
- ఖాతాదారుల వడ్డీ డబ్బులు సొంతానికి వాడుకున్న ఉద్యోగి
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మణప్పురం సంస్థకు చెందిన ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. గోల్డ్‌లోన్ తీసుకున్న ఖాతాదారులు ప్రతి నెల చెల్లించే వడ్డీని వారి అకౌంట్లో జమ చేయకుండా.. సదరు ఉద్యోగి తన సొంతానికి వాడుకుంది. ఖాతాదారులు తెలిపిన వివరాల ప్రకారం... మణప్పురం సంస్థలో గోల్డ్ లోన్ తీసుకున్న పలువురు ప్రతి నెలా బ్యాంక్‌కు వచ్చి వడ్డీ డబ్బులు చెల్లించేవారు. ఈ క్రమంలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఉపేంద్రమ్మ అనే మహిళ వడ్డీ డబ్బులు జమ చేసుకునే సెక్షన్‌లో కూర్చొని ఖాతాదారుల నుంచి డబ్బులు తీసుకునేది. తీసుకున్న డబ్బులకు రసీదు ఇవ్వకుండా.. మొబైల్‌కు మెసేజ్ వస్తుందని చెప్పేంది.
తప్పనిసరిగా రసీదు కావాలని అడిగిన వారికి ఓ వైట్ పేపర్‌పై వారు తీసుకున్న అసలు, చెల్లించిన వడ్డీ వివరాలు రాసి సంతకం పెట్టి ఇచ్చేది. అనుమానం వచ్చిన ఓ ఖాతాదారుడు మంగళవారం సంస్థకు వచ్చి తాన తీసుకున్న అప్పు, ఇంకా ఎంత చెల్లించాలో పూర్తి వివరాలు ఇవ్వాలని కోరాడు. దీంతో అసలు, వడ్డీ కలిపి చెప్పడంతో ఆందోళనకు గురయ్యాడు. తాను ఇన్ని రోజులు కట్టిన వడ్డీ ఏమైందని ప్రశ్నించడంతో ఆ డబ్బులను సదరు ఉద్యోగి సొంతానికి వాడుకున్నట్లు తేలింది.
ఇలా 10 మంది ఖాతాదారులకు సంబంధించిన రూ. 5 లక్షలు వాడుకున్నట్లు గుర్తించారు. దీంతో ఆందోళనకు గురైన ఖాతాదారులు సంస్థ ఆఫీస్‌లో ఆందోళనకు దిగారు. ఈ విషయంపై మేనేజర్ ఎండి. ఫజల్‌ను నిలదీయగా.. తాను కొత్తగా చార్జ్ తీసుకున్నానని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఖాతాదారులు, మేనేజర్ కలిసి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.