భద్రాచలం సమస్యలపై కలిసి పోరాడుదాం

  •     రౌండ్​ టేబుల్​ సమావేశంలో వక్తలు 

భద్రాచలం, వెలుగు:  భద్రాచలం నియోజకవర్గ సమస్యలపై కలిసి పోరాడుదామని పలువురు నాయకులు, వక్తులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్​ హాలులో లో నిర్వహించిన రౌండ్​ టేబుల్​ సమావేశంలో పలువురు ప్రముఖులు, మేధావులు, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. పూనెం ప్రదీప్​కుమార్​ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడారు.

ములుగు జిల్లాలో కలిపిన నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాలను తిరిగి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అతిపెద్ద మండలాలైన దుమ్ముగూడెం, చర్లల నుంచి కొన్ని పంచాయతీలను కలిపి మూడోది శ్రీసీతారామ మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలు, పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాలను కలిపి భద్రాచలం జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పోలవరం ఆర్డినెన్స్ పేరుతో ఆంధ్రాలో విలీనం చేసిన ఏడు మండలాల్లోని ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణలో కలపాలన్నారు. పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్​ను పొడిగించాలని, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని డెవలప్ చేయాలని కోరారు. సమావేశంలో పట్టణ ప్రముఖులు అడుసుమిల్లి జగదీశ్​, సీపీఎం నాయకుడు బాలనర్సారెడ్డి, టీడీపీ లీడర్​అజీం, సీపీఐ ఎంఎల్​ నాయకురాలు కెచ్చెల కల్పన, ప్రముఖ న్యాయవాది తిరుమలరావు, అలవాల రాజా, బీజేపీ లీడర్​ ఆవుల సుబ్బారావు, గడ్డం స్వామి, రిటైర్డ్ ఎంప్లాయీస్​ యూనియన్​ జిల్లా అధ్యక్షులు నాగభూషణం, కొడాలి శ్రీనివాసన్​ తదితరులు పాల్గొన్నారు.