్పత్రి కోసం పెద్ద భవనాలు, అపార్ట్ మెంట్ తరహా నిర్మాణాలు చేస్తూ రూల్స్ ను మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఖమ్మం నగరంలో ఉన్న చాలా ఆస్పత్రులు ఒకదానికి ఒకటి ఆనుకొని ఇరుకైన భవనాల్లోనే ఉన్నాయి. ఎక్కువ బిల్డింగుల్లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే, ఫైరింజన్ తిరిగే జాగా కూడా లేదు. ఎలాంటి సెట్ బ్యాక్ వదిలిపెట్టకుండా బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టారు. రోజూ వందలాది మంది పేషెంట్ల నుంచి రోగాన్ని బట్టి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులు, పేషెంట్లకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు.
రీసెంట్ గా ప్రమాదం జరిగిన ప్రసూన ఆస్పత్రి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయినా, 50 బెడ్స్ ఆస్పత్రిలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన లెవల్ 3 ఫైర్ సేఫ్టీ మెజర్ మెంట్స్ మాత్రం లేవు. దీంతో ప్రస్తుతానికి ప్రసూన ఆస్పత్రికి వైద్యారోగ్య శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిబంధనలు పాటించకపోవడంపై మూడ్రోజుల్లో వారి నుంచి నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
లిఫ్ట్ ప్రమాద ఘటనతో అలర్ట్..
ఖమ్మంలోని ప్రసూన ఆస్పత్రి లిఫ్ట్ ప్రమాదం ఘటనతో మేల్కొన్న వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లాలోని మిగిలిన ఆస్పత్రుల్లో పరిస్థితులపైనా నజర్ పెట్టారు. అన్ని ఆస్పత్రులకు, డయాగ్నస్టిక్ సెంటర్లకు సర్క్యూలర్ ను జారీ చేశారు. ఆయా భవనాల్లో లిఫ్ట్ వివరాలు, దాన్ని రెగ్యులర్ గా మెయింటనెన్స్ చేయిస్తున్న రిపోర్ట్ తో పాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వివరాలు, ఫైర్ ఎన్వోసీ ఉందా.. లేదా.. లేకుంటే ఇటీవల చేయించిన ఫైర్ ఆడిట్ రిపోర్ట్ ను వెంటనే సమర్పించాలని సర్క్యులర్ ను పంపించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రెసిడెంట్ ద్వారా కూడా సర్క్యులర్ ను పంపించారు. ఇలా సర్క్యులర్ జారీ చేయడం రాష్ట్రంలోనే ఇది మొదటి సారి అని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల తప్పులపై కేవలం నోటీసులు, సర్క్యులర్లతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పేషెంట్లు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.