ప్రజాసేవకు అంకితం కావాలి : చంద్రశేఖర్ రెడ్డి

ప్రజాసేవకు అంకితం కావాలి : చంద్రశేఖర్ రెడ్డి
  • మల్టీ జోన్ 1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
  • ఘనంగా ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్

ఖమ్మం టౌన్, వెలుగు : సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావాలని మల్టీ జోన్ 1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తొమ్మిది నెలల బేసిక్‌ ఇండక్షన్‌ శిక్షణను పూర్తి చేసుకున్న 263 ఏఆర్, సివిల్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ గురువారం సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్టీ జోన్ 1 ఐజీపీ ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

 అనంతరం విధి నిర్వహణలో వివక్ష చూపమని, తమ సేవలతో దేశ ప్రతిష్ట పెంచుతామని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఈరోజు నుంచి పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించనున్నారని చెప్పారు. ప్రజల రక్షణే బాధ్యతగా పని చేయాలని సూచించారు. తొమ్మిది నెలల శిక్షణ కాలంలో నేర్చుకున్న కొత్త చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

 ఈ ఏడాది ఫిబ్రవరి 21న ప్రారంభమైన 8 వ బ్యాచ్‌లో రాచకొండ చెందిన ఏఆర్ కానిస్టేబుళ్లు -92, రామగుండం, వికారాబాద్ చెందిన సివిల్ కానిస్టేబుళ్లు- 171 శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడానికి సిద్ధమయ్యారన్నారు.  శిక్షణలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు జ్ఞాపికలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్​కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రఘు, రహెమాన్, రవి, శ్రీనివాసులు, సాంబరాజు, నర్సయ్య, సుశీల్ సింగ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, డాక్టర్. జీతేందర్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న క్యాండిడేట్లను కలుసుకునేందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వారి తలపై హ్యాట్ పెట్టి, చేతిలో తుపాకీ పెట్టి సెల్ఫీలు దిగారు. స్వీట్లు పంచుకున్నారు.