గిట్టుబాటు అయితలే..భారీగా తగ్గిన మిర్చి, పల్లి రేట్లు

గిట్టుబాటు అయితలే..భారీగా తగ్గిన మిర్చి, పల్లి రేట్లు
  • ఖమ్మం మార్కెట్‌‌‌‌లో క్వింటాల్‌‌‌‌ రూ.13,300 పలికిన మిర్చి
  •  గత వారం రూ.16,300లకు కొన్న వ్యాపారులు
  •  వనపర్తిలో పల్లికి గరిష్ఠంగా రూ. 6,517, కనిష్టంగా రూ. 4,219
  •  ఎగుమతులు  లేక రేట్లు తగ్గాయంటున్న వ్యాపారులు


ఖమ్మం, వెలుగు : ఎండు మిర్చి రేటు రోజు రోజుకు పతనం అవుతోంది. గత వారం నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌‌‌కు మిర్చి తీసుకొస్తున్న రైతులకు రేటు విషయంలో నిరాశే ఎదురవుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గడంతో ఇప్పటికే బాధలో ఉన్న రైతులకు.. రేటు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో అసలు కూలీ ఖర్చులు, పెట్టుబడైనా వస్తుందా ? రాదా ? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఐదు రోజుల్లోనే రూ. 3 వేలు తగ్గుదల

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో తేజ రకం మిర్చి 2022లో క్వింటాల్‌‌‌‌ రూ.25 వేలను దాటింది. గతేడాది అత్యధికంగా రూ.22 వేలు పలికిన మిర్చి, ఈ ఏడాది జనవరిలో కూడా రూ.20 వేలను తాకింది. మార్చిలో రూ.22 వేలకు పెరిగి తర్వాత క్రమంగా తగ్గడం మొదలైంది. బుధవారం నాటికి క్వింటాల్‌‌‌‌ రూ. 16,300 పలికిన మిర్చి సోమవారానికి రూ. 13,300కు పడిపోయింది. ఐదు రోజుల్లోనే రూ. 3 వేలు పడిపోవడంతో రైతులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. అదే సమయంలో ఏసీ మిర్చి ధర కూడా క్రమంగా తగ్గుతోంది. ఏసీ మిర్చి సోమవారం క్వింటాల్‌‌‌‌ జెండా పాట రూ.17,800 గా నమోదు కాగా, ఎక్కువ మంది రైతుల నుంచి రూ.14 వేల లోపు రేటుకే వ్యాపారులు కొనుగోలు చేశారు. 

వాతావరణ మార్పులు, తెగుళ్లతో తగ్గిన దిగుబడి

ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతులకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ఈ సీజన్‌‌‌‌లో 90 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మిర్చి వేసే సమయంలో విపరీతమైన ఎండల కారణంగా మొక్కలు పెద్దఎత్తున చనిపోయాయి. ఆ స్థానంలో మళ్లీ మొక్కలు నాటాల్సి రావడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగింది. సెప్టెంబర్‌‌‌‌ నెలలో వర్షాలు, వరదల కారణంగా తోటల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో మొక్కలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత గుబ్బ తెగులు, కొమ్మకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశించాయి. దీంతో మిర్చి దిగుబడి భారీస్థాయిలో పడిపోయింది. 

తగ్గిన విదేశీ ఆర్డర్లు

ఖమ్మం జిల్లాలో పండించే తేజ రకం మిర్చికి చైనా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేషియా, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ దేశాల్లో విపరీతమైన డిమాండ్‌‌‌‌ ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆ దేశాల నుంచి ఆర్డర్లు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామని, దీని కారణంగా రేటు విపరీతంగా తగ్గిందని మిర్చి వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది కనీస ధర కూడా రాకపోగా, ఇప్పుడు మరింత పడిపోవడంతో కోల్డ్‌‌‌‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులు, వ్యాపారులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 40 కోల్డ్‌‌‌‌ స్టోరేజీల్లో 20 లక్షల బస్తాల మిర్చి నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది.

రూ.14 వేలకు అమ్మిన 

మిర్చి ధర రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో గత్యంతరం లేక క్వింటాల్‌‌‌‌ రూ. 14 వేల చొప్పున 21 బస్తాలను అమ్మిన. గతేడాది మంచి ధర పలికింది. ఈ ఏడాది అంతకుమించి ధర వస్తదని ఆశపడితే నిండా మునిగినం. కోల్డ్‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌లో బస్తాలకు కిరాయి, వడ్డీలు పెరుగుతాయన్న భయంతో అగ్గువకే అమ్మేసిన.- గుగులోతు పూర్వ, మాసినపల్లి, సూర్యాపేట జిల్లా

ఎగుమతులు లేవు 

తేజ రకం మిర్చి ఎగుమతులు పూర్తిగా పడిపోయాయి. నాగపూర్‌‌‌‌, ఘజియాబాద్, బరంపుర ట్రేడర్ల నుంచి ఎగుమతులు లేకపోవడంతో రేటు తగ్గింది. దీంతో కొనేందుకు ఎవరూ ముందుకు వస్తలే. మిర్చి క్వాలిటీ, పొడవు లేకపోవడంతో పాటు ఇతర కారణాలతో ఎక్కువ ధర పడ్తలే.- సాదినేని వెంకట్, వ్యాపారి