భూ భారతి పై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి : కలెక్టర్ శ్రీజ

భూ భారతి పై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి :  కలెక్టర్ శ్రీజ
  • ఖమ్మం జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు :  భూ భారతిపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని ఖమ్మం ఇన్​చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి రెవెన్యూ శాఖ అధికారులతో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి హక్కుల భద్రతకు, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి అమల్లోకి తెచ్చిందన్నారు. తహసీల్దార్లు చట్టంపై పూర్తి అవగాహన పెంచుకొని మండల, గ్రామ స్థాయి అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో చట్ట అమలుకు పైలట్ ప్రాజెక్ట్ కింద పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు. 

సదస్సులకు కనీసం 500 లకు పైగా జన సమీకరణ చేయాలని,  ఫంక్షన్ హాల్, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.  గురువారం నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఈనెల 17 నుంచి 30 వరకు రెవెన్యూ అధికారులు సదస్సులు ఏర్పాటు చేసి భూ భారతితో రైతులకు ఎలాంటి సమస్యలు పరిష్కారమవుతాయనేదానిపై స్పష్టంగా వివరించాలని చెప్పారు. అనంతరం ఆమె భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంలోని కీలక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేంద్ర గౌడ్, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లాలోని మండల తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్ల పుట్టడం వరం

ప్రేమానురాగాలకు ప్రతీకైన అమ్మాయి పుడితే ఇంటికి పరిపూర్ణత వస్తుందని, ఆడపిల్లలు జన్మించిన తల్లిదండ్రులు భారంగా కాకుండా వరంలా భావించాలని ఇన్​చార్జి కలెక్టర్ శ్రీజ సూచించారు. రఘునాథపాలెం గ్రామంలోని వాంకుడోత్ సునీత, నరేశ్​ దంపతులకు ఇటీవల బిడ్డ పుట్టినందున ‘మా పాప -మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా ఆమె ఆ కుటుంబ సభ్యులను కలిసి సన్మానించారు. స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అందిందజేసి అభినందించారు.